ఐ పిల్ సురక్షితమేనా? శృంగారానికి ముందా.. తర్వాత వాడాలా..?

ఈ మధ్య ఐ పిల్ వాడకం బాగా ఎక్కువయ్యింది. అసలు దీనిని వాడవచ్చా? వాడితే ఏయే సమయాల్లో వాడాలి? ఎన్నిసార్లు వాడాలి..?

Update: 2025-03-08 15:04 GMT
ఐ పిల్ సురక్షితమేనా? శృంగారానికి ముందా.. తర్వాత వాడాలా..?
  • whatsapp icon

మధ్య ఐ పిల్ వాడకం బాగా ఎక్కువయ్యింది. అయితే ఈ మాత్రకు సంబంధించి చాలామందిలో చాలా అనుమానాలు రేకెత్తున్నాయి. అసలు దీనిని వాడవచ్చా? వాడితే ఏయే సమయాల్లో వాడాలి? ఎన్నిసార్లు వాడాలి..? ఇలాంటి రకరకాల అపోహలు ప్రజల్లో ఉన్నాయి! లివో నార్‌జెస్టరాల్ 15 యంజి(Levo Norgesterol 15 mg). హార్మోను (Hormones)తో తయారు చేసిన ఐ పిల్(I pill)... అత్యవసర, అనివార్య పరిస్థితుల్లో మాత్రమే వాడదగ్గ గర్భనిరోధక మాత్ర (Birth control pill). గర్భనిరోధక జాగ్రత్తలు పాటించకుండా శృంగారం(romance)లో పాల్గొన్నప్పుడు వచ్చే గర్భధారణను రాకుండా అడ్డుకోటానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.

ఎప్పుడు వాడాలి?

వివాహిత స్త్రీలు క్రమంగా వాడే గర్భనిరోధక మాత్రలు రెండు మూడు రోజులు వేసుకోవడం మర్చి పోయినప్పుడు, సెక్స్ సమయంలో కండోమ్(Condom) చిరిగి పోయినప్పుడు, లైంగిక అత్యాచారా(sexual assault)నికి గురైనప్పుడు, ఇలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఐ పిల్‌ను వాడాలి. సాధ్యమయినంత వరకు దీనని శృంగారంలో పాల్గొన్న వెంటనే వేసుకుంటేనే మంచిది. లేదంటే కలయిక జరిగిన మూడు రోజుల లోపున వేసుకోవాలి. ఆ తర్వాత వేసుకున్నా ఉపయోగం ఉండదు.

ఎలా పని చేస్తుంది?

ఐ పిల్ పనిచేసే విధానం రుతుచక్రం(Menstrual cycle)లోని దశలమీద ఆధారపడి ఉంటుంది. ఇది అండాశయం నుంచి అండం విడుదల కాకుండా ఆపుతుంది. ఒకవేళ అండం విడుదల అయితే, వీర్యకణాలు అండాన్ని చేరి ఫలదీకరణ చెందకుండా చేస్తుంది. ఒక వేళ ముందే ఫలదీకరణ చెంది ఉంటే అండాన్ని గర్భాశయ గోడలకు అంటుకోకుండా చేస్తుంది.

ఎవరు వాడకూడదు?

99 శాతం దీన్ని వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే దీన్ని వేసుకోవడం వల్ల కొన్నిసార్లు వాంతులు, వికారం, తలనొప్పి, పొత్తి కడుపులో నొప్పి, ఆకలి మందగించటం, వక్షోజాల్లో నొప్పి, శరీరంలో నీరు చేరి వాపు రావడం, యోని నుంచి రక్తస్రావం జరగడం, నెలసరితో సంబంధం లేకుండా రక్తస్రావం జరగడం, పీరియడ్స్ త్వరగా లేక మరీ ఆలస్యంగా రావడం, నెలసరి క్రమం తప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అండవాహికలో గర్భం వచ్చినవాళ్లు (ఎక్టోపిక్ (పెగ్నెన్సీ), సాల్ఫిన్ జైటిస్ లేదా ఫాలోపియన్ లేదా అండవాహికలలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్లు, ఐ పిల్ తీసుకోవడం మరీ ప్రమాదం. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే, గైనకాలజిస్టు సలహా తీసుకుని తీరాలి. అలా కాకుండా నేరుగా మెడికల్ షాపు నుంచి తెచ్చుకుని వేసుకోవడం మంచిది కాదు. ఇది వాడిన తర్వాత పీరియడ్స్ ఒక వారం కంటే ఆలస్యంగా వస్తే మాత్రం, తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ టెస్ట్ (Pregnancy test) చేయించుకోవడం మంచిది.

దుష్ప్రభావాలు..

ఇది వాడటం వల్ల ఒక్కోసారి తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్స్ అంటే, దురద, మంట, శ్వాస తీసుకోవడంలో కష్టం, ఛాతీ బిగుసుకు పోవడం, నోరు- గొంతు- నాలుక పెదవులలో వాపు వచ్చినట్టు అనిపించటం, గొంతు శబ్దం మారటం వంటి తీవ్రస్థాయి సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి నెలసరి పూర్తిగా ఆగిపోతుంది. వక్షోజాల్లో గడ్డలు రావడం, నీరులాంటి ద్రవం కారడం జరుగుతుంది. కాలి కాఫ్ మజిల్‌లో నొప్పి, వాపు కలగవచ్చు. మూత్రం గాఢమైన రంగులోకి మారడం, మూత్ర విసర్జనలో మార్పులు రావచ్చు. దగ్గినప్పుడు రక్తం పడటం, శరీరం ఒకవైపు తిమ్మిరెక్కడం, బలహీనంగా అనిపించడం వంటివి కూడా జరుగుతాయి.

లైంగిక వ్యాధులను అరికట్టదు!

ఇక రక్తం గడ్డకట్టే వ్యాధి చరిత్ర ఉన్నవారు, కరొనరీ డిజార్డర్స్, గుండెజబ్బులు, అడ్వాన్స్డ్ డయాబెటిస్, ఆరా (AURA) కనిపించే మైగ్రెయిన్ వ్యాధి, నియంత్రించలేని అధిక రక్తపోటు, బ్రెస్ట్ క్యాన్సర్, యాక్టివ్ లివర్ వ్యాధులు, కామెర్లు ఉన్నవారు ఒక్క ఐ పిల్‌ను వాడినా ప్రమాదం. అలాగే ఫిట్స్‌తో బాధపడుతున్న రోగులకు వాడే ఫినటాయిన్, కార్బామెజ్ పైన్, బార్బిట్యురేట్స్, టీబీ వ్యాధి తగ్గటానికి వాడే రిఫామ్‌పిసిన్ వంటి మందులతో పాటు ఐ పిల్‌ను వేసుకోకూడదు. పై మందులు వాడే వారితో పాటు పిల్లలకు పాలు పట్టే స్త్రీలు కూడా వీలైనంత వరకూ దీనిని వాడకుండా ఉండటమే మంచిది. చివరగా ఒక విషయం. లైంగిక వ్యాధులు, ఎస్టీడీలు, హెచ్ఐవీ 1, 2ల నుంచి ఐ పిల్ రక్షించదు. వాటికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదు. ఆ వ్యాధులు ఉన్నవారితో కలిస్తే తప్పనిసరిగా కండోమ్ వాడి తీరాలి.

- డాక్టర్ భారతి,

సెక్సువల్ హెల్త్ & ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ & సెక్సువల్‌ కౌన్సెలింగ్

For more Sex Education news 

Tags:    

Similar News