పొమ్మనలేక పొగబెడుతున్నారు.. కేశినేని నానిని సైడ్ చేసేసిన టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ ఆ ఎంపీని సైడ్ చేసేసిందా? అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు ఆ ఎంపీని ఆహ్వానించకపోవడం వెనుక మర్మమేంటి? ఏ పార్టీలో అయినా గ్రూపు రాజకీయాలు సహజం.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ ఆ ఎంపీని సైడ్ చేసేసిందా? అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు ఆ ఎంపీని ఆహ్వానించకపోవడం వెనుక మర్మమేంటి? ఏ పార్టీలో అయినా గ్రూపు రాజకీయాలు సహజం. అలా అని మహానాడులాంటి ప్రెస్జేజియస్ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడానికి కారణం పక్కకు పెట్టేసినట్లు హింట్ ఇచ్చిందా? ఎంపీగా ఉన్న అన్నను కాదని పార్టీలో కేవలం కార్యకర్తలా ఉన్న తమ్ముడికి అగ్రతాంబూలం ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇదంతా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసే జరుగుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నానిని కావాలనే టీడీపీ పక్కన పెట్టేసిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. గత ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలుపొందిన కేశినేని నానికి పార్టీలోని కీలక నేతలు సహాయ నిరాకరణ చేస్తూనే ఉన్నారు. అధినేత దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా పంచాయతీ సెటిల్ అవ్వలేదు. పంచాయితీ తేలకపోయినా పర్వాలేదు ఏకంగా తన కొంపలో కుంపటి పెట్టేశారనే ఆవేదన ఎక్కువైంది. తనపై తన తమ్ముడిని ఉసిగొల్పించడాన్ని కేశినేని నాని తట్టుకోలేకపోతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
అధిష్టానంపైనా అసంతృప్తి
2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచింది. ఫ్యాన్ గాలి ముందు హేమాహేమీలు సైతం నిలబడలేకపోయారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం భారీ మెజారిటీని కూడా కోల్పోయారు. అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అలాంటి ఫ్యాన్ తుఫాన్‌లో కూడా విజయవాడ ఎంపీగా రెండోసారి గెలుపొందారు కేశినేని నాని. రెండోసారి ఎంపీగా గెలుపొందిన తర్వాత కొన్ని రోజులపాటు పార్టీలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. సోషల్ మీడియాలో అయితే వైసీపీని ఓ రేంజ్‌లో ఉతికి ఆరేశారు. అంతేకాదు బీజేపీని సైతం వదల్లేదు. అయితే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలోని నేతల మధ్య ఆదిపత్య పోరు బట్టబయలైంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతలు కేశినేని నాని తనయ శ్వేతకు సహాయనికారణ చేశారు. ఫలితంగా మేయర్ స్థానం కోల్పోవాల్సి వచ్చింది.
అంతేకాదు తన సోదరుడు కేశినేని చిన్నిని తన రాజకీయ ప్రత్యర్థి వర్గం పెంచి పోషిస్తోంది. దీంతో కుటుంబంలో రాజకీయ విభేదాలు సైతం చోటు చేసుకున్నాయి. తనను పక్కన పెట్టి తన సోదరుడిని తనపైనే ఉసిగొల్పుతున్నారని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయం అంతా అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత లోకేశ్ కనుసన్నుల్లో జరుగుతున్నా కనీసం కూర్చోబెట్టి షెటిల్ చేయలేకపోవడం కలవరపాటుకు గురి చేసిందట. దీంతో ఎంపీ కేశినేని నాని టీడీపీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణా జిల్లాలోని టీడీపీ నాయకత్వంపైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
పొమ్మనలేక పొగబెడుతున్నారేమో
ఇకపోతే ఎన్నికలకు ముందు అత్యంత ప్రతిష్టాత్మకంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడును నిర్వహించింది. అయితే ఈ మహానాడుకు ఎంపీ కేశినేని నాని హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారానికి ఎంపీ కేశినేని నాని ఫుల్ స్టాప్ పెట్టారు. తనను మహానాడుకు కూడా పిలవలేదని బాంబు పేల్చారు. మహానాడులో తన పాత్ర ఏమైనా ఉంటుందా అని అడిగానని.. అయితే ఎంపీగా ఒక్క రామ్మోహన్ నాయుడు మాత్రమే మాట్లాడుతారు అని అన్నారని చెప్పుకొచ్చారు. అందుకే మహానాడుకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. మహానాడుకు పిలవడం, పిలకపోవడం పార్టీ ఇష్టమని చెప్పుకొచ్చారు. ఒక ఎంపీగా ఉన్న తనకు మహానాడు ఆహ్వానం అందకపోవడం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. తాను ఏ పార్టీతో టచ్‌లో లేనని చెప్పుకొచ్చారు. తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని అనిపిస్తోందన... ఆ మంట మరింత పెరిగినప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
అన్ని పార్టీలతో టచ్‌లో ఉంటా
వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని లేదంటే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని ప్రకటించేశారు. విజయవాడ ప్రజలు తన వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న విషయం బయటకు తెలియడంతో అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని కేశినేని నాని చెప్పుకొచ్చారు. తాను మంచి వాడిని కాబట్టే ఆహ్వానాలు వస్తున్నాయని తనను తాను సమర్థించుకున్నారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారంటే తాను మంచివాడిని అనేగా అర్థం అని కేశినేని నాని చెప్పుకొచ్చారు. ఇకపోతే కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని మిమ్మల్ని రమ్మన్నారని పీఏ ఫోన్ చేస్తే వెళ్లానే తప్ప అసలు చంద్రబాబు పర్యటన వెనుక ఉద్దేశం ఏంటో కూడా తనకు తెలియనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలను పరిశీలిస్తుంటే తాను కేవలం విజయవాడ ఎంపీని మాత్రమేనని.. పార్టీలో తనకు ఎలాంటి హోదా లేదన్నది అర్థమైందన్నారు.టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిని కాదు...కనీసం అధికార ప్రతినిధిని కూడా కాదని చెప్పుకొచ్చారు. ఇకపోతే బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా అన్ని పార్టీల నేతలతోనూ తాను టచ్‌లోనే ఉంటానని అందులో తప్పేముందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీలోని కొందరు నేతలపైతీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను గొట్టంగాడు అన్న వాడు, చెప్పుతో కొడుతా అన్న వాళ్లు కూడా పార్టీలో ఉన్నారంటూ కేశినేని నాని మండిపడ్డారు.‘పార్టీ ఇన్‌చార్జులు ఎవరు.. గొట్టంగాళ్లు’ అంటూ కేశినేని నాని దుయ్యబుట్టారు.
Read more: Kesineni Nani : టీడీపీపై కేసినాని నాని సంచలన వ్యాఖ్యలు