ఆ 18 వేల మంది ఉద్యోగులకు పీఆర్‌సీ షాక్!
దిశ, సిటీ బ్యూరో: బల్దియా అధికారులు పీఆర్సీకి కత్తెర పెడతున్నారు. శానిటేషన్ విభాగంలో స్వీపర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న దాదాపు 18 వేల మందికి ఇప్పటికే సర్కారు మూడు దఫాలుగా జీతాలు పెంచిందని, తాజాగా ప్రకటించిన ఈ పీఆర్సీ వారికి వర్తించదని తేల్చి చెబుతున్నారు. కానీ ఉద్యోగ, కార్మిక సంఘాలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. సర్కారు జీతాలు పెంచే సమయంలో మీకు పీఆర్సీ వర్తింపచేయమని చెప్పలేదని, అధికారులు ఇప్పుడెందుకు అడ్డుపడుతున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. […]
దిశ, సిటీ బ్యూరో: బల్దియా అధికారులు పీఆర్సీకి కత్తెర పెడతున్నారు. శానిటేషన్ విభాగంలో స్వీపర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న దాదాపు 18 వేల మందికి ఇప్పటికే సర్కారు మూడు దఫాలుగా జీతాలు పెంచిందని, తాజాగా ప్రకటించిన ఈ పీఆర్సీ వారికి వర్తించదని తేల్చి చెబుతున్నారు. కానీ ఉద్యోగ, కార్మిక సంఘాలు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. సర్కారు జీతాలు పెంచే సమయంలో మీకు పీఆర్సీ వర్తింపచేయమని చెప్పలేదని, అధికారులు ఇప్పుడెందుకు అడ్డుపడుతున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
జీహెచ్ఎంసీలో సుమారు 28 వేల మంది కార్మికులు, ఉద్యోగులు ఉండగా, వీరిలో 4వేల పై చిలుకు పర్మినెంట్ ఉద్యోగులున్నారు. శానిటేషన్ విభాగంలో 18 వేల మంది ఔట్ సోర్స్, కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు మరో రెండు వేల మంది ఔట్ సోర్స్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 4వేల పైచిలుకు మందికి 30 శాతం పీఆర్సీని అమలు చేసేందుకు సిద్ధమైన అధికారులు శానిటేషన్ విభాగంలో పని చేసే 18 వేల మందిని మొండిచేయి చూపిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బల్దియాలోని ఔట్‌సోర్స్ ఉద్యోగులకు ఎంత శాతం చెల్లించాలనే విషయాన్ని ఖరారు చేసేందుకు కమిటీని నియమించడంపై ఉద్యోగ, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బల్దియా కార్మికులు, ఉద్యోగులకు జీతాలను చెల్లించేందుకు అష్టకష్టాలు పడుతున్న సంగతి తెల్సిందే! ఇలాంటి గడ్డు సమయంలో పీఆర్సీని అందరు ఉద్యోగులకు అమలు చేస్తే బల్దియా ఖజానాపై అదనపై భారం పడుతుందనే ఉన్నతాధికారుల ఆలోచన మేరకు పీఆర్సీకి అర్హులైన ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పర్మినెంట్ ఉద్యోగులకు సైతం…
పీఆర్సీ అమలుకు ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు రవాణా శాఖలో పని చేసే 160 మంది పర్మినెంట్ ఉద్యోగులకూ కట్టింగ్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలిసింది. జీతాలు సకాలంలో చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 2న ఉద్యోగులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో చర్చలకు ఆహ్వానించిన కమిషనర్ లోకేశ్ కుమార్ పీఆర్సీ అమలు విషయంలో 18 వేల మంది శానిటేషన్ సిబ్బంది, రవాణా శాఖలోని 160 మంది పర్మినెంట్ ఉద్యోగులకు చెల్లించేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సర్కారు పరిశీలనకు పంపాలని కార్మిక నేత ఊదరి గోపాల్ పట్టుబట్టినట్లు తెలిసింది.