Jajula Srinivas Goud: బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? రిజర్వేషన్లు తగ్గించిందే మీ నాయినా.. కవితపై జాజుల ఫైర్

వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం దక్కాలని తీర్థయాత్రలకు వెళ్లినట్టు కవిత వైఖరి ఉందని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-11-26 13:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీసీలలో వస్తున్న చైతన్యాన్ని విచ్ఛిన్నం చేయడానికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) బీసీ రిజర్వేషన్ల పై హడావుడి చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ (Jajula Srinivas Goud) విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం దక్కాలని తీర్థయాత్రలకు వెళ్లినట్టు కవిత వైఖరి ఉందని దుయ్యబట్టారు. మంగళవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బీసీ ఉద్యమాలకు కవిత సహయం అవసరం లేదని బీసీ ఉద్యమాలు ఎలా నడపాలో బీసీలకు తెలుసన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించిందే కేవిత నాయిన కేసీఆర్ అని విమర్శించారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందో కవిత తన తండ్రి కేసీఆర్ ను (KCR)  అడగాలన్నారు.

కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ (BRS) పార్టీ అధ్యక్షునిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ (Congress) పార్టీ బీసీ వ్యక్తిని పీసీసీ చీఫ్ గా చేసిందని, కిషన్ రెడ్డి కంటే ముందు బీజేపీ (BJP) బీసీ వ్యక్తి బండి సంజయ్ ని స్టేట్ చీఫ్ గా చేసిందని గుర్తు చేశారు. బీసీలను మోసం చేసిన వారే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడడం చూస్తుంటే ఒక వ్యక్తిని చంపి సానుభూతి పొందడానికి సంతాపం తెలిపినట్టుగా ఉందన్నారు. బీసీలు ఎప్పటికీ బీఆర్ఎస్ నమ్మరన్నారు. మీ పదేళ్ల పాలనలో బీసీల పట్ల మీరు చేసిన పాపాలు మరెవరూ చేయలదన్నారు. అధికారంలో ఉండగా అన్యాయం చేసిన కవితకు బీసీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు.

కవిత జైల్లో ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలు అవుతున్న రిజర్వేషన్లను అధ్యయం చేసి వచ్చారు. వారి నోళ్లు నొక్కి ఇప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారని జాజుల ప్రశ్నించారు. దళితులు, బీసీల గురించి మాట్లాడుతున్న మీరు మీ హయాంలో దళిత వ్యక్తి తాటికొండ రాజయ్య, బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ ఎందుకు చేశారని నిలదీశారు. వారు రాజీనామా చేసే అవకాశం ఉన్నా వారికి అవకాశం ఇవ్వలకుండా అవమానించారని ధ్వజమెత్తారు. 

Tags:    

Similar News