స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై వేటు!
దిశ, స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్ఐ)కు గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ నిరాకరించడంతో క్రీడాకారుల్లో ఆందోళన మొదలైంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ప్రతి క్రీడాకారుడు ఎస్జీఎఫ్ఐ కిందకు వస్తారు. ఇప్పుడు ఆ ఫెడరేషన్‌కు గుర్తింపు లేకపోవడంతో ఆయా క్రీడల్లో పాల్గొనే వారికి ఇచ్చే సర్టిఫికేట్లు చెల్లుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. చిన్నప్పటి నుంచి చదవుతోపాటు క్రీడల్లో రాణిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారింది. సాధారణ పాఠశాలల్లో చదివే […]
దిశ, స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్ఐ)కు గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ నిరాకరించడంతో క్రీడాకారుల్లో ఆందోళన మొదలైంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ప్రతి క్రీడాకారుడు ఎస్జీఎఫ్ఐ కిందకు వస్తారు. ఇప్పుడు ఆ ఫెడరేషన్‌కు గుర్తింపు లేకపోవడంతో ఆయా క్రీడల్లో పాల్గొనే వారికి ఇచ్చే సర్టిఫికేట్లు చెల్లుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. చిన్నప్పటి నుంచి చదవుతోపాటు క్రీడల్లో రాణిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారింది. సాధారణ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు అనేక మంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాఠశాల క్రీడలను ఆడుతున్నారు. వీరిని ఆయా క్రీడా పోటీలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియానే పంపుతుంది. అయితే, తాజాగా సదరు ఫెడరేషన్ గుర్తింపును పొడిగించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిరాకరించింది. దీంతో వందల మంది మంది క్రీడాకారుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
అసలేం జరిగింది..
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో 2017లో పసిఫిక్ స్కూల్ గేమ్స్ నిర్వహించారు. ఈ క్రీడలకు ఇండియా తరఫున బాలికల హాకీ టీంను ఎస్జీఎఫ్ఐ పంపించింది. విరామ సమయంలో నితిశ నేగి (15) అనే క్రీడాకారిణి అడిలైడ్ బీచ్‌లో ఈతకు వెళ్లి మునిగి చనిపోయింది. ఈ ఘటనపై ఎస్జీఎఫ్ఐ విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ కూడా పూర్తి వివరాలతో నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది. క్రీడాకారిణి మృతికి టీంతోపాటు ఉన్న సిబ్బంది కారణమంటూ తేల్చిన ఎస్జీఎఫ్ఐ కోచ్‌తోపాటు ముగ్గురు మేనేజర్లపై జీవితకాలం వేటు వేసింది. ఇదే విషయం క్రీడా మంత్రిత్వశాఖకు కూడా తెలియజేసింది. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలని క్రీడా శాఖ కోరింది. కోచ్, మేనేజర్ల పేర్లు తెలియజేయాలని కోరుతూ లేఖ రాసింది. పదే పదే లేఖలు రాసినా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సరిగ్గా స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన క్రీడా మంత్రిత్వ శాఖ గత ఏడాది ఎస్‌జీఎఫ్‌ఐకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫెడరేషన్ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కోరింది. అయినా ఎస్జీఎఫ్ఐ వివరణ ఇవ్వడంలో విఫలం కావడంతో గుర్తింపును రద్దు చేసింది. మే 10న దేశంలోని 54 క్రీడా ఫెడరేషన్ల గుర్తింపును డిసెంబర్ వరకు పొడిగించిన క్రీడా మంత్రిత్వ శాఖ ఎస్జీఎఫ్ఐ గుర్తింపును మాత్రం పొడిగించలేదు.
ఏది దారి?
క్రీడా శాఖ గుర్తింపు కోల్పోవడంతో ఎస్జీఎఫ్ఐ తరఫున టోర్నీల్లో పాల్గొంటున్న వేల మంది పాఠశాల క్రీడాకారుల భవిత్వం అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటి వరకు వాళ్లు పొందిన సర్టిఫికేట్ల గుర్తింపు కూడా ప్రశ్నార్థకంగా మారింది. పై చదువులు, ఉద్యోగాల్లో క్రీడా శాఖ గుర్తించిన సర్టిఫికేట్లకు మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. ఇప్పుడు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గుర్తింపు లేకపోవడంతో వందల మంది క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ విషయంపై ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ కోచ్ స్పందిస్తూ ఉన్నత స్థాయి అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. కరోనా కారణంగా ప్రస్తుతం క్రీడలైతే జరగడం లేదు. కానీ, విద్యాసంస్థలు ప్రారంభమైతే వందల మంది క్రీడాకారులు కొత్త కాలేజీల్లో చేరడానికి ఎస్జీఎఫ్ఐ జారీ చేసిన సర్టిఫికేట్లను వాడాల్సి ఉంటుంది. అప్పటి వరకైనా సమస్యను పరిష్కరించి, గుర్తింపు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.