అవినీతిపరులకు బీజేపీ ప్రభుత్వం కాపలా: ఇందిరా శోభన్

కళ్ళ ముందు అవినీతి చేసి మెడలో బోర్డు వేసుకొని తిరుగుతున్న అవినీతిపరులకు బీజేపీ ప్రభుత్వం కాపలా కాస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ ఆరోపించారు.

Update: 2022-10-08 14:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కళ్ళ ముందు అవినీతి చేసి మెడలో బోర్డు వేసుకొని తిరుగుతున్న అవినీతిపరులకు బీజేపీ ప్రభుత్వం కాపలా కాస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈడీ, ఇన్కమ్ టాక్స్, సీబీఐ‌లను అవినీతివైపు చూడకుండా కళ్ళకు గంతలు కట్టినదని విమర్శించారు. పంజాబ్ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రభ పత్రికకు రూ.20 కోట్లు చేరాయని అందులో టీఆర్ఎస్ సభ్యుల హస్తముందని, కవిత సన్నిహితుడు అభిషేక్ రెడ్డి అందులో పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించి కేసీఆర్ కుటుంబం వివరణ ఇవ్వాలని అడుగుతూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చేసిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రభకు కోట్ల రూపాయలు బదిలీ అయితే అవి దేనికోసం బదిలీ చేశారో ఈడీ ఎందుకు ప్రకటించలేదని, ఆయన సమాధానం చెప్పాలని, లేకపోతే ఈడీ బీజేపీ అధికార ప్రతినిధి చెవిలో చెప్పిందా ఈ విషయం ఆయనకెలా తెలిసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు ఈడీ దాడులు కవిత సన్నిహితులపై చేస్తుందని తెలుపుతూ రెండోవైపు కేసీఆర్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అడగడంతో బీజేపీ, టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందానికి నిదర్శనమని విమర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఎలాగైనా నిరోధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై, ఎమ్మెల్యేల‌పైన మంత్రుల పైన బూటకపు కేసులు బనాయించడం కోసం సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను ఆప్ నాయకులపై బీజేపీ ఉసిగొల్పుతున్నదని పేర్కొన్నారు. బట్ట కాల్చి మీద వేయడం, మీడియాకు కాకమ్మ కథలు అల్లి చెప్పడంలో బీజేపీ వాళ్లు ఆరితేరిపోయారని, వాళ్లు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే మాటనే రాదని వాళ్ళు నిజాలను పాతరేసి అబద్ధాల మీదనే వాళ్ల పార్టీ పబ్బం గడుపుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Tags:    

Similar News