హాట్ టాపిక్‌గా ‘పొంగులేటి బ్రాండ్’.. చెక్కు చెదరని ఫాలోయింగ్

దిశ ప్రతినిధి, ఖమ్మం: ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ‘పొంగులేటి బ్రాండ్’ హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆయనకు అనుచరులు, అభిమానులు భారీగానే ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అయితే, గతంలో అనేక ప్రచారాలు జరిగినా.. ఇప్పుడు అవేమీ అంతగా వినిపించడం లేదు. పొంగులేటి అంటే అపారమైన అభిమానం ఉన్నవాళ్లు, అనుచరులు ఆయనకు ఏ పదవీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న విషయం వాస్తవమే. ఈ విషయంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా […]

Update: 2021-10-04 04:21 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ‘పొంగులేటి బ్రాండ్’ హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆయనకు అనుచరులు, అభిమానులు భారీగానే ఉన్నారు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అయితే, గతంలో అనేక ప్రచారాలు జరిగినా.. ఇప్పుడు అవేమీ అంతగా వినిపించడం లేదు. పొంగులేటి అంటే అపారమైన అభిమానం ఉన్నవాళ్లు, అనుచరులు ఆయనకు ఏ పదవీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న విషయం వాస్తవమే. ఈ విషయంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పొంగులేటి అభిమానులు కొంత అసహనంతో ఉన్న విషయమూ తెలిసిందే. ఇప్పుడంతా సర్దుమణిగినట్లే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లోనైనా తమ నేతకు మంచి పదవి వస్తుందనే ఆశతోనే అందరూ ఉన్నారు. పొంగులేటి సైతం పార్టీ పెద్దలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఎవరినీ నొప్పించక, తానూ నొవ్వక అందరితో కలివిడిగానే ఉంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన పర్యటనలు చేస్తూనే.. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. అయితే, ఆయన ఎక్కడకు వెళ్లినా.. ఏ పదవి లేకున్నా.. ఆయనపై ప్రజలు చూపించే అభిమానం మాత్రం ఒకింత ఆశ్యర్యానికి గురిచేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆదివారం మధిరలో జరిగిన సభే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ‘పొంగులేటి బ్రాండ్’ అనే మాట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది.

ఈలలు.. కేరింతలు..

ఆదివారం మధిరలో పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ సభకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతుంటే అక్కడ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈలలు కేరింతలతో తెగ సందడి చేశారు. పొంగులేటి మాట్లాడే ప్రతీ మాటకు చప్పట్లు కొడుతూ ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. తమ నేత మాటలను విని, పార్టీ క్యాడర్ సైతం ఉత్సాహంగా అరుస్తూ, శబ్దాలు చేస్తూ ఆయన బ్రాండ్ ఉందని గుర్తుచేశారు. ఇంతటి ప్రజాధరణ ఉన్ననేతకు ఏ పదవీ లేకుండా చేయడం వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

శీనన్న బ్రాండ్ ఉందన్న పొంగులేటి..

మధిర సభలో పొంగులేటి మాటలు ఆయన అభిమానుల్ని తెగ ఉత్సాహ పరిచాయి. పంచాయతీ ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లో శీనన్న బ్రాండ్.. శీనన్న మార్క్ ఉందని పొంగులేటి అంటుంటే అక్కడున్న వారందరూ ఎంజాయ్ చేశారు. పదవి ఉంటేనే జనం మధ్యలో ఉంటానని అనుకోవడం పొరపాటని.. పదవి లేకున్నా తాను ఎప్పుడూ జనంలోనే ఉంటానని చెప్పడంతో సభకు హాజరైన వారదంరూ తమ కరతాళ ధ్వనులతో పొంగులేటి మాటలను ఆహ్వానించారు. అంతేకాదు.. పదవి లేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని.. ఎవరి పదవైనా పోతే.. క్షణికావేశానికి లోను కాకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలన్నారు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు తననే మోడల్‌గా తీసుకోవాంటూ చెప్పడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో పొంగులేటిని ఉత్సాహపరిచారు.

పొంగులేటి మాటల వెనుక..

మధిర సభలో పొంగులేటి మాటల వెనుక ఆంతర్యమేంటని పార్టీ శ్రేణులు విశ్లేషించడం గమనార్హం. అయితే మధిర నియోజకవర్గంపై పొంగులేటికి మంచి పట్టుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయనకు ఎలా అభిమానులు ఉన్నారో మధిర నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి మాట్లాడుతుంటే ఆయనపై ఉన్న అభిమానాన్ని కేరింతలతో చాటుకున్నారు. వారి ఆ స్థాయిలో అభిమానం చూపించడంతోనే పొంగులేటి రెట్టించిన ఉత్సాహంతో మాట్లాడారని.. తన బ్రాండ్.. మార్క్ ఎక్కడైనా.. ఎప్పుడైనా ఉంటుందని చెప్పుకొచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఆప్యాయ పలకరింపే..

వాస్తవంగానే పొంగులేటి ఎంపీగా ఉన్నా.. ఏ పదవీ లేకున్నా జనం మధ్యలోనే ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ముందుంటారని ఆయన అభిమానుల్లో నమ్మకం ఉంది. ఆయన కూడా తనపై ఉన్న నమ్మకాన్ని పోనివ్వకుండా పర్యటనలు, పరామర్శలు చేస్తూనే ఉంటారు. ఎక్కడికి ఆహ్వానించినా కచ్చితంగా వెళ్తారు. పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పలు రకాల అభివృద్ధి పనులు, సహాయాలు చేస్తూనే ఉంటారు. అంతేకాదు.. ఆయన ఆప్యాయ పలకరింపు.. మోహంలో చిరునవ్వే ఆయన ఇమేజ్‌ను పెంచుతోందనేది పొంగులేటి అభిమానులు చెబుతున్నమాట. ఏది ఏమైనా పొంగులేటి బ్రాండ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇకనైనా మాట నిలబెట్టుకోవాలి..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పొంగులేటికి ఉన్న ప్రజల ఆదరణ అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఆయన ఎంపీతోపాటు మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలిపించిన విషయమూ తెలిసిందే. ఇప్పుడు పొంగులేటి ఏ పదవి లేకుండా అధిష్టానం మాటకు కట్టుబడి టీఆర్ఎస్‌లోనే ఉంటూ పార్టీ పటిష్టతకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటికైనా గమనించి వచ్చే ఎన్నికల్లోనైనా తమ నేతకు తగిన గుర్తింపు నివ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇలాంటి ప్రజల ఆదరణ ఉన్న నేతను దూరం చేసుకుంటే పార్టీకి తీవ్ర నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని వారు చెబుతున్నారు.

Tags:    

Similar News