కరీంనగర్ శ్మశానంలో మృత్యు ఘోష
దిశ ప్రతినిధి, కరీంనగర్: మరణ మృదంగం పాడుతున్నా, చివరి మజిలీకి చేరుకున్నా అక్కడ మాత్రం నిశ్శబ్దమే ఆవహించింది. దూరంగా వెళ్తున్న వాహనాల రాకపోకల తాలుకు, చితి మంటల్లో కాలతున్న కట్టెల చిటపటమంటున్నశబ్దాలు మాత్రమే నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. నా ఆనేవాళ్లు లేవక్కడ, కన్నీటి రోధనలు అంతకన్నా లేవు. ఆరని చితి మంటల సాక్షిగా సాగుతున్న మృత్యు కేళిలో బలైన వారి శవాలను తరలించే వాహనాలు, వాటికలో పనిచేసే వారు తప్ప మరోకరు కనిపించడం లేదు. ఆత్మీయులతో నాడు… నిన్న […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: మరణ మృదంగం పాడుతున్నా, చివరి మజిలీకి చేరుకున్నా అక్కడ మాత్రం నిశ్శబ్దమే ఆవహించింది. దూరంగా వెళ్తున్న వాహనాల రాకపోకల తాలుకు, చితి మంటల్లో కాలతున్న కట్టెల చిటపటమంటున్నశబ్దాలు మాత్రమే నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. నా ఆనేవాళ్లు లేవక్కడ, కన్నీటి రోధనలు అంతకన్నా లేవు. ఆరని చితి మంటల సాక్షిగా సాగుతున్న మృత్యు కేళిలో బలైన వారి శవాలను తరలించే వాహనాలు, వాటికలో పనిచేసే వారు తప్ప మరోకరు కనిపించడం లేదు.
ఆత్మీయులతో నాడు…
నిన్న మొన్నటి వరకు ఒకరు చనిపోతే వందల సంఖ్యలో అక్కడకు చేరుకునే వారు. మానేరు నది ప్రవాహపు సవ్వడులను మిన్నంటి ఆత్మీయుల రోధనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయేది. చివరి మజిలీకి చేరుకున్న వారి ఆప్తుల కన్నీటీ ధార మనేరులో ఓ నీటి పాయలా మారుతుందా అన్న పరిస్థితి ఉండేది. వాహనాలతో కిటకిటలాడిపోయిన ఆ ప్రాంతంలో అరే ఇలా ఎలా జరిగిందని గుస గుసలాడుకునే వారు, పాపం మంచోడు చిరు ప్రాయంలో కాలం చేశాడన్న మాటలు, వారి పిల్లల భవిష్యత్తు ఏంటీ, భార్యను ఎవరు చూసుకుంటారు అన్న సానుభూతి మాటలు, చనిపోయిన వారి కుటుంబం చుట్టే చర్చలు. ఇంతలో కాటి కాపరి చివరి చూపు చూసే వారెవరైనా ఉన్నారా అన్న అరుపులు. ఆగండాగండి అంటూ మరో వ్యక్తి ప్రతి సమాధానం. వారి సమీప బంధువులు దగ్గరి వరకు వచ్చారట 5 నిమిషాల్లో చేరుకుంటారట అన్న జవాబు. మళ్లీ కన్నీటి రోధనలతో దద్దరిల్లిపోయేదా ప్రాంతం. శవం నోటిలో బంగారం తునకలు పెట్టడం, గంధం చెక్కలు, నెయ్యి చితిపై వేస్తూ, మృతదేహం చుట్టూ మూడు ప్రదక్షిణలు, శవానికి చివరి స్నానం చేయించడం ఇలా సాంప్రాదాయపు దహన సంస్కారాలు నిర్వహించే వారితో కిటకిటలాడేదాప్రాంతం.
నా అనే వాళ్లే లేరిప్పుడు…
నిత్య కళ్యాణం… పచ్చతోరాణం అన్న నానుడిని మరిపిస్తున్నాయి శ్మశాన వాటికలు. కరోనా మరణాలతో నిరంతరం అక్కడ చితులు కాలుతూనే ఉన్నాయి. ఒకటి చల్లారే లోపునే మరో శవం అక్కడకు చేరుతోంది. వంతులా వారిగా అన్నట్టుగా మరిపిస్తున్న చావుల తంతే సాగుతోందక్కడ. కానీ నాటి పరిస్థితులకు భిన్నంగా, సాంప్రాదాయలకు వ్యతిరేకంగానే జరుగుతోంది. కరోనా తెచ్చిన చావులు వల్ల ఆచారాలు లేవు. సన్నిహితులు అంతకన్నా కానరావడం లేదు. బంధువుల ఘోషలూ వినిపించడం లేదు. అంబూలెన్స్, వైకుంఠ, అంతిమ రథాల సిబ్బందో, శ్మశాన వాటికల యంత్రాంగమో చివరి అంకం పూర్తి చేస్తున్న పరిస్థితి. శవాలను తరలించే వాహనాల శబ్దాలు తప్ప నా అనే వాళ్ల అర్తనాదాలు, ఎడుపులు పెడబొబ్బలు వినిపించడం లేదక్కడ. నిశ్శబ్దం ఆవహించిన శ్మశాన వాటికల్లో శవాల దహన సంస్కారాలు సాగుతున్నాయి. చితిని పేర్చే వారు, కాష్టానికి నిప్పు పెట్టేవారు కూడా మరణించిన కుటుంబాలకు సంబందం లేని వ్యక్తులే. కరోనా సోకి మరణించిన వారి వారసులూ కానరావడం లేదు. చేతకాని వయసొచ్చే సరికి చేతినిండా డబ్బయినా ఉండాలి, చేతికొచ్చిన వారసులయినా ఉండాలన్న నానుడికే సవాల్ విసురుతున్నాయి కరోనా మరణాలు. చేతి నిండా డబ్బున్నా, చేతికొచ్చిన వారసులున్నా చివరి అంకం పూర్తి చేసేందుకు సాహసించని వారే ఎక్కువ. డబ్బు వెచ్చించి ఆ తంతు పూర్తి చేసేవారికి తమ వారి శవాన్ని అప్పగించడం తప్ప అంతిమ సంస్కారాలు చేయలనే సాహసం మాత్రం చేయడం లేదు చాలామంది. ఒంటిరిగా వస్తున్నశవాలను శ్మశాన వాటికలు మౌనంతో అక్కున చేర్చుకుంటున్నాయి.