బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి మృతిపై శివస్వామి సంచలన వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయం రోజుకో మలుపు తిప్పుతోంది. పీఠాధిపతిని ఎంపిక చేసేందుకు పీఠాధిపతుల బృందం వచ్చినప్పటికీ ఎంపిక విషయంలో మాత్రం చిక్కుముడి వీడటం లేదు. ఈ సమస్య తలెత్తినప్పటి నుంచి పరిష్కరించేందుకు శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పరిస్థితి చేయదాటి పోవడంతో బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక కోసం పీఠాధిపతుల బృందాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పీఠాధిపతుల బృందం కన్వీనర్ శివస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మంగారి […]
దిశ, ఏపీ బ్యూరో: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయం రోజుకో మలుపు తిప్పుతోంది. పీఠాధిపతిని ఎంపిక చేసేందుకు పీఠాధిపతుల బృందం వచ్చినప్పటికీ ఎంపిక విషయంలో మాత్రం చిక్కుముడి వీడటం లేదు. ఈ సమస్య తలెత్తినప్పటి నుంచి పరిష్కరించేందుకు శ్రీశైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పరిస్థితి చేయదాటి పోవడంతో బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక కోసం పీఠాధిపతుల బృందాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పీఠాధిపతుల బృందం కన్వీనర్ శివస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మంగారి మఠం దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. దివంగత పీఠాధిపతి ఆరోగ్యంగా ఉన్నారు..డిశ్చార్జ్ చేస్తాం అని వైద్యులు ప్రకటించిన మరుసటి రోజే మృతి చెందడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారని తెలిపారు.
దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మృతిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని శివస్వామి వెల్లడించారు. ఆ తర్వాతే తదుపరి మఠాధిపతి ఎవరు అన్నది తాము ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. అంతకుముందు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్న పీఠాధిపతుల బృందం ఉదయం వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధిని దర్శించుకుంది. 9 గంటలకు ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోన్నారు. దర్శనం తర్వాత అమ్మవారి శాల కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పీఠాధిపత్యం కోసం రెండు కుటుంబాలు పోటీ పడుతుండగా.. మఠాధిపతుల బృందం చర్చిస్తోంది. మఠాధిపతుల బృందం ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రికి నివేదిక ఇచ్చింది.
సామరస్యంగా పరిష్కరించుకుందాం: మంత్రి వెల్లంపల్లి
బ్రహ్మంగారి మఠం పవిత్రతను కాపాడాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పీఠాధిపతి ఎంపిక విషయంలో ఎవరూ వివాదాలకు పోవద్దని హితవు పలికారు. అప్పటి వరకు మఠం నిర్వహణకు అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మరణించినప్పటి నుంచి తదుపరి వారసులపై ఆయన ఇద్దరు భార్యలు పోటీపడుతున్నట్లు తెలిపారు. రెండోభార్య తన కుమారుడినే వారసుడిగా ప్రకటిస్తూ వీలునామా రాశారని చెప్తున్నారన్నారు. దేవాదాయ చట్టం ప్రకారం అది పీఠాధిపతి మరణించిన 90రోజుల్లో తమకు అందించాలని అలా అందలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 128 పీఠాలు, మఠాలు ఉన్నాయని వారిలో మెజారిటీ సభ్యులు ఎవరికి మద్దతు పలికితే వారినే పీఠాధిపతిగా నియమిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అంశంలో ఇతరుల జోక్యం అవసరంలేదని దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య మహలక్ష్మమ్మ ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశారు. పెద్ద భార్య కుమారుడిని పీఠాధిపతిని చేసేందుకు కుట్ర జరుగుతోందని మహాలక్ష్మమ్మ ఆరోపించారు. మెుత్తానికి నూతన పీఠాధిపతి ఎంపిక అనేక మలుపులు తిరుగుతుంది. దీంతో బ్రహ్మంగారి మఠం పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుంది..? కొత్త పీఠాధిపతి ఎవరు అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.