మార్గం మార్చిన మార్గాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎంపీ ప్రశంసలు..
నిన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
దిశ వెబ్ డెస్క్: నిన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.కాగా ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించినట్టు సమాచారం. కాగా ఓ భేటీపై వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం మద్దతు సంగతి ఏంటి..? అర్థంలేని భేటీ..!
కేంద్రంతో చర్చలు జరపకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రమేయం లేకుండా ఇరు రాష్ట్రల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయా..? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఓ కమిటీ ఉందని.. కేంద్రంతో చర్చలు జరపకేండానే మళ్లీ ఇప్పుడు కమిటీలు వేయడం ఎందుకో తనకైతే అర్థం కావడం లేదని అన్నారు.
అసలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ప్రరిష్కారించాలి అనుకుంటే సాధ్యం అవుతుందా..? అసలు ఈ సమావేశానికి అర్థం లేదని అన్నారు. అలానే సామావేశంలో ఏ అంశాలపై చర్చించారో స్పష్టత ఇవ్వాలని కోరారు
జనసేనానికి అభిమానిగా మారిన మార్గాని..
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సమావేశంలో భాగస్వామిని చేయకపోవడంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ టీడీపీపై ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పాల్గొన్నారని, కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనలేదని, పవన్ కళ్యాణ్ సైతం పాల్గొని ఉంటే సమావేశానికే ప్రాధాన్యత సంతరించుకునేదని కాని ఆయన్ని సమావేశంలో చంద్రబాబు భాగస్వామిని చేయలేదని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే దానికి కారణం 99% పవన్ కళ్యాణ్ అని, కూటమికి ఓట్లు పడ్డాయంటే అది పవన్ కళ్యాణ్ వల్లనే కానీ, మీ బఫూన్ ఫేసులు చూసి ప్రజలు ఓట్లు వేయలేదు అని అన్నారు.
మార్గం మార్చిన మార్గాని.. మనసులో యోచన ఇదేనా..?
వైసీపీకి కూటమికి మధ్య పచ్చ గడ్డి వేసినా బగ్గుమంటోంది. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇద్దరి మధ్యన విభేదాలు తారా స్థాయాలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీలో కీలక నేతగా ఉన్న మార్గాని భరత్ తమ అధినేత శతృవులా చూస్తున్న జనసేనాని పవన్‌ను ప్రశంసించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలే వైసీపీకి 2024 ఎన్నికల్లో ప్రతిపక్షం సైతం దక్కలేదు. 2029 ఎన్నికల సమయానికి పార్టీ మళ్లీ ప్రజల్లో బలోపితం అయ్యే మాట అటుంచితే అసలు పార్టీ అయినా ఉంటుందా..? అనే అనుమానం సొంత పార్టీ నేతల్లోనే కలుగుతుందని, ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పార్టీలో ఉండాలా..? పక్క గూటికి చేరాలా అనే యోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం మార్గాని భరత్ పవన్ కళ్యాణ్ ప్రశంసించడం చూస్తే భరత్ సైతం జనసేన గూటికి చేరాలిని చూస్తున్నారేమో అనే అనుమానం ఓ వైపు కలుగుతున్నా, కూటమి పార్టీ నేతల్లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారా అనే అనుమానం మరో వైపు కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.