మా బాధ వినేదెవరు..?
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని వరద బాధితులు గత 11 రోజులుగా మురికి కూపంలోనే కాలం వెళ్ళదీస్తున్నారు. ఇంటి తలుపులు మూసినా, తెరిచినా వాంతి వచ్చేట్టుగా దుర్వాసనలు, అంతకు మించి అసహ్యం వేసే వ్యర్థాలతో కూడిన బురద. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. ఇదీ మల్కాజిగిరి పరిధిలోని షిరిడీనగర్, ఎన్ఎండీసీ కాలనీల దయనీయ స్థితి. సుమారు 150 కుటుంబాలు నిత్యం నరకయాతన పడుతున్నాయి. వరదలు వచ్చి పది రోజులవుతున్నా శానిటేషన్ పనులు చేపట్టడంలేదు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని వరద బాధితులు గత 11 రోజులుగా మురికి కూపంలోనే కాలం వెళ్ళదీస్తున్నారు. ఇంటి తలుపులు మూసినా, తెరిచినా వాంతి వచ్చేట్టుగా దుర్వాసనలు, అంతకు మించి అసహ్యం వేసే వ్యర్థాలతో కూడిన బురద. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. ఇదీ మల్కాజిగిరి పరిధిలోని షిరిడీనగర్, ఎన్ఎండీసీ కాలనీల దయనీయ స్థితి. సుమారు 150 కుటుంబాలు నిత్యం నరకయాతన పడుతున్నాయి. వరదలు వచ్చి పది రోజులవుతున్నా శానిటేషన్ పనులు చేపట్టడంలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు స్పందించడం లేదు. దీంతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
11 రోజులుగా కనిపించని శానిటేషన్
గత 11 రోజులుగా ఇంటిలోనే ఉంటూ 150 కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. ఓ వైపు మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయి. మరో వైపు వరద తెచ్చిన బురద దుర్వాసనలను వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. కుక్కలు వ్యర్థాలను చిందరవందర చేస్తున్నాయి. సెల్లార్లలోకి, ఇండ్లలోకి ఇంకా నీరుచేరి ఉండటంతో ఇండ్లలోని వారు, అపార్టుమెంట్లలోని వారు బయటకురాలేని దయనీయ స్థితిలో ఉన్నారు. కనీసం ఇంట్లో నిండుకుంటున్న సరుకులను సమకూర్చుకోలేని స్థితిలో వారున్నారు. కూరగాయల వారు రావడంలేదు. బజారుకెళ్ళి వాటిని తీసుకోలేని దుస్థితి. పాలు, ఉప్పులు, పప్పులు, నూనెలు తెచ్చుకునేందుకు వీలు కావడంలేదు. కలుషితమైన తాగునీరు సరఫరా జరుగుతోంది. కొందరు మహిళలే ధైర్యం చేసి బురదైనా, మురుగైనా, వరద నీరైనా భరిస్తూ సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇది చూసి భరించలేక కాలనీల వాసులు, యువకులు ఫోన్ ల ద్వారా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదులు చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని వారు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కనీసం శానిటేషన్ పనులు చేపట్టడంలేదు. బ్లీచింగ్ పౌడర్, మలేరియా ఆయిల్, చెత్త వ్యర్థాల తొలగింపు ప్రక్రియను మునిసిపల్ అధికారులు మొదలుపెట్టలేదు.
అందని నగదు పరిహారం..
షిరిడీనగర్, ఎన్ఎండీసీ కాలనీ వాసులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు పరిహారం రూ.10 వేలు అందలేదు. రెండు రోజులైనా మునిసిపల్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పరిహారం జాబితాను తయారు చేసేందుకు రాలేదు. కొందరి బోర్లు, వాటి మోటార్లు, ద్విచక్ర వాహనాలు పాడయ్యాయి. వరదల్లో నష్టపోయిన ప్రతి ఇంటికీ నగదు పరిహారం అందాలి. కానీ వారు నగదు పరిహారానికన్నా బురద తొలగించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
మా బాధ వినేదెవ్వరూ? : – వి.యాదగిరి యాదవ్, షిరిడీనగర్ మాజీ అధ్యక్షుడు
ఏటా వర్షాకాలంలో షిరిడీ నగర్ మునుగుతోంది. కానీ చర్యలు వెంటనే ఉండేవి. కానీ ఈ మారు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ఇంటి నుంచి బయటకు రాలేక అవస్థలు పడుతున్నాం. కనీసం మ్యాన్ హోల్స్ క్లీన్ చేయాలి. పేరుకున్న బురదను తొలగించాలి.
ఇంత నిర్లక్ష్యమా : – వి.బాల్ రాజు, మాజీ ఏఎస్ఐ, షిరిడీనగర్
షిరిడీ నగర్ అంటే ఇంత నిర్లక్ష్యమా..? వరద మాట దేవుడెరుగు కానీ, మురుగును తొలగించాలంటే ఎవ్వరూ స్పందించరేం..? పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు, బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లక పోవడం బాధాకరం. పాలకులు ఇలా వ్యవహరించడం వారి నిర్లక్ష్యానికి తార్కాణం.
ఎంత చెప్పినా.. పట్టించుకుంటేగా : – లక్ష్మి, షిరిడీనగర్
ఎవ్వరికి చెప్పినా అసలు పట్టించుకుంటే కదా.. రాత్రింబవళ్ళు ఈ మురికిలోనే ఉంటున్నాం. ప్రతి ఏటా జరుగుతున్నదే. కష్టాలు పడుతున్నదే.. నాయకులు వచ్చి మాటలు చెప్పి వెళ్ళిపోవడం, వరదలు ఏటా రావడం షరామామూలే.