టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారింది.. కానీ ప్రజల బతుకులు మారలే.. జేపీ నడ్డా

ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పేరును టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నారని, కానీ తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం మారలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2023-03-31 16:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పేరును టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నారని, కానీ తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం మారలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డితో పాటు తెలంగాణలో మొత్తం ఐదు జిల్లాల పార్టీ కార్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెండు జిల్లాల పార్టీ కార్యాలయాలను ఢిల్లీ నుంచి వర్చువల్ గా జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందని, ఈడీ విచారణ ఎదుర్కొంటోందని విమర్శలు చేశారు. సారా స్కామ్ చేసి కవిత తెలంగాణ పరువు తీసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు తానేదో చేశానని సీఎం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, సొంత రాష్ట్రానికే ఏమీ చేసుకోలేని సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలని ప్రయాస పడుతున్నాడని, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు కేసీఆర్ తీరు తయారైందని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రిష్వత్ సర్కార్ అని నడ్డా విరుచుకుపడ్డారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీకి ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని ఫైరయ్యారు. ఇకపోతే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓబీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై కోర్టు క్షమాపణలు చెప్పమన్నా చెప్పలేదన్నారు. అహంకారంతో ఉన్న రాహుల్ కి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నడ్డా పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని, దేశం మొత్తంలో పటిష్టమైన క్యాడర్ కలిగి ఉన్న పార్టీగా ఆయన అభివర్ణించారు. 18 కోట్ల సభ్యత్వం కలిగి ఉండటమే కాకుండా, 973 జిల్లా కమిటీలతో పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా జేపీ నడ్డా సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతోపాటు జనగామ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, చిత్తూరు జిల్లాల కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు.

అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది జీవితాలు నాశనమయ్యాయని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంతమంది నష్టపోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయకుండా దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లుగా మళ్లీ వాళ్ల ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ నోరెందుకు విప్పడం లేదని బండి ప్రశ్నించారు. పరువు లేనోడు తనపై పరువు నష్టం దావా వేశాడని బండి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ఏ దందాను వదిలిపెట్టదని ఒకరు లిక్కర్, ఇంకొకరు డ్రగ్స్ దందా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు పరువు నష్టం పేరుతో దందా చేస్తున్నారని బండి విరుచుకుపడ్డారు. ఆ కుటుంబాన్ని ఉపేక్షిస్తే తెలంగాణను సర్వనాశనం చేస్తారని ప్రజలకు సూచించారు. మంత్రి కేటీఆర్.. ప్రధానిని బ్రోకర్ అనడంపై బండి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారున. ట్విట్టర్ టిల్లు ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్ అని విమర్శలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం ఇస్తే 5 లక్షల కోట్లు అప్పు చేశారని, పొరపాటున ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే మరో రూ.5 లక్షల కోట్లు అప్పు చేయడం ఖాయమని ప్రజలకు వివరించారు. బీజేపీ అంటే ఉత్తరాదికి పరిమితైన పార్టీ అని చాలా మంది విమర్శించారని, దక్షిణాదిలోనూ బీజేపీ సత్తా చాటిందని నాయకులకు వివరించారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచి బీజేపీ సత్తా ఏంటో చాటామని పేర్కొన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగానే బీజేపీ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని, వారి స్ఫూర్తితో తెలంగాణలోనూ విజయం సాధించబోతున్నట్లు సంజయ్ స్పష్టంచేశారు. ఇది తెలిసే కేసీఆర్ కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. బీజేపీని ఆడిపోసుకుంటూ టైం పాస్ చేయడం తప్పితే బీఆర్ఎస్ కు తెలంగాణలో ఏమేరకు అభివృద్ధి చేశారో చెప్పుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం ఏటా క్రమం తప్పకుండా యూపీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే తెలంగాణ సర్కార్ కు ఎందుకు చేతగావడం లేదని సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్.. తన కొడుకును బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు భృతి ఇచ్చేదాకా పోరాడుతామని, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ను తరిమి కొట్టేదాకా ఉద్యమిస్తామని బండి సంజయ్ స్పష్​టంచేశారు.

సంగారెడ్డి జిల్లా నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, సహ ఇంచార్జ్ అరవింద్ మీనన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహనరావు, జనగామ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు.

Tags:    

Similar News