‘కేసీఆర్ సర్కార్ కు త్వరలోనే ముంపు ముప్పు’
దిశ, తెలంగాణ బ్యూరో : ఏ పని చేసినా జనాన్ని ముంచడమే తప్ప మంచి చేయడం తెలియని టీఆర్ఎస్ సర్కారుకు ముంపు ముప్పు దగ్గర్లోనే ఉందని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లలోని మాయలేంటో జంటనగరాల ప్రజలకు బాగా తెలుసు అన్నారు. వానలు పడినప్పుడల్లా కాల్వల్ని తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు, నాలాల బారిన పడి […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఏ పని చేసినా జనాన్ని ముంచడమే తప్ప మంచి చేయడం తెలియని టీఆర్ఎస్ సర్కారుకు ముంపు ముప్పు దగ్గర్లోనే ఉందని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లలోని మాయలేంటో జంటనగరాల ప్రజలకు బాగా తెలుసు అన్నారు. వానలు పడినప్పుడల్లా కాల్వల్ని తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు, నాలాల బారిన పడి జనం విలవిలలాడుతున్నారని అన్నారు. వర్షాలు తగ్గగానే ఈ సమస్యలు మళ్లీ తలెత్తకుండా చూస్తామంటూ గత ఏడేళ్ల నుంచి పాలకులు చెబుతుండటం… జనం వింటుండటం మామూలైపోయిందని, ఇప్పుడు వరంగల్ ప్రజలకు ఇదే అనుభవాన్ని అధికార పార్టీ నేతలు అందిస్తున్నారని ధ్వజమెత్తారు.
గతేడాది వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ జలమయమై ఇంకా తేరుకోకముందే… గత రెండు మూడ్రోజులుగా కురుస్తున్న వానలకు మళ్లీ భీతిల్లిపోయే పరిస్థితి వచ్చిందని, కిందటి సంవత్సరం ఆగస్టులో వానలు కురిసినప్పుడు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికార్లు ఉరుకులు పరుగుల మీద సుడిగాలి పర్యటన చేసి వరంగల్ పరిసరాల్లో చోటు చేసుకున్న వందలాది ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, వెంటనే చర్యలు తీసుకుని ముంపు ముప్పు తప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇదెంత నిజమో వరంగల్ వాసులకు ఇప్పుడు అర్థమవుతోందని, గత రెండ్రోజులుగా కురుస్తున్నవర్షాలతో సుమారు 30 కాలనీలు నీట మునిగాయని, ఆక్రమణల కూల్చివేత పనులు అరకొరగా చేస్తున్నారని ఆరోపించారు. కీలకమైన ప్రాంతాల్లో నాలాలపై ఆక్రమణల తొలగింపు… అడ్డుగోడల నిర్మాణం ఊసే లేదని, అవగాహన లేకుండా కాల్వలపై శ్లాబ్‌లు వేసి… రోడ్ల కంటే ఎత్తులో డ్రైనేజీలు కట్టి చారిత్రక వరంగల్ నగరాన్ని మరింత మురికి కూపం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కు ఓటువేసినా టీఆర్ఎస్ లోకే…
కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించినా టీఆర్ఎస్ లోనే చేరతారని విజయశాంతి అన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన విషయం మన కళ్లముందే ఉందన్నారు. 2018 లో కాంగ్రెస్ నుంచి హుజూరాబాద్ లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారని, ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పడం అర్థం చేసుకోవాల్సిన పరిణామం అన్నారు. కౌశిక్ రెడ్డి మాత్రమే కాదు తెలంగాణలో కాంగ్రెస్ తో ఎన్నికలు సాధ్యపడదనే అభిప్రాయంచాలా మంది నేతల్లో ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్న పీసీసీ ప్రకటన కూడా మాటలకే పరిమితమయ్యేలా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ను లూటీ చేసి, అప్పుల్లో నెట్టిన టీఆర్ఎస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అన్నారు.