సంక్షోభ అంచుల్లో రాజస్థాన్ సర్కారు?

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో రాజకీయం మళ్లీ రాజుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య అంతర్గత పోరు కాంగ్రెస్ సర్కారు మనుగడకే ప్రమాదంగా మారింది. ఈ పోరును బీజేపీ అనుకూలంగా మార్చుకుని తమ సర్కారు ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నట్టు రాజకీయవర్గాల సమాచారం. తమ ప్రభుత్వాన్ని బీజేపీ అస్థిరపరిచే కుట్ర చేస్తున్నదని, ఒక్క ఎమ్మెల్యేకు రూ. 15కోట్ల వరకూ ఇచ్చి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని రాజస్తాన్ సీఎం గురువారం ఆరోపణలు చేసిన సంగతి […]

Update: 2020-07-12 04:59 GMT

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో రాజకీయం మళ్లీ రాజుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య అంతర్గత పోరు కాంగ్రెస్ సర్కారు మనుగడకే ప్రమాదంగా మారింది. ఈ పోరును బీజేపీ అనుకూలంగా మార్చుకుని తమ సర్కారు ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నట్టు రాజకీయవర్గాల సమాచారం. తమ ప్రభుత్వాన్ని బీజేపీ అస్థిరపరిచే కుట్ర చేస్తున్నదని, ఒక్క ఎమ్మెల్యేకు రూ. 15కోట్ల వరకూ ఇచ్చి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని రాజస్తాన్ సీఎం గురువారం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ 16 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆయన ఇప్పటికే 12మంది మద్దతు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చేరారు. కాంగ్రెస్ అధిష్టానంతో రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడనున్నట్టు తెలిసింది. తనను పక్కకు నెట్టాలనే కుట్ర చేస్తున్నారని సచిన్ భావిస్తున్నట్టు అతని వర్గీయులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సీఎం అశోక్ గెహ్లాట్ రాష్ట్ర పరిస్థితులపై మంత్రులతో సమావేశమయ్యారు. తమ ఎమ్మెల్యేలందరూ అందుబాటులో ఉండాలని, ఆదివారం రాత్రి 9 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరవ్వాలని సీఎం అందరికీ సమాచారమిచ్చారు.

ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే..

అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య విభేదాలు 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే రాజుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి తనకే దక్కుతుందని సచిన్ పైలట్ ఆశపడ్డారు. కానీ, గెహ్లాట్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సచిన్ పైలట్‌కు ఉపముఖ్యమంత్రి సీటు ఇవ్వడంతోపాటు రాజస్థాన్ పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతను అధిష్టానం పొడిగించింది. పీసీసీ అధ్యక్షుడిగా 2014 నుంచి సచిన్ కొనసాగడంపై గెహ్లాట్ అయిష్టంగా ఉన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కొడుకు ఓటమికి సచిన్ పైలట్ బాధ్యత వహించాలని గెహ్లాట్ అసంతృప్తి వెళ్లగక్కారు. ఇలా ఆది నుంచి వీరిరువురి మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. తాజాగా, సర్కారును కూల్చే కుట్రలు, ఎమ్మెల్యేలతో బేరసారాల విషయమై దర్యాప్తు కోసం రాష్ట్ర సీఎం, హోం మినిస్టర్ అశోక్ గెహ్లాట్ స్పెషల్ ఆపరేషన్ గ్రూపు (ఎస్‌వోజీ)లతో సచిన్ పైలట్‌పై విచారణకు పంపడంతో పరిస్థితులు తారాస్థాయికి చేరినట్టు తెలిసింది. తనను విచారించడంపై సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. సిట్టింగ్ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్‌ను విచారించడం ఇదివరకు ఎప్పుడూ జరగలేదని, అది పరాభవమేనని సచిన్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మార్చి నుంచే సంప్రదింపులు?

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్ బీజేపీతో ఏకకాలంలో సంప్రదింపుల్లో ఉన్నట్టు కొన్నివర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో సింధియాకు వర్కవుట్ అయింది. కానీ, మార్చి నుంచి బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్న సచిన్ పైలట్ డిమాండ్లను బీజేపీ సులువుగా ఆమోదించడం లేదని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో బీజేపీ ఉన్నదని, సీఎం కుర్చీనే లక్ష్యంగా సచిన్ ఉన్నట్టు కొన్నివర్గాలు తెలిపాయి. కానీ, టాప్ సీట్ ఇవ్వడానికి బీజేపీ వెనుకడుగువేస్తున్నదని, పార్టీలోనే 45 ఎమ్మెల్యేల మద్దతుతో మాజీ సీఎం వసుంధర రాజే బలమైన సీఎం అభ్యర్థిగా ఉన్నారని వివరించాయి. ఈ నేపథ్యంలోనే సంప్రదింపులు ఇంకా సఫలం కాలేదని తెలిపాయి. ఈ నేపథ్యంలోనే సర్కారులో సముచిత గౌరవం దక్కడం లేదని అధిష్టానానికి సచిన్ చెప్పుకున్నారని, అదీగాక, స్థానిక రాజకీయ పార్టీ నెలకొల్పే విషయంపైనా చర్చించాడని వివరించాయి. కాగా, ప్రభుత్వాన్ని కూల్చే యత్నం చేస్తున్నదని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. అంతర్గత పోరుతోనే అస్థిరత్వం ఏర్పడుతున్నదని, తమ కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై బురద జల్లడాన్ని సహించమని స్పష్టం చేసింది.

Tags:    

Similar News