చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ప్రపంచం మొత్తానికి తెలుసు
నారా భువనేశ్వరిని రాజమండ్రిలో గురువారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిసి సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాజకీయాలు, పార్టీ విషయాలు చర్చించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: నారా భువనేశ్వరిని రాజమండ్రిలో గురువారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిసి సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాజకీయాలు, పార్టీ విషయాలు చర్చించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండించారు. ప్రజలంతా బాబు అరెస్టును ఖండిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఎలాంటి అవినీతి మచ్చలేదని, రాజకీయ కక్ష్యసాధింపులో భాగంగానే జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు. ఐటీ మూల విరాట్‌గా, రాష్ట్ర ఆర్థిక సంపత్తిని 10 వేల కోట్ల నుంచి 60 వేల కోట్లకు తీసుకెళ్లిన విజనరీ లీడర్‌గా తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం గుర్తించి గర్విస్తుందని పేర్కొన్నారు.
అక్రమ కేసుల నుండి కడిగిన ముత్యంలా చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని ఆకాంక్షించారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఓటమిని గ్రహించే జగన్ అక్రమ కేసుల్లో బాబును ఇరికించే కుట్రకు తెరలేపాడని, జగన్ కుయుక్తులను తెలుగు ప్రజలు తిప్పికొడతారన్నారు. టీడీపీ కేడర్ పోరాటాలకు సిద్ధం కావాలని, తెలంగాణలోనూ టీడీపీ పునర్ వైభవం దిశగా ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, నాయకులు బంటు వెంకటేశ్వర్లు, శ్రీపతి సతీష్, పొలంపల్లి అశోక్, మేకల భిక్షపతి, కసిరెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.