హస్తిన‌కు జగన్.. ‘మూడ్‌’లో మూడు!

        వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేమి? శాసన మండలి రద్దు కోసమేనా? లేక తనపై ఉన్న కేసుల్లో వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపు తెచ్చుకునేందుకా? అదీ కాక కొత్త పొత్తు కోసం జగన్ ఆఘమేఘాలపై వెళ్తున్నారా? అన్న చర్చ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతోంది. ఇంతకీ జగన్ హస్తినకు ఎందుకు వెళ్తున్నారు? అన్న వివరాల్లోకి వెళ్తే..         వైఎస్సార్సీపీ అధికారం […]

Update: 2020-02-12 02:45 GMT

వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేమి? శాసన మండలి రద్దు కోసమేనా? లేక తనపై ఉన్న కేసుల్లో వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపు తెచ్చుకునేందుకా? అదీ కాక కొత్త పొత్తు కోసం జగన్ ఆఘమేఘాలపై వెళ్తున్నారా? అన్న చర్చ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా సాగుతోంది. ఇంతకీ జగన్ హస్తినకు ఎందుకు వెళ్తున్నారు? అన్న వివరాల్లోకి వెళ్తే..

వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన మొదట్లో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలుండేవి. సుదీర్ఘ రాజకీయ మైత్రికి టీడీపీ చరమగీతం పాడడానికి తోడు ఊహించని విధంగా శత్రుత్వం రావడంతో ఏపీలో పాతుకుపోదామనుకున్న బీజేపీకి వ్యూహాలు అమలు చేయలేకపోయింది. రాజధాని అమరావతి అంశంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం నుంచి సానుకూల పవనాలు వీయడం లేదు. ఇదే సమయంలో అమరావతి ఆందోళనలను టీడీపీ నెత్తిన వేసుకుని హల్‌చల్ చేస్తోంది. పొత్తు కుదుర్చుకున్న జనసేన ఊహించినంత చైతన్యవంతంగా జనాల్లోకి చొచ్చుకెళ్లడం లేదు. ఇదే సమయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖాండ్, ఢిల్లీ వంటి చోట్ల బొక్కబోర్లా పడడంతో ఇకపై ఇతర రాష్ట్రాల్లో పాతుకుపోయేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తుందా? అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి హస్తిన బయల్దేరుతున్నారా?


సీఎం పదవి చేపట్టిన తొలినాళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి న్యాయం చేస్తామన్న హామీలు లభించేవి.. కాలక్రమేనా మాటలైతే కోటలు దాటుతున్నాయి కానీ చేతలు శూన్యంగా మారాయి. దీంతో బీజేపీతో వైఎస్సార్సీపీ వ్యూహాత్మక చెలిమిని ప్రదర్శిస్తోంది. కేంద్రానికి అవసరమైన బిల్లుల్లో ఆమోదం తెలుపుతూ మచ్చిక చేసుకుంది. రాష్ట్రంలో కూడా బీజేపీతో నేరుగా శత్రుత్వం కొనుక్కోకుండా.. టీడీపీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ, ఆ పార్టీ చేసిన విమర్శలను తిప్పికొడుతూ కేంద్రానికి సానుకూలంగా మారింది. దీంతో ఏపీలో వైఎస్సార్సీపీపై బీజేపీ పూర్తి వ్యతిరేక వైఖరిని అవలంభించడం లేదు. దీనిని ఆవకాశంగా మలచుకున్న విజయసాయిరెడ్డి బీజేపీతో మైత్రిని రెండో దశకు తీసుకెళ్లేదిశగా లాబీయింగ్ చేశారు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు లాబీయింగ్‌లో సిద్ధహస్తుడైన విజయసాయిరెడ్డి వ్యూహం ఫలించిందని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో త్వరలో జరుగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో వైఎస్సార్సీపీకి స్థానం లభించనుందన్న ఊహానాలు ఏపీలో ఊపందుకున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి విజయసాయిరెడ్డికి లేదా మిథున్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో స్థానం లభించనున్నట్టు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి స్థానం లభించినా ఏపీకి మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకపోవడంతోనే రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు కానీ అదనపు నిధులు కానీ కేటాయింపులు కానీ జరగడం లేదని ఆ పార్టీ భావిస్తోంది. దీంతోనే వ్యూహాత్మక చెలిమి ద్వారా కేంద్రం నుంచి నిధులు రాబట్టవచ్చని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో జగన్ హస్తిన పర్యటనపై మరో రెండు వాదనలు వినిపిస్తున్నాయి.


గతంలో జగన్‌పైనున్న కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలంటూ చాలాకాలంగా పోరాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాకైనా కోర్టు సానుకూలంగా స్పందిస్తుందని భావించారు. సీఎం అయినప్పటికి కూడా కోర్టు కనికరించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వడం లేదు. అదే సమయంలో సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ పలుసందర్భాల్లో రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని దృష్టిలో పెట్టుకుని లాబీయింగ్ చేసేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు శాసనమండలిని రద్దు చేయించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లుపై శాసనమండలి కొర్రీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును సవరించాలంటూ సెలెక్ట్ కమిటీకి శాసన మండలి పంపించింది. శాసన సభ ఆమోదించిన బిల్లును శాసనమండలి ఆమోదించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. దీనిని కేంద్రానికి పంపించింది. శాసనమండలి రాష్ట్రానికి అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే.. టీడీపీ కీలక నేతలంతా నిరుద్యోగులవుతారని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఎలాగైనా తీర్మానం ఆమోదం పొందేలా చేసేందుకు… దానిపై పూర్తి వివరణ ఇచ్చేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం తిరిగివచ్చి లేదా అక్కడ మీడియా సమావేశం నిర్వహించి.. భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తే తప్ప ఆయన హస్తిన ప్రయాణానికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం లేదు.

Tags:    

Similar News