రికార్డు క్రియేట్ చేసిన ఉప ఎన్నిక.. కరీంనగర్ చరిత్రలోనే మొదటిసారి
దిశ ప్రతినిధి, కరీంనగర్: అన్నింటా రికార్డులు బద్దలు కొడుతున్న హుజురాబాద్ ఉన్న ఎన్నిక ఇప్పుడు మరో రికార్డ్‌ను కూడా అందుకుంది. ఏక ధాటిగా ఐదున్నర నెలలుగా ప్రచార హోరుతో దద్దరిల్లిపోయిన నియోజకవర్గంలో అన్ని వింతలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. ఇక్కడ మోహరించిన బలగాల విషయంలోనూ చరిత్ర సృష్టించిందని చెప్పాలి. సాధారణ ఎన్నికల బందోబస్తుకు మించి ఇక్కడ పారా మిలటరీ బలగాలు దిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో ఎన్నికల బందోబస్తు కోసం 17 […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: అన్నింటా రికార్డులు బద్దలు కొడుతున్న హుజురాబాద్ ఉన్న ఎన్నిక ఇప్పుడు మరో రికార్డ్‌ను కూడా అందుకుంది. ఏక ధాటిగా ఐదున్నర నెలలుగా ప్రచార హోరుతో దద్దరిల్లిపోయిన నియోజకవర్గంలో అన్ని వింతలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. ఇక్కడ మోహరించిన బలగాల విషయంలోనూ చరిత్ర సృష్టించిందని చెప్పాలి. సాధారణ ఎన్నికల బందోబస్తుకు మించి ఇక్కడ పారా మిలటరీ బలగాలు దిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 నియోజకవర్గాల్లో ఎన్నికల బందోబస్తు కోసం 17 కంపెనీల బలగాలు మాత్రమే వచ్చాయి. కానీ, హుజురాబాద్ ఎన్నికల నిర్వాహణకు మాత్రం 20 కంపెనీల బలగాలను ఈసీఐ పంపించింది. 13 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల కోసం వచ్చిన పారా మిలటరీ ఫోర్స్ కన్నా అదనంగా 3 కంపెనీలు హుజురాబాద్‌కు రావడం విశేషం.
తెలంగాణ జిల్లాల్లో పీపుల్స్ వార్ ప్రాబల్యం ఉన్న సమయంలో జరిగిన ఎన్నికలప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున బలగాలు మోహరించినట్టు లేదేమో. అప్పటి పీపుల్స్ వార్, జనశక్తి నక్సల్స్‌కు పట్టున్న నియోజకవర్గాల్లో వారిని ఏరివేసేందుకు ప్రత్యేకంగా పారా మిలటరీ బలగాలు ఉండేవి. ఎన్నికల సమయంలో వీరితో పాటు మరికొన్ని కంపెనీలను రంగంలోకి దింపేవారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయని భావించి అదనపు బలగాలను పంపేవారు. నక్సల్స్‌కు పట్టున్న సమయంలో 1989, 1994, 1999ల్లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా కేవలం ఎన్నికల నిర్వాహణ కోసమే ఇంత పెద్ద మొత్తంలో బలగాలను దింపిన దాఖలాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికలు సాఫీగా జరిపేందుకు ఒక్క నియోజకవర్గానికే 20 కంపెనీల పారా మిలటరీ బలగాలను దింపడం రికార్డేనని చెప్పాలి. ఇది హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనే జరగడం గమనార్హం.
ఫిర్యాదుల పరంపర
ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొలిటికల్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులను ఆదిలోనే బ్రేకు వేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఐదు నెలలకు పైగా సాగిన ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరు ప్రచ్ఛన్న యుద్ధాన్నే తలపించింది. ఎవరి ఉనికిని వారు కాపాడుకునే ప్రయత్నంలో ప్రత్యర్థి పార్టీల కదలికలకు బ్రేకులు వేయాలని ఉబలాటపడ్డాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటు ఫిర్యాదులు. ఇటు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో ఈసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.