అగమ్యగోచరంగా రియల్ వ్యాపారం..
దిశ, ఖమ్మం: జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయి. భూమిపై పెట్టుబడి పెడితే ఎక్కడికి పోదని అందరూ అనేమాట. కాని ఇప్పుడు భూమి మీద పెట్టబడి పెట్టి ఎంతోమంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల వేల సంఖ్యలో వ్యాపారులు దివాలు తీశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేశామని చెప్పి కేవలం రీ సేల్ ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఎల్ఆర్ఎస్ రద్దు అయిందని […]
దిశ, ఖమ్మం: జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయి. భూమిపై పెట్టుబడి పెడితే ఎక్కడికి పోదని అందరూ అనేమాట. కాని ఇప్పుడు భూమి మీద పెట్టబడి పెట్టి ఎంతోమంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల వేల సంఖ్యలో వ్యాపారులు దివాలు తీశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేశామని చెప్పి కేవలం రీ సేల్ ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఎల్ఆర్ఎస్ రద్దు అయిందని రిజిస్ట్రేషన్ చేయించుకుందానిమని వెళ్లిన వ్యాపారులకు మాత్రం చుక్కెదురైంది. కేవలం రీసేల్ ప్లాట్లు మాత్రమే చేయడానికి అనుమతి ఉంది. డెవలపర్ల వద్ద మిగిలిన ప్లాట్లు చేయడం కుదరదని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్‌లు అంటున్నారు. దీంతో బిక్క మొహం వేసుకుని వెనుదిరిగి వెళుతున్నారు వ్యాపారులు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏపని చేసినా సంపూర్ణంగా చేయదని సగం సగం పనులు చేస్తుందని వ్యాపారులు విమర్శిస్తున్నారు. వెంచర్ల యాజమాన్యం దగ్గర ఉన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోతే కొన్న లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కు నోచుకోవడం లేదు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకుని సగం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన తరువాత మిగతావి కావంటే ఎలాగని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము అమ్మిన రీసేల్ ప్లాట్లు సక్రమమైనప్పుడు తమవద్ద మిగిలిన ప్లాట్లు ఎలా అక్రమమవుతాయని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వానికి ఇది ఎంతమాత్రం మంచిదికాదని అన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎంతో కాలంగా ఈ వ్యాపారం చేసుకుని జీవిస్తున్నా మని ఎప్పుడూ ఇలాంటి గడ్డు పరిస్థితి రాలేదని.. ఇక మీదట భూమి వ్యాపారం కలగా మిగులుందేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచ చేసి అన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా జీవో విడుదల చేయాలని.. లేని పక్షంలో ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదని రియల్టర్లు వాపోతున్నారు. ఇప్పటికే నాలుగు నెలలుగా వడ్డీలు కట్ట లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇంకా పొడిగిస్తే భూ యజమానులకు డబ్బులు కట్టలేక మరోవైపు తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టలేక చావే శరణ్యమవుతుందని కన్నీటి పర్యంతమవుతున్నారు. రీసేల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ అనేది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని.. కొన్ని లక్షల మంది ప్లాట్లు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకొని ఉన్నారని మరి వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి వెంచర్లలో రిజిస్ట్రేషన్‌లు కాగా మిగిలిన ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లక అనుమతి ఇచ్చి ఇక మీదట కొత్తగా వేసే వెంచర్లకు మాత్రం డీటీసీపీ లేవుట్ వేళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలా కాకుండా రీసేల్ ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌లు చేస్తే ఇంకా చాలామంది బాధితులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు అంటున్నారు.
ప్రభుత్వ ఆదేశాలను ఆనుసరిస్తున్నా..
ప్రభుత్వ ఆదేశానుసారం రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నాం. గతంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని వారు అమ్ముకుంటే వారికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కానీ రియల్టర్లు వేసిన వెంచర్లలోని వారి వద్ద ఉన్నప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్‌లు కావు. డీటీసీపీ లేఅవుట్లలో ఉన్న ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఇళ్ల నిర్మిస్తే రిజిస్ట్రేషన్‌లు కావు. గతంలో ఇంటి పన్నులు రశీదులు, కరెంట్ బిల్లులతో రిజిస్ట్రేషన్‌లు జరగవు. రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
– రవీందర్‌బాబు, రిజిస్ట్రార్, ఖమ్మం
ఇంకా నరకం అనుభవించలేం..
గతంలో కట్టిన బీఆర్ఎస్ కే ఇప్పటి వరకు అతీ గతీ లేదు. మళ్లీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అంటున్నారు. దీనికి కూడా సరైనా విధానం లేదు. రీ సేల్ ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తే అగ్రిమెంట్ మీద ఉన్న ప్లాట్ల పరిస్థితి ఏంటి. నేను అప్పుచేసి రెండు ప్లాట్లు కొనుగోలు చేశా. రూ. 10 లక్షలు కట్టి అగ్రిమెంట్ చేసుకున్నా. అవి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావంటున్నారు. నేనేంచేయాలి. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుతున్నది. ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ప్రభుత్వం వెంటనే అన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలి లేకపోతే ప్రజా వ్యతిరేకత తప్పదు.
– రాయిపుడి సాయిబాబు, కొనుగోలుదారు
కనికరం చూపాలి..
ప్రభుత్వం సహదయంతో ఆలోచించి వ్యాపారులపై కనికరం చూ పాలి. లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకపోతే వ్యాపారులు నెత్తిన గుడ్డ వేసుకోవడమే. ఇప్పటికే వడ్డీలు కట్టలేక చాలామంది ఇ బ్బంది పడుతున్నారు. ఇంకా ఎల్ఆర్ఎస్ పేరుతో కాలయాపన చేస్తే ఆత్మహత్యలే శరణ్యం. కోట్ల రూపాయల ప్లాట్లు ఉన్నా చేతిలో చిల్లగవ్వలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. చూసుకోవాడినికి తప్ప అమ్ముకోవడానికి లేకుండా చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం పునరాలోచించాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్‌లు జరిగేలా అనుమతివ్వాలి.
– నలబోలు చంద్రారెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి