AP Politics: 'రోజా' వికసించేనా..? మంత్రికి తప్పని సొంత పార్టీ నేతల వ్యతిరేకత

నగరిలో రోజా వికసిస్తుందా, కూటమి విజయం సాధిస్తుందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-04-19 06:01 GMT

దిశ ప్రతినిధి, చిత్తూరు: నగరిలో రోజా వికసిస్తుందా, కూటమి విజయం సాధిస్తుందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఒక పర్యాయం గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రోజా ఆటుపోట్ల మధ్య చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా అధిష్టానం నుంచి ఈసారి సీటు తెప్పించుకోగలిగిందనే ప్రచారం జరుగుతోంది.

ఒక దశలో నగరి సీటు రోజాకు లేనట్టేననే వదంతులు కూడా వ్యాపించాయి. అయితే పార్టీ అధిష్టానంపై ఒత్తిడిని పెంచి ఏదో ఒక విధంగా పార్టీ టిక్కెట్టును రోజా చేజిక్కించు కోగలిగారు. టికెట్ అయితే సాధించగలిగిందే కానీ వ్యతిరేకులను కలుపుకుపోయే విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు కూడా వేయలేని పరిస్థితిలో రోజా ఉన్నారు.

నియోజకవర్గం లోని ప్రతి మండలంలో ఇక రోజాను వ్యతిరేకించే బలమైన వర్గం ఉన్నప్పటికీ అధిష్టానం వ్యతిరేక వర్గీయులను శాంతింప చేసే ప్రయత్నం కూడా ఇప్పటివరకు చేయలేదు. దాంతో ప్రస్తుతానికి రోజా పరిస్థితి దయనీయంగా ఉందనే విశ్లేషణ రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.ఇదిలా ఉండగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అభ్యర్థి అయిన గాలి భాను ప్రకాష్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పొచ్చు.

గత ఎన్నికల్లో రోజాపై పోటీ చేసి ఓటమిపాలైన భాను ప్రకాష్ ఈసారి ఎలాగైనా నెగ్గాలని ధీమాతో తన ప్రయత్నాలను తాను కొనసాగిస్తున్నారు. కానీ నియోజకవర్గ స్థాయిలో భాను ప్రకాష్‌ను వ్యతిరేకించే వర్గం కూడా బలంగానే ఉంది. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు ఇద్దరు వైసీపీకి సహాయపడుతూ రోజా విజయానికి కృషి చేసేందుకు క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన రోజాను ఢీకొనడం భాను ప్రకాష్‌కు సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ తాను తప్పక విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కున్న గుడ్‌విల్‌ను తాను ఈ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

కాగా నియోజకవర్గంలో ఇసుక, మట్టి తదితర అక్రమ రవాణాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రోజాతోపాటు ఆమె సోదరులు తలమునకలై ఉన్నట్లు సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షం కూడా దుమ్మెత్తిపోస్తోంది. దానికి తోడు ఖరీదైన కార్లు, పెద్దపెద్ద బంగ్లాలు కళ్లకు కట్టినట్లు అందరికీ కనిపిస్తుండడంతో అక్రమ వ్యాపారాల్లో రోజా పీకల్లోతు మునిగిపోయిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్థానికంగా సొంత పార్టీ నాయకులు ఆమెను ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు మరో ఎత్తుగా రోజాను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తనకు శ్రీరామరక్షగా నిలిచి తనను గెలిపిస్తాయని రోజా ధీమాగా ఉన్నారు.

ఈ సంక్షేమ అభివృద్ధి పథకాల ముందు తనపై వస్తున్న ఆరోపణలు ఒక లెక్క కాదంటూ ఆమె తోచిపుచ్చుతున్నారు. ఈసారి కూడా నగరిలో గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నగరిలో కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్న గాలి భానుప్రకాష్‌ను ఇంటి పోరు పట్టిపీడిస్తోంది. తన ఇంటిలోనే తనను వ్యతిరేకించే వాళ్లు ఉండడంతో ఇటు పార్టీలోని వ్యతిరేకులతోనూ అటు ఇంటి పోరుతోనూ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలో గత కొంతకాలంగా రాజకీయ వారసత్వ పోరు నడుస్తోంది. దీని కారణంగానే ముద్దుకృష్ణమనాయుడు మరణానంతరం ఆయన భార్యకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పట్లో ముద్దుకృష్ణమనాయుడు కుమారుల మధ్య సఖ్యత కుదిరి ఉంటే వారిద్దరిలో ఒకరిని ఎమ్మెల్సీ పదవి వరించేది.

సఖ్యత కుదరని కారణంగా వారిద్దరి మధ్య గ్యాప్ నానాటికి పెరుగుతూ వస్తోంది. దాంతో గాలి భాను ప్రకాష్ సోదరుడు బాహాటంగా రోజాకు మద్దతిస్తూ ఆమె గెలుపు కోసం కృషి చేస్తున్నాడు. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో ప్రముఖ విద్యాసంస్థల అధినేతగా ఉన్న ఓ నాయకుడు టీడీపీలో ఉంటూ పబ్లిక్‌ గా రోజాకు సపోర్ట్ చేస్తూ ఆమె గెలుపు కోసం పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. వీటి కారణంగా నగరిలో ఈసారి కూడా కూటమి అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌కు ఎదురీదే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News