బ్రిటీషర్ల క్రూయల్ మైండ్‌ను ప్రపంచానికి తెలిపిన సర్దార్
దిశ, సినిమా : యవ్వనం దేవుడిచ్చిన వరం.. అల్లరి చిల్లరగా అనుభవించి వృథా చేస్తారా? లేదా సమానత్వం, స్వేచ్ఛ కోసం పాటుపడి దానికో అర్థాన్ని పొందగలుగుతారా? అన్నది వారి వారి చేతుల్లో ఉంటుంది. ‘స్వాతంత్ర్యం మా జన్మ హక్కు’ అని నినదించిన భగత్ సింగ్.. 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యలకు బలైనా, బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులను ఎదిరించడంలో చూపిన తెగువ, పరిణతి అసమానం. ఆయన స్థాపించిన ‘హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేష్(హెచ్‌ఎస్‌ఆర్‌ఏ)’ ఐడియాలజీని పుణికిపుచ్చుకున్న యువత.. స్వాతంత్ర్య […]
దిశ, సినిమా : యవ్వనం దేవుడిచ్చిన వరం.. అల్లరి చిల్లరగా అనుభవించి వృథా చేస్తారా? లేదా సమానత్వం, స్వేచ్ఛ కోసం పాటుపడి దానికో అర్థాన్ని పొందగలుగుతారా? అన్నది వారి వారి చేతుల్లో ఉంటుంది. ‘స్వాతంత్ర్యం మా జన్మ హక్కు’ అని నినదించిన భగత్ సింగ్.. 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యలకు బలైనా, బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులను ఎదిరించడంలో చూపిన తెగువ, పరిణతి అసమానం. ఆయన స్థాపించిన ‘హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేష్(హెచ్‌ఎస్‌ఆర్‌ఏ)’ ఐడియాలజీని పుణికిపుచ్చుకున్న యువత.. స్వాతంత్ర్య సంగ్రామంలో నడిచిన తీరును మరవలేం. అలాంటి వారిలో సర్దార్ ఉధమ్ సింగ్ ఒకరు. 1919 ‘జలియన్‌వాలా బాగ్ మారణకాండ’తో రక్తసిక్తమైన అమృత్‌సర్ వీధుల్ని చూసిన ఆ యువకుడు.. బ్రిటిష్ పాలకుల క్రూరత్వాన్ని, అణచివేతను ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? తన మిత్రుడు భగత్ సింగ్ ఆశయాలను స్మరిస్తూ భారత స్వేచ్ఛా, స్వాతంత్రాల కోసం ఎలాంటి పోరాటం చేశాడు? ఇరవయేళ్ల పాటు పేర్లు మారుస్తూ, దేశాలు దాటుతూ స్వాతంత్ర్య కాంక్షను చల్లారనివ్వని రామ్ మహ్మద్ సింగ్ ఆజాద్.. ఆనాటి మారణకాండకు ఎలా బదులు తీర్చుకున్నాడు? రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సర్దార్ ఉధమ్ సింగ్’.
పంజాబ్‌లో పుట్టిన ఉధమ్ సింగ్.. యువకుడిగా ఉన్నప్పుడు స్థానిక కర్మాగారంలో పనిచేస్తుండేవాడు. అదే సమయంలో గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్ర్య పోరాటం జరుగుతుండగా.. బ్రిటిషర్లు అమల్లోకి తెచ్చిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్ ప్రజలు శాంతియుత నిరసనకు సిద్ధమవుతుంటారు. ఈ విషయం తెలిసిన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్-గవర్నర్ మైకేల్ ఓ‘డ్వైర్’.. జలియన్‌వాలా బాగ్‌లో సభ నిర్వహిస్తే భారతీయుల స్వాతంత్ర్య పోరాటం బలపడుతుందని, వెంటనే అణచివేయాలని జనరల్ రెజినాల్డ్ డయ్యర్‌ను ఆదేశిస్తాడు. గవర్నర్ ఆదేశాల మేరకు ‘మార్షల్ లా’తో పాటు కర్ఫ్యూను అమలుచేసిన డయ్యర్.. జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమైన భారతీయుల్ని సాయుధులైన సైన్యంతో చుట్టుముడతాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి దాదాపు 20,000 మందిని పొట్టనబెట్టుకుంటారు. కర్ఫ్యూ అమలులో ఉండటంతో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జనాలను ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఈ విషయం తెలుసుకుని జలియన్‌వాలా బాగ్ చేరుకున్న ఉధమ్ సింగ్.. శవాల సంఖ్యను చూసి షాక్ అవుతాడు. చావుబతుకుల్లో ఉన్నవారిని చిన్న చక్రాల బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లి సాధ్యమైనంత మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటంలో యాక్టివ్‌గా పాల్గొని కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన ఉధమ్.. బయటికి వచ్చిన తర్వాత తన స్వాతంత్ర్య పోరాటాన్ని ఎలా కొనసాగించాడు? బ్రిటిష్ నిఘాను తప్పించుకుని ఇంగ్లాండ్‌కు ఎలా చేరాడు? అక్కడ ఏం చేశాడు? అనేది మిగతా స్టోరీ.
ప్రపంచానికి విప్లవకారుడిగానే తెలియాలి..
1933లో మారువేషంలో రష్యా వెళ్లిన ఉధమ్.. అక్కడే కొన్నాళ్ల పాటు తలదాచుకున్న తర్వాత మరో పేరుతో ఇంగ్లాండ్ చేరుకుంటాడు. అక్కడున్న ఇండియన్ సపోర్టర్స్ సహకారంతో ఇండియాలో బ్రిటిషర్స్‌పై పోరాటానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే 1919 జలియన్‌వాలా బాగ్ మారణకాండకు కారణమైన అప్పటి గవర్నర్ ఓ‘డ్వైర్’ ఇంట్లో పనికి చేరి, అతన్ని చంపే అవకాశమొచ్చినా.. సర్వెంట్‌గా ఉంటూ మోసం చేసి చంపారనే అపవాదు భారతీయులకు రావొద్దనే ఉద్దేశ్యంతో విరమించుకుంటాడు. ఒక విప్లవకారుడే అతన్ని చంపాడన్న విషయం ప్రపంచానికి తెలియాలని అక్కడ ఉద్యోగం మానేస్తాడు. మరో ప్రయత్నంలో అతన్ని పబ్లిక్ ప్లేస్‌లోనే షూట్ చేసి పోలీసులకు పట్టుబడతాడు. విచారణలో క్రూరమైన హింసకు గురైనా.. సహచరుల ఉనికిని రివీల్ చేయడు. కోర్టు విచారణ సమయంలోనూ జలియన్‌వాలా బాగ్ మారణకాండపై బ్రిటిష్ అధికారుల నైతికతను, ఏమాత్రం పశ్చాత్తాపంలేని వారి క్రూయల్ మెంటాలిటీని ప్రశ్నించి చివరకు 1940లో ఉరిశిక్షకు గురవుతాడు.
కాగా జలియన్‌వాలా బాగ్ ఘటనకు 100 ఏళ్లు గడిచినా ఇప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం.. భారత్‌కు కనీసం క్షమాపణ చెప్పలేదు. ఇక ఉధమ్‌ను ఉరితీసిన ముప్పైనాలుగేళ్లకు 1974లో మృతదేహాన్ని ఇండియాకు పంపించగా.. ఇప్పటికీ తనకు సంబంధించిన అనేక డాక్యుమెంట్స్‌ను బహిర్గతపరచకపోవడం గమనార్హం.
– సంతోష్ దామెర