పాలమూరు ప్రాజెక్టు పునాదిలోనే మానవీయతకు సమాధి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రెండో ప్యాకేజీ వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పరిధిలోని అన్కాన్ ప‌ల్లి తండా, కారుకొండ తండా, రామిరెడ్డి ప‌ల్లి తండా, జీ గుట్ట తండా, అంకాన్ ప‌ల్లి గ్రామాల నిర్వాసితులను తరలించే క్రమంలో పోలీసులతో బెదిరించి ఖాళీ చేయించి మానవత్వాన్ని ప్రాజెక్టు పునాదుల్లోనే సమాధి చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2023-05-28 12:35 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రెండో ప్యాకేజీ వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పరిధిలోని అన్కాన్ ప‌ల్లి తండా, కారుకొండ తండా, రామిరెడ్డి ప‌ల్లి తండా, జీ గుట్ట తండా, అంకాన్ ప‌ల్లి గ్రామాల నిర్వాసితులను తరలించే క్రమంలో పోలీసులతో బెదిరించి ఖాళీ చేయించి మానవత్వాన్ని ప్రాజెక్టు పునాదుల్లోనే సమాధి చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పీపుల్స్ మార్చ్ 74వ రోజు సందర్భంగా పాలమూరు రంగారెడ్డి వట్టెం ప్రాజెక్టు సందర్శన అనంతరం పాదయాత్రగా నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాసితుల గోడు విని వారి పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకే వారి మాటపై నమ్మకంతో వేచి చూశారని చివరికి ప్రాజెక్టులోకి నీళ్లు రప్పించేందుకు దళిత, గిరిజన నిర్వాసితులకు కన్నీళ్లే మిగిల్చారని ఆరోపించారు. కనీసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని వసతులతో కూడిన పునరావాసం కల్పించాకే తరలించాల్సి ఉన్నా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి బలవంతంగా ఖాళీ చేయించడం దుర్మార్గమన్నారు.

భూమి కోల్పోయిన వారికి భూమి, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు, బోరు బావి, గుడి, బడి ఇలా అన్నింటికీ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాల్సింది పోయి ప్రాజెక్టు కోసం అన్నీ కోల్పోయిన గిరిజనులకు మాత్రం ప్రభుత్వం మొండిచేయి చూపిందన్నారు. నోరులేని మూగవారిగా అచేతనంగా ఉన్నారని ఉపాధి లేక పునరావాస కేంద్రాల్లో వసతులు లేక దీనావస్థలో బతుకుతున్నారని వాపోయారు. 2013 భూ సేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు చేయ‌కుండా ఈ ద‌ళిత‌, గిరిజ‌నుల భూముల‌ను జీఓ 123 ద్వారా బ‌ల‌వంతంగా గుంజుకోవ‌డం వారిని నైతికంగా సమాధి చేయడమేనన్నారు. ముంపునకు గుర‌వుతున్న కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చి వారి క‌డుపు నింపాకే.. ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పి వారిని మోసగించారని మండిపడ్డారు.

వ‌ట్టెం ప్రాజెక్టు సంద‌ర్శ‌నలో చాలా విషయాలు బయటపడుతున్నాయని ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తంగా 4,500 ఎక‌రాలు, 463కు పైగా నివాస గృహాలు.. నాలుగు తండాలు, ఒక పల్లె ప్రాజెక్టులో సంపూర్ణంగా పోయాయన్నారు. ఈ నిర్వాసితులకు 2013 భూ సేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం ప‌రిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండ‌గా.. జీఓ నెంబ‌ర్ 123 ప్ర‌కారం ప‌రిహారం ఇచ్చారని బాధితులు తన దృష్టికి తెచ్చారన్నారు. భూమికి భూమి అడిగిన బాధిత నిర్వాసితుల‌ను జైలుకు పంపుతామ‌ని బెదిరించ‌డం పూర్తిగా రాజ్యాంగ హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మేనన్నారు.

ప్రాజెక్టు భూ సేక‌ర‌ణ ముందు జరిగిన సోషల్ ఎకానమీ సర్వేలో కూడా భారీ అవకతవకలు జరిగాయన్నారు. 18ఏళ్లు నిండిన 154 మందికి రీ హ్యాబిటేష‌న్ ప్యాకేజీ రాలేద‌న్నారు. కారుకొండలోని స‌ర్వే నెంబ‌ర్ 87లో 150 ఎక‌రాల్లో ద‌ళితులు కాస్తులో ఉన్నారు. అందులోని 20 ఎక‌రాలు కాస్తులో ఉన్న‌వారికి డ‌బ్బులు ఇవ్వ‌కుండా కొద్దిమంది దళారులు స్వాహ చేశార‌ని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాకోటలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, జడ్పీటీసీలు రోహిణి, సుమిత్ర, డిసిసి ప్రధాన కార్యదర్శి అర్థం రవి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోడిదల రాము తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News