ప్రశ్నిస్తున్నా.. పలకరేమీ..?
దిశ, కరీంనగర్: రైతులు ఏ పంట పండించాలి..? మద్దతు ధర గిట్టుబాటయ్యే విధంగా ఉందా ..? ఇలా రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిచేందుకు ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితుల ఉనికి ఏ మాత్రం కనిపించడంలేదు. ప్రస్తుతం లాక్ డౌన్, చెడగొట్టు వానల కారణంగా రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరి రైతుల పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే అక్కడ కూడా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి రాష్ట్ర […]
దిశ, కరీంనగర్: రైతులు ఏ పంట పండించాలి..? మద్దతు ధర గిట్టుబాటయ్యే విధంగా ఉందా ..? ఇలా రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిచేందుకు ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితుల ఉనికి ఏ మాత్రం కనిపించడంలేదు. ప్రస్తుతం లాక్ డౌన్, చెడగొట్టు వానల కారణంగా రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరి రైతుల పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే అక్కడ కూడా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి రాష్ట్ర మంత్రులే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, రైతు సమన్వయ సమితుల ప్రతినిధులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
రైతులకు అన్నింటా న్యాయం చేయాలన్న సదుద్దేశ్యంతో సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఈ సమితులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఎన్నో ఫలితాలు రాబట్టి రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఉద్దేశ్యం. వీటికోసం సర్కారు ప్రత్యేకంగా విధి విధానాలను కూడా ఏర్పాటు చేసింది. మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షునిగా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా ప్రస్తుతం ఆ పదవిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఈ సమితులు కేవలం నామమాత్రంగా మిగిలాయా అన్న అనుమానం రేకెత్తుతోన్నది.
విస్మయానికి గురి చేస్తోన్నది..
తమ సంక్షేమం కోసం ఏర్పడిన ఈ సమితుల ప్రతినిధులు పట్టించుకోవడం లేదేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈసారి వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న ఆందోళనల గురించి సమితి బాధ్యులు పట్టించుకోకపోవడం రైతాంగాన్ని ఆందోళన కల్గిస్తోన్నది. రైతుల సమస్యల పరిష్కారం కోసమే ఏర్పాటు చేసిన ఈ కమిటీల నుంచి ఏ మాత్రం స్పందన లేకపోవడం వారిని విస్మయానికి గురి చేస్తోన్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కొన్ని జిల్లాల్లో పర్యటించారు. ఆ తర్వాత రాష్ట్రంలో తాలు పేరిట తరుగు అన్న అంశం రైతుల ఆందోళనకు దారి తీస్తోన్నది. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తగులబెట్టిన సంఘటనలు నెలకొన్నా రైతు సమన్వయ సమితుల ప్రతినిధులు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చివరకు రాష్ట్ర మంత్రులు స్పందించి రైతులకు అన్యాయం జరగవద్దని వ్యాఖ్యానించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అయితే మిల్లర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మరికొంత మంది మంత్రులు కూడా ఇదే అంశంపై మిల్లర్ల తీరును తప్పుపట్టారు. ఇంత జరుగుతున్నా సమన్వయ సమితుల నుంచి ఏ మాత్రం స్పందన లేకపోవడం ఏంటన్నది అంతు చిక్కకుండా పోయింది.
tags: Karimnagar, Farmers Coordination Committee, Farmers, Palla Rajeshwar Reddy, Minister