CV Ananda Bose: సొంత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న గవర్నర్..టీఎంసీ విమర్శలు
పశ్చిమ బెంగాల్ గవర్నర్(West Bengal Governor) సీవీ ఆనంద బోస్(CV Ananda Bose) చేసిన పని వివాదాస్పదమైంది. ఆనందబోస్ విగ్రహాన్ని ఆయనే రాజ్‌భవన్(Raj Bhavan)లో ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ గవర్నర్(West Bengal Governor) సీవీ ఆనంద బోస్(CV Ananda Bose) చేసిన పని వివాదాస్పదమైంది. ఆనందబోస్ విగ్రహాన్ని ఆయనే రాజ్‌భవన్(Raj Bhavan)లో ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకున్నారు. గవర్నర్‌గా ఓ పక్క ఇంకా పదవిలో ఉండగానే సొంత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజ్‌భవన్‌లో పాఠశాల విద్యార్థుల కోసం పెయింటింగ్ ఎగ్జిబిషన్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఆ పోటీల ప్రారంభోత్సవానికి ముందు విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ వీడియోలు సోషల్‌మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. గవర్నర్ పై నెటిజన్లు తెగ విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై రాజ్‌భవన్ స్పందించింది. గవర్నర్ తన విగ్రహాన్ని తాను ఆవిష్కరించుకోలేదని అది ఆయనకు బహుమతిగా వస్తే తెర తీసి చూసుకున్నారని తెలిపింది.
గవర్నర్ పై విమర్శలు
గవర్నర్ ఆనంద బోస్ చర్యపై అధికార తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) విమర్శలు గుప్పించింది. "గవర్నర్ ఆనంద బోస్ తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కనీ వినీ ఎరుగని విషయం. ఏదో ఒక పబ్లిసిటీ కావాలనే ఆయన అలా చేశారు.. మరి తదుపరి దశ ఏమిటి? అతను తన విగ్రహానికి పూలమాల వేస్తారా? ఇది ఉన్మాదికి సంకేతం' అని తృణమూల్ అధికార ప్రతినిధి జయప్రకాష్ మజుందార్ అన్నారు. ఈ చర్య అవమానకరమని సీపీఎం(CPM) కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి వ్యాఖ్యానించారు.ఇది రాష్ట్రాని పట్టిన దౌర్భాగ్యమని అన్నారు. గవర్నర్ చేసిన పని సిగ్గుచేటు అని కాంగ్రెస్(Congress) అధికార ప్రతినిధి సౌమ్య రాయ్ మండిపడ్డారు. బెంగాల్ సంస్కృతిపై ఆయన ఆటలాడుతున్నారని ఫైర్ అయ్యారు.