రాజకీయంగా గండ్ర దంపతులకు ఎదురుదెబ్బ..!
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్రజ్యోతి కొనసాగింపుపై గందరగోళం కనిపిస్తోంది. గండ్రజ్యోతి శాయంపేట మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనంతరం నాటి వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే నూతనంగా వరంగల్, హన్మకొండ జిల్లాల ఆవిర్భావంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న శాయంపేట మండలం హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు హన్మకొండ జిల్లా పరిధిలోని జడ్పీటీసీ, వరంగల్ జిల్లా జడ్పీచైర్మన్‌గా ఎలా కొనసాగుతారన్న సాంకేతిక ప్రశ్నలు ఇటు రాజకీయ […]
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్రజ్యోతి కొనసాగింపుపై గందరగోళం కనిపిస్తోంది. గండ్రజ్యోతి శాయంపేట మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనంతరం నాటి వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే నూతనంగా వరంగల్, హన్మకొండ జిల్లాల ఆవిర్భావంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న శాయంపేట మండలం హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు హన్మకొండ జిల్లా పరిధిలోని జడ్పీటీసీ, వరంగల్ జిల్లా జడ్పీచైర్మన్‌గా ఎలా కొనసాగుతారన్న సాంకేతిక ప్రశ్నలు ఇటు రాజకీయ నేతలను, అటు రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం వేధిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. కొంతమంది గండ్ర కుటుంబాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ ఎత్తుగడను ప్రయోగించారంటూ కొంతమంది ఎమ్మెల్యేలను తిట్టిపోస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రాతినిధ్యం వహించే మండలం ఓ జిల్లాలో ఉంటే పదవీ బాధ్యతలు మరో జిల్లాలో ఉండటంతో రాజకీయంగా విచిత్ర పరిస్థితి నెలకొందనే చెప్పాలి.
రాజకీయంగా గండ్ర దంపతులకు ఎదురుదెబ్బ..!
గండ్ర కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికే ఇద్దరు ఎమ్మెల్యేలు స్కెచ్ వేసినట్లు ఓ వాదన వినిపిస్తోంది. జిల్లాల మార్పులో భాగంగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న శాయంపేట మండలాన్ని చివరగా రెండు రోజుల్లోనే హన్మకొండ జిల్లాలోకి మార్చారనేది విశ్వసనీయంగా తెలుస్తోంది. తొలుత విడుదల చేసిన ప్రతిపాదన మండలాల్లో వరంగల్‌లోనే శాయంపేట, ఆత్మకూరు మండలాలు ఉండటం గమనార్హం. గండ్ర జ్యోతి జడ్పీ చైర్‌పర్సన్ పదవికి ఆటకం లేకుండా ఉండేందుకే శాయంపేట, ఆత్మకూరు మండలాలను వరంగల్ జిల్లాలో ఉంచారు. పరకాల ప్రాంతాన్ని మాత్రం హన్మకొండ జిల్లాలోకి తీసుకువచ్చారు. తాజాగా జిల్లాల మార్పులో భాగంగా 30 రోజుల పాటు ఇచ్చిన అభ్యంతరం పరిశీలనలో భాగంగా శాయంపేట, ఆత్మకూరు మండలాలను హన్మకొండ పరిధిలోకి తెస్తున్నట్లుగా అధికారులు ప్రజాప్రతినిధులకు తెలిపారు. ప్రతిపాదనల వెనుక ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని తెలిసింది. హన్మకొండ జిల్లా పరిధిలోకి తీసుకురావడంలో ఇద్దరు ఎమ్మెల్యేలు గట్టిగానే పావులు కదిపారన్న చర్చ సాగుతోంది. నిజానికి బుధవారం వరంగల్ జిల్లాలో జరిగిన అభ్యంతరాల పరిశీలనలో అధికారులు, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నా.. గండ్ర దంపతులు మాత్రం ఈ సమీక్షలో పాల్గొనకపోవడం గమనార్హం. మొదట హామీ ఇచ్చినా.. చివరి నిమిషంంలో ఒక్క ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి తమను బలి చేస్తున్న తీరుకు నిరసనగానే ఆ సమావేశానికి వెళ్ళలేదని తెలుస్తోంది. అయితే ఉన్నపలంగా తమ పదవికి ఎలాంటి ముప్పు లేదని వారు కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా.. లోపల మాత్రం ఇరుకున పడ్డామనే ఆవేదన గండ్ర దంపతుల్లో వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది.
నాకేం సమాచారం లేదు: గండ్ర జ్యోతి
వరంగల్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ పదవీకి సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా..? ఉండవా అన్న విషయంపై ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదని గండ్ర జ్యోతి దిశ ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు ముక్తాయింపుగా సమాధానం చెప్పారు.
పాత పాలకవర్గమే కొనసాగుతుంది : జడ్పీ సీఈవో రాజారావు
వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ పాత పాలకవర్గమే ఇకపైనా యథావిధిగా కొనసాగుతుంది. సాంకేతిక అంశాలేవీ అడ్డురావు. ఈ టర్మ్‌కు ఇంతే. గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో కూడా ఇదే విధానం అనుసరించాం. జిల్లాల పునర్విభజన జరిగినా.. పాలకవర్గం మాత్రం పాతదే కొనసాగుతుంది.