AP Politics: మాజీ ఐఏఎస్‌కు గడ్డుకాలం.. ఓటమి అంచుల్లో వైసీపీ
మాజీ ఐఏఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా ?, ఓటమి అంచున వైసీపీ అభ్యర్థి ఏఎండీ.
దిశ ప్రతినిధి, కర్నూలు: మాజీ ఐఏఎస్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయా ?, ఓటమి అంచున వైసీపీ అభ్యర్థి ఏఎండీ. ఇంతియాజ్ అహ్మద్ ఉన్నారా?, ఎమ్మెల్యే హఫీజ్ లోటు స్పష్టంగా కనిపిస్తోందా?, అన్ని వర్గాల నేతలు, ప్రజలను కలుపుకునిపోవడంలో ఇంతియాజ్ విఫలమయ్యారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు కేవలం 12 రోజులు మాత్రమే మిగిలి ఉండడం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేవలం మైనార్టీల వరకే పరిమితం కావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఐఏఎస్ వెంట మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రచారం సాగడంలేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ఇంతియాజ్ వర్గీయులు ఎస్వీపై గుర్రుమంటున్నారు.
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ.భరత్ మాత్రం అన్ని వర్గాల ప్రజలను, నేతలను కలుపుకునిపోతూ విజయ తీరాలకు చేరువగా ఉన్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ర్నూలు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,70,942 మంది ఓటర్లున్నారు.
అందులో పురుష ఓటర్లు 1,31,150 మంది, మహిళా ఓటర్లు 1,39,760 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 32 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే 8,610 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్ కు ఇప్పటిదాకా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది. టీడీపీ రెండు సార్లు, వైసీపీ ఒకసారి, సీపీఎం ఒకసారి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక సారి విజయం సాధించారు.
1952లో కాంగ్రెస్ తరపున దామోదరం సంజీవయ్య, 1955లో మహబూబ్ అలీఖాన్, 1962లో టీకేఆర్.సమ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. 1967లో కేఈ మాదన్న, 1972లో పి.రహిమాన్ ఖాన్, 1978లో మహమ్మద్ ఇబ్రహీం ఖాన్ లు కాంగ్రెస్ తరపున గెలుపొందారు. 1983లో వి.రాంభూపాల్ చౌదరి టీడీపీ తరపున గెలుపొందారు.
1985, 1989లో వి.రాంభూపాల్ చౌదరి కాంగ్రెస్ తరపున గెలు పొందారు. 1994, 2004లో ఎంఏ.గఫూర్ సీపీఎం తరపున గెలుపొందారు. 1999 లో టీడీపీ తరపున, 2009లో కాంగ్రెస్ తరపున టీజీ.వెంకటేష్ ఎమ్మెల్యేగా గెలు పొందారు. 2014లో వైసీపీ తరపున ఎస్వీ మోహన్ రెడ్డి, 2019లో అబ్దుల్ హఫీజ్ ఖాన్ లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
ప్రస్తుతం 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ. ఇంతియాజ్ అహ్మద్, టీడీపీ తరపున టీజీ.భరత్, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ బరిలో ఉన్నారు. అందులో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.
టీడీపీకి ప్లస్‌గా వైసీపీ ప్రచారాలు
వైసీపీ ప్రచారాలు టీడీపీ అభ్యర్థి టీజీ.భరత్ కు ప్లస్‌గా మారాయి. ఉద్యోగాన్ని వదిలి అప్పటికప్పుడు పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ.ఇంతియాజ్ అహ్మద్ కు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. ఈయన ప్రకటన తర్వాత కర్నూలులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఈయన ప్రజలను, నేతలను కలుపుకునిపోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి.
ప్రచార సభల్లో హఫీజ్ ఖాన్ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. హఫీజ్ ఖాన్ ప్రచారానికి వస్తే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి ఆయనను ప్రచారానికి రాకుండా అడ్డుపడినట్లు హఫీజ్ వర్గీయులు చర్చించుకుంటున్నారు. అయితే ఎస్వీ మోహన్ రెడ్డి మైనార్టీ కాలనీల్లో మాత్రమే ప్రచారం చేసి పరోక్షంగా ఇతర వర్గానికి దూరం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
దీన్ని అదునుగా భావించి టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ప్రచారానికి మరింత పదును పెట్టారు. మైనార్టీలు ఇంతియాజ్ వెనుక ఉంటే భవిష్యత్తులో తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన ఎస్వీ ప్రచారాన్ని కూడా చప్పగా చేస్తున్నారని హఫీజ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి ఇంతియాజ్ కార్యాలయం వద్ద మైనార్టీలు తప్ప ఇతర సామాజిక తరగతికి చెందిన వారు కనిపించకపోవడం దురదృష్ట కరం. ఏదేమైనా మాజీ ఐఏఎస్ కర్నూలు రాజకీయాల్లో పాస్ అవుతారో లేదో వేచి చూడాలి.