బీఆర్ఎస్ మాజీ మంత్రికి సొంత పార్టీలో షాక్

బీఆర్ఎస్ లో గ్రూప్ పాలిటిక్స్ మరోసారి సంచలనం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాభవం నుంచి తేరుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న వేళ జిల్లా నేతల్లో ఆధిపత్య పోరు క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది.

Update: 2024-01-25 11:04 GMT

దిశ, ఖమ్మం/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ లో గ్రూప్ పాలిటిక్స్ మరోసారి సంచలనం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాభవం నుంచి తేరుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న వేళ జిల్లా నేతల్లో ఆధిపత్య పోరు క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తోంది. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్ అవుతోంది. మాజీ మంత్రి పువ్వాడకు సొంత పార్టీ నాయకులే షాక్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బుధవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఖమ్మంలో జరిగాయి. ఈ సందర్భంగా వద్దిరాజు మద్దతుదారులు అనేక చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఫోటో మాయం అయింది. అధికారంలో ఉన్నన్నాళ్లు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పువ్వాడ అజయ్ కుమార్ కు తాజాగా సొంత పార్టీలోనే ఈ అనుభవం ఎదురు కావడం చర్చనీయాశం అయింది. అయితే పువ్వాడను విస్మరించడం వెనుక అధిష్టానం ఆదేశాలు ఉన్నాయా అనే సందేహాలు పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతున్నాయి.

పువ్వాడపై గులాబీ హైకమాండ్ సీరియస్:

గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ చావు దెబ్బ తిన్నది. భద్రాచలం మినహా మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీనికంతటికి కారణం అధికారంలో ఉండగా మంత్రి హోదాలో పువ్వాడ అజయ్ వ్యవహరించిన తీరు కూడా ఓ కారణం అనే విమర్శలు ఉన్నాయి. పువ్వాడ తీరుపై జిల్లాకు చెందిన కీలకమైన నేతలు పార్టీని వీడారని దీంతో ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ భారీగా పడిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పువ్వాడ తీరు మార్చుకోవాలని అధిష్టానం అనేక సందర్భాల్లో హెచ్చరించినా ఆయన తన తీరు మార్చుకోకపోవడం వల్లే ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం అయిందనే అభిప్రాయానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత పువ్వాడపై ఆగ్రహంతో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఓటమి తర్వాత పువ్వాడ ముఖం చాటేశారని దీంతో ఆయనను లైట్ తీసుకోవాలని జిల్లా నేతలకు అధిష్టానం హింట్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వద్దిరాజు బర్త్ డే వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పువ్వాడ ఫోటో కనిపించకుండా పోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో అధిష్టానం జోక్యంతో సద్దుమణిగిన వివాదం:

ఖమ్మం ఎమ్మెల్యేగా, జిల్లా మంత్రిగా పని చేసిన పువ్వాడ అజయ్ కుమార్, రవి చంద్రలకు మధ్య మొదటి నుంచి అంతర్గత వివాదం కొనసాగుతుందనే టాక్ ఉంది. అయితే అధికారంలో ఉండగా కేటీఆర్, కేసీఆర్ జోక్యంతో ఈ ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇరువర్గాలను నచ్చజెప్పడంతో విభేదాలు పైకి కనిపించకుండా కొంత కాలం సైలెంట్ అయిపోయినట్లు చర్చ జరిగింది. అయితే ఇన్నాళ్లు సద్ధుమణిగిన వివాదం అజయ్ కుమార్ ఓడిన తర్వాత మరోసారి తెరపైకి రావడం బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడం ద్వారా పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మంలో మాజీ మంత్రి వర్సెస్ ఎంపీ మధ్య వర్గపోరు ఎలాంటి డ్యామేజికి దారితీస్తుందో అనే ఆందోళన క్యాడర్ లో వ్యక్తం అవుతున్నది. పార్టీలో ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి రాజుకోగా ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ఏ తీరానికి చేర్చుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News