AP Politics: కొట్టు మురళి వ్యవహారాలపై ఆరా

వేల కోట్ల విలువ చేసే విశాఖ ఎన్సీసీ భూములను విజయసాయి ఆశీస్సులతో దక్కించుకొన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళి వ్యవహారాలు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

Update: 2024-07-05 03:40 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వేల కోట్ల విలువ చేసే విశాఖ ఎన్సీసీ భూములను విజయసాయి ఆశీస్సులతో దక్కించుకొన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సోదరుడు కొట్టు మురళి వ్యవహారాలు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. బెంగుళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న మురళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి బినామీగానే విశాఖ ఎన్సీసీ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకొని జీపీఆర్‌ఎల్ సంస్థకు వాటిని బదిలీ చేయించారనే సమాచారం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. స్వతహాగా ప్రభుత్వం నుంచి భూములు పొందిన నాగార్జున కన్‌స్ర్టక్షన్ కంపెనీ (ఎన్‌సీ‌సీ‌)తోపాటు జీపీఆర్ఎల్‌కు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేశాయి.

మురళి బెంగుళూరు వ్యవహారాలపై దృష్టి

కొట్టు సత్యనారాయణ సోదరుడు మురళి బెంగుళూరు కేంద్రంగా చేస్తున్న వ్యాపారాలపై దర్యాప్తు సంస్థలు వివరాలను సేకరించే పనిలో పడ్డాయి. ఆయన చేసిన వ్యాపారాలకు సంబంధించి జీఎస్టీ ఎగవేత కేసులు నమోదయ్యాయన్న సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు. వీటి ఆధారంగా ఏఏ వ్యవహారాల్లో మోసం జరిగింది? ఎంత మేర జరిగింది? అన్న వివరాలను రాబడుతున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి, ఆయన ఇతర బినామీలు, సంస్థలకు మురళీ నుంచి ఆయన సంస్థల నుంచి జరిగిన లావాదేవీలను, నగదు బదిలీలను పరిశీస్తున్నట్లు తెలిసింది.

సింగపూర్ రమణారెడ్డి కోసం వేట

కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా తాజాగా సింగపూర్ రమణా రెడ్డి వ్యవహారాలపై ఆరా తీస్తోంది. పలు కుంభకోణాలకు రమణారెడ్డి కారణం కావడం, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో విశాఖ వుడాతో పాటు పలు చోట్ల జరిగిన భూ కేటాయింపులు ఆయన సంస్థల పేరిట జరగడం ఆ తరువాత అవి చేతులు మారడంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఆయనపై పలు లుక్ అవుట్ నోటీసులు కూడా పెండింగ్‌లో వున్నందున కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో ఆయనను రప్పించి విచారించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.


Similar News