కేటీఆర్ సారీ చెప్పు లేదా నీ సంగతి తేలుస్తా! MP Komatireddy Venkat Reddy

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. వాళ్లిద్దరూ కోమటిరెడ్డిలు కాదని కోవర్ట్ రెడ్డిలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై

Update: 2022-10-11 11:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. వాళ్లిద్దరూ కోమటిరెడ్డిలు కాదని కోవర్ట్ రెడ్డిలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన నిప్పులాంటి తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి మంత్రి కేటీఆర్ చాలా పెద్ద తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓ సారి మంత్రిగా, ఎంపీగా పని చేసిన తానపట్ల ఇలాంటి వ్యాఖ్యలు సరికావన్నారు. తన విషయంలో కేటీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఇది ఎంతవరకు కరెక్టో ఆయనే ఆలోచించుకోవాలన్నారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ అని తాను కాంగ్రెస్ వ్యక్తిని అని అలాంటప్పుడు తననెందుకు ఇలాంటి మాటలు అంటున్నారని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డితో పోటీ పడాల్సింది పోయి నన్ను ఎందుకు లాగుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం గడ్డిపోచతో సమానంగా వదులుకున్నానని చెప్పారు.

కేటీఆర్ తండ్రి చాటున లీడర్ అయ్యాడని తాను అలా కాదన్నారు. యూత్ కాంగ్రెస్ ద్వారా సొంతంగా లీడర్ అయిన వ్యక్తిని తానని అన్నారు. నేను కాంట్రాక్టర్ ను కాదని, 40 ఏళ్లుగా నల్గొండలో కిరాయి ఇంట్లోనే ఉంటున్నాన్నారు. తనకు ఎక్కడైనా వ్యాపారంలో ఉంటే చూపించాలని అన్నారు. తమ్ముడికి ఫేవర్ చేయడానికే మునుగోడు ప్రచారానికి వెళ్లడం లేదన్న విమర్శలపై వెంకట్ రెడ్డి స్పందించారు. ఇది తమ అంతర్గత అంశమని చెప్పారు. ప్రచారానికి వెళ్లాలని నాకు ఉన్నప్పటికీ చండూరు కాంగ్రెస్ సభ విషయంలోనే తాను ఇంకా ఆలోచనలోనే ఉన్నాన్నారు. తనను అంతలా మాటలు అన్నాక ఏం ముఖం పెట్టుకుని వెళ్లాలని ఆలోచిస్తున్నాన్నారు. భవిష్యత్ లో మరో నేతతో తిట్టించరనే గ్యారెంటీ లేకపోవడంతోనే ప్రచారానికి వెళ్లడం లేదని చెప్పారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

ముందు కవితను కాపాడుకో..

కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల మధ్య మాటలు లేవన్నారు. వారంతా కొట్లాడుకున్నారని వారికి ప్రస్తుతం మాటలు లేవని చెప్పారు. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి నవ్వుతూ కనిపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాము అలా కాదని అన్నారు. తన సోదరుడు పార్టీ మారినా తాను కాంగ్రెస్ లోనే ఉంటానని ఇప్పటికే స్పష్టం చేసినా కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టులు అని కేటీఆర్ విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన అమెరికాలో చదివినట్లుగా లేదని గుంటూరులో చదివినట్లుగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తాను నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ సైతం మద్దతు తెలిపారని ఈ విషయం కేటీఆర్ తెలుసుకోవాన్నారు. తాను ఆస్ట్రేలియా వెళ్తున్నానని కేటీఆర్ కామెంట్ చేయడంపై మండిపడ్డారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తానని అన్నారు. అయినా ఈ విషయం కేటీఆర్‌కు ఏం అవసరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. ఏయే దేశాలకు వెళ్లి ఏం చేశారో తాను అడిగానా అని నిలదీశారు.

తాను మునుగోడుకు ప్రచారానికి వస్తానా లేదా అనే విషయం కేటీఆర్‌కు అనవసరం అని అన్నారు. కోమటిరెడ్డిలు కాదు కోవర్టులు అని మీరంటే నేను కల్వకుంట్ల కుటుంబం కాదు కమీషన్ల కుటుంబం అని అనగలనని అన్నారు. కేటీఆర్ ముందు తన సోదరి కవితను కాపాడుకోవాలని సూచించారు. మునుగోడులో అందరికీ టీఆర్ఎస్ తరపున ఇన్ చార్జిలు ఇచ్చారని చివరకు కేసీఆర్ కూడా ఓ గ్రామం బాధ్యత తీసుకున్నారు. కానీ కవితకు ఎందుకు ఇన్ చార్జి ఇవ్వలేదని ప్రశ్నించారు. అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేశారని ఈ కేసు నుండి ముందు కవితను కాపాడుకోవాలన్నారు. ఆమెను నీరవ్ మోడీ మాదిరిగా ఎక్కడ దాచిపెడుతారో దాచిపెట్టండని సూచించారు.

జగదీశ్ రెడ్డి ఓ హంతకుడు

రూ.18,000 కోట్ల కాంట్రాక్టులు తీసుకుని మునుగోడులో ఉప ఎన్నికకు కారణం అయ్యారని కోమటిరెడ్డి రాజగోపాల్ పై మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారని అడగ్గా.. జగదీశ్ రెడ్డి ఓ హంతకుడని ఆరోపించారు. మదన్ మోహన్ రెడ్డి, రాంరెడ్డి, భిక్షం ముగ్గురు మర్డర్ కేసుల్లో 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడని, అజ్ఞాతంలో కూడా గడిపి వచ్చాడని ఆరోపించారు. శంషాబాద్ ఏరియాలో 70 ఎకరాల్లో ఐదెకరాల్లో ప్రగతి భవన్ కట్టుకున్నాడని, బస్ కిరాయికి లేని జగదీశ్ రెడ్డికి ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏ వ్యాపారం చేయకుండానే జగదీశ్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు చెబుతున్నాను.. ఇంకోసారి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తాను ఊరుకోనని హెచ్చరించారు. కేటీఆర్ క్షమాపణలు డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పే వరకు ప్రతిరోజు కేటీఆర్ అవినీతి గురించి తాను మాట్లాడుతాన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే అని చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

సీఎం ఇచ్చిన స్క్రిప్ట్‌నే మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారు

Tags:    

Similar News