కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎదగకూడదనే కవితకు నోటీసులు!.. గజ్జల కాంతం

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎదగకూడదనే కవితకు ఈడీ నోటీసులు ఇచ్చారని గజ్జల కాంతం ఆరోపించారు.

Update: 2023-03-09 13:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడనే కారణంతోనే తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యుల మీదకు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఒరుగంటి వెంకటేశం గౌడ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని ధ్వజమెత్తారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్జల కాంతం మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అక్రమం అన్నారు. అదానీ పది లక్షల కోట్ల దేశ సంపదను దోచుకుంటే ఎలాంటి దర్యాప్తు జరపకుండా అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న బీజేపీ సర్కార్.. తమ తప్పులను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కక్ష్య సాధిస్తోందన్నారు.

గత డెబ్భై ఏళ్లుగా ఢిల్లీ పాలకులు దక్షిణ భారతదేశానికి చెందిన నాయకులను అణిచివేస్తూనే ఉన్నారని ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారోనన్న భయంతో కేంద్ర ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏజెన్సీల నోటీసుల రూపంలో కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా ఒత్తిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో తెలంగాణ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమన్నారు. రాబోయే ప్రభుత్వంలో బీజేపీ అవినీతిని బయటకు తీస్తామన్నారు.

Tags:    

Similar News