Viral News: ఆసక్తికరంగా మారిన చెంబు, చిప్ప రాజకీయం
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి
దిశ వెబ్ డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వినూత్న ప్రచారానికి తెరలేపాయి. ఇరు పార్టీలు విడుదల చేస్తున్న కొత్త తరహా ప్రజకటనలతో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కడ చూసిన చెంబు, చిప్ప రాజకీయమే కనిపిస్తూ నెటిజన్స్‌ను కనువిందు చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అన్నభాగ్య పథకం కోసం మోడీ ప్రభుత్వాన్ని బియ్యం కోరితే ఖాళీ చెంబు ఇచ్చిందని ప్రధానిని ఎద్దేవ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అలానే కర్ణాటక చెల్లించే ప్రతి 100 రూపాయల పన్నులో మోదీ ప్రభుత్వం వాపసు ఇచ్చేది రూ.13 అంటూ చెంబు గుర్తుతో మరో ప్రకటన విడుదల చేసింది.
అయితే కాంగ్రెస్ ప్రకటనలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కన్నడిగుల చేతికి కాంగ్రెస్ ప్రభుత్వం కొబ్బరిచిప్ప ఇచ్చిందని బీజేపీ కూడా ప్రకటనలు ఇచ్చింది. అలానే కన్నడిగుల చేతికి కాంగ్రెస్ పాలనలో చిక్కింది చిప్పేనని రీకౌంటర్ ఇచ్చింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు, విద్యార్థులకు, కిసాన్ సమ్మాన్ ద్వారా అన్నదాతలకు చేతిలో చిప్ప పెట్టారని ప్రతిదాడికి బీజేపీ దిగింది.
అలానే కాలేజీకి వెళ్లిన యువతి లవ్ జిహాద్‌కు బలి కావాలా..? హోటల్లో టీ తాగేందుకు వెళ్లిన అమాయకులు బాంబు పేలుళ్లలో గాయపడాలా..? అంటూ ప్రకటనల్లో ప్రశ్నించింది. ప్రస్తుతం ఇరు పార్టీలకు సంబంధించిన ప్రకటనలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.