రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు అసలు రీజన్ అదే: రేవంత్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ మధ్యయుగంలో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ మధ్యయుగంలో చక్రవర్తి మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడిన రేవంత్ రెడ్డి అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయశారని ధ్వజమెత్తారు. అదానీ-మోడీ చీకటి స్నేహంపై నిలదీయడం, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయన్నారు. రాజకీయ విమర్శలను వ్యక్తిగత కక్షగా తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జైలు శిక్ష అమలు చేయకుండా కోర్టే 30 రోజులు గడువు ఇచ్చిందని అలాంటప్పుడు లోక్ సభ ఎలా చర్యలు తీసుకోవడంపై మండిపడ్డారు. ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్య అని అభివర్ణించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
అనర్హుల వల్లే టీఎస్ పీఎస్సీలో అవకవతకలు:
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 2021లో టీఎస్ పీఎస్సీలో అర్హత లేని వారిని నియమించారని అనర్హులను నియమించడం వల్లే తప్పిందం జరిగిందని ధ్వజమెత్తారు. విద్యార్థి సంఘాలు నిరసనకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని తనను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో నిర్భందాలు నిత్యకృత్యమయ్యాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణ తప్పుదారి పట్టిస్తున్నారని దీనిపై జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. తన పాదయాత్ర ఏప్రిల్ 6 వరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు.