Asia Cup 2023: ఫైనల్ ఫైట్‌లో టీమిండియా ఓటమి.. భారీ తేడాతో పాక్ గెలుపు

ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ ఫైనల్లో భాగంగా కొలొంబో వేదికగా ఇవాళ జరిగిన తుది మ్యాచ్‌లో పాకిస్తాన్‌-ఏ.. భారత-ఏ జట్టుకు షాకిచ్చింది.

Update: 2023-07-23 16:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ ఫైనల్లో భాగంగా కొలొంబో వేదికగా ఇవాళ జరిగిన తుది మ్యాచ్‌లో పాకిస్తాన్‌-ఏ.. భారత-ఏ జట్టుకు షాకిచ్చింది. పాక్‌ 128 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. 353 భారీ లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా.. 224 పరుగులకు ఆలౌటైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా శుభారంభమే లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (29), కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో సుఫియాన్‌ ముఖీమ్‌ 3 వికెట్లు తీయగా.. అర్షద్‌ ఇక్బాల్‌, మెహ్రాన్‌ ముంతాజ్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌ తలో 2 వికెట్లు, ముబాసిర్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో పాక్ మొదట బ్యాటింగ్ చేయగా.. పాక్ ఓపెనర్లు సైమ్‌ అయూబ్‌ (51 బంతుల్లో 59), సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (62 బంతుల్లో 65) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్‌ తాహిర్‌ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత బౌలర్లలో హంగార్గేకర్‌, రియాన్‌ పరాగ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, మానవ్‌ సుతార్‌, నిషాంత్‌ సింధు తలో వికెట్‌ తీశారు.


Similar News