AP Politics: విశాఖ తాగునీరు.. ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు మళ్లింపు

వైసీపీ పాలనలో, మేయర్ హరి వెంటక కుమారి నేత్రుత్వంలో మహావిశాఖనగరపాలక సంస్థ, నగర ప్రజలకు నామం పెట్టేస్తుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.

Update: 2024-04-28 10:48 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ పాలనలో, మేయర్ హరి వెంటక కుమారి నేత్రుత్వంలో మహావిశాఖనగరపాలక సంస్థ, నగర ప్రజలకు నామం పెట్టేస్తుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నిండువేసవిలో ప్రజలకు ఇవ్వాల్సిన తాగునీటిని మాల్ నిర్మాణం పనులకు డైవర్ట్ చేసేస్తుందని ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు .

‘‘ఈ కారణంగా రోజు వారీ మంచినీరు విశాఖ నగరంలో లక్షల మంది ప్రజలకు అందడం లేదు. దేశంలోని గొప్ప నగర పాలక సంస్థల్లో ఒకటిగా చెప్పే జీవీఎంసీలో ప్రాధమిక హక్కుగా ఇవ్వాల్సిన తాగునీటిని కైలాసపురంలోని పోర్టు స్థలంలో నిర్మిస్తున్న ఇనోర్బిట్ మాల్‌కు తరలించేస్తున్నారు. ప్రజల తాగునీటిని పునాదులు, స్లాబ్‌లు తడపడానికి, గోడలు తడపడానికి వినియోగిస్తున్నారు.

గత మూడు నెలలుగా అనధికారికంగా నడుస్తున్న ఈ భారీ నీటి చోర్యం వల్ల లక్షల మంది నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలు ఒక ట్యాంకర్ కోసం వెళితే 200 రూపాయల చలానా అడిగే జీవీఎంసీ అధికారులు రోజుకు రెండు లక్షల లీటర్లను ఉచితంగా ప్రైవేటు సంస్థకు పంపిణీ చేయడం, వైసీపీ ప్రభుత్వ అరాచకానికి, నగర ప్రజలకు జీవీఎంసీ పాలక వర్గం చేస్తున్న అన్యాయానికి నిదర్శనం’’ అని పేర్కొన్నారు.

శ్రీ లక్ష్మీ మౌఖిక ఆధేశంతోనే..

రాష్ర్ట మున్సిపల్ విభాగం ప్రిన్సిపల్ కార్యదర్శి, అవినీతి ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లివచ్చిన శ్రీలక్ష్మీ ఆ దారుణానికి ఒడికట్టారని అన్నారు. ‘‘ ఆమె మౌఖిక ఆదేశాలకు డూడూ బసవన్నల మాదిరిగా తలలూపిన ఇక్కడి అధికారులు, పాలక వర్గ పెద్దలు రహస్యంగా మూడు నెలలుగా కోట్ల లీటర్ల ప్రజల నీటిని మాల్ నిర్మాణం పనులకు తరలించేశారు.

ఇప్పటి వరకూ ఇలా అనధికారికంగా ఉచితంగా తరలించిన నీటి ఖరీదు కోట్ల లోనే వుంటుంది. చలానా లేకుండా, డబ్బు వసూలు చేయకుండా శ్రీ లక్ష్మీ అదేశంతో ఉచితంగా ఇచ్చేస్తున్నారు’’ అని చెప్పారు.

నీరు కావాలంటే..

‘‘ఏ సంస్ధ అయినా ఇలా నీరు కావాలంటే బల్క్ వాటర్ కోసం దరఖాస్తు చేసుకొని ప్రత్యేకంగా పైప్ లైన్ వేయించుకోవాలి. తాగు నీటికోసం శుద్ధి చేసిన నీటిని గాక రా వాటర్‌ను వారికి పంపిణీ చేస్తారు. మాల్ యాజమాన్యం నిబంధనల మేరకు నీరు తెచ్చుకొనేందుకు 70 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది.

శ్రీ లక్ష్మీ వంటి అవినీతి అధికారులను, మేయర్ హరి వెంటక కుమారి వంటి ప్రజాద్రోహులను మేనేజ్ చేసిన మాల్ యాజమాన్యం అంత మేర మిగుల్చుకొంది. వీరికి అందులో కొంత లంచంగా విదిల్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి’’ అని చెప్పారు.

పోలా భాస్కర్ భవనానికి నెలకు రూ.20 లక్షలు

‘‘జనం నుంచి చెత్త పన్ను, నీటి పన్ను , మరుగుదొడ్ల పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్న జీవీఎంసీ ఆ నిధులను ఐఏ‌ఎస్‌లకు కైంకర్యం చేసేస్తుందని ఆరోపించారు. నెలకు లక్షరూపాయలకు అద్దెకు వచ్చే భవనానికి ఏకంగా 20 లక్షల రూపాయల అద్దెను చెల్లించేస్తుందని అన్నారు.

ఆ భవనం యజమాని పోలా భాస్కర్ ముఖ్యమంత్రి పేషీకి దగ్గరగా ఉంటూ జీఏడీలో పని చేస్తుండడమే అందుకు కారణమని, విశాలాక్షి నగర్ డోర్ నెంబర్:-10-280/1లో 300 గజాలకంటే తక్కవ స్ధలంలో నిర్మించిన రెసిడెన్సియల్ భవనాన్ని, జీవీఎంసీ నెలకు రూ.20 లక్షల రూపాయలకు అద్దెకు తీసుకొందని చెప్పారు.

అతిధి గృహం పేరిట తీసుకొన్న ఈ భవనాన్ని అందుకు వాడడం లేదని, కేవలం అధికారికి విశాఖలో ఇళ్లు ఉన్నకారణంగా, ఆయనకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో దీనిని తీసుకొన్నారని అన్నారు. ఈ భననానికి ఆరు నెలలకు 13 వేల రూపాయలే ఇంటిపన్నుగా చెల్లిస్తున్నారంటే దాని విలువ ఎంతో అర్ధం చేసుకోవచ్చని, పోలా భాస్కర్ ఐఏఎస్ కావడం, శ్రీ లక్ష్మీ చెప్పడంతో జీవీఎంసీ పెద్దలు, ప్రజలు చెల్లిస్తున్న 20 లక్షల రూపాయలను నెల నెలా దానం చేసేస్తున్నారని’’ ధ్వజమెత్తారు.

ఏపీ గ్రీన్స్‌కి పది కోట్ల జీవీఎంసీ నిధులు

ఈవేమీ జీవీఎంసీ కౌన్సిల్‌లో చర్చించకుండా, సభ్యులకు చెప్పకుండా మేయర్ హరి వెంకట కుమారి, అధికారి శ్రీ లక్ష్మీలు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం, నగరాన్ని దోచేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు . ఓటు రూపంలో ఈ దోపిడీ దారులకు బుద్ది చెప్పాల్సిందిగా నగర ప్రజలను కోరారు.

ఈ సమావేశంలో టిన్‌స్‌ఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, టీడీపీ జోన్1 మీడియా ఇంచార్జ్ పోతనరెడ్డి, బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి రాజు, జనసేన వార్డ్ అధ్యక్షులు పోతు వేంకట ప్రసాద్ పాల్గొన్నారు.


Similar News