దాడి వీరభద్రరావు ఫ్యామిలీలో పదవుల లొల్లి.. నువ్వా? నేనా?
దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు. టీడీపీ తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా తమకు ఎలాంటి పదవులు రాకపోవడంతో ఆ కీలక నేత అలిగారట. ఇంతకీ ఆనేత ఎవరనుకుంటున్నారా..? విశాఖపట్నంకు చెందిన దాడి వీరభద్రరావు. […]
దిశ, ఏపీ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు. టీడీపీ తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా తమకు ఎలాంటి పదవులు రాకపోవడంతో ఆ కీలక నేత అలిగారట. ఇంతకీ ఆనేత ఎవరనుకుంటున్నారా..? విశాఖపట్నంకు చెందిన దాడి వీరభద్రరావు.
తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగిన ఆయన ఎమ్మెల్సీ పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందని టీడీపీకి దూరమయ్యారు. 2013లో దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తైంది. తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరారు. అందుకు చంద్రబాబు నో చెప్పారు. యనమల రామకృష్ణుడుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీంతో దాడి వీరభద్రరావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన తనయుడు దాడి రత్నాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు. విశాఖ పశ్చిమ నియోజవర్గం నుంచి రత్నాకర్ వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
అనంతరం దాడి ఫ్యామిలీ వైసీపీకి రాజీనామా చేసింది. నాలుగున్నరేళ్ళు రాజకీయాలకు దూరమైంది. ఒకానొక దశలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ తన రాజకీయ ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరతారని ప్రచారం జరగడంతో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం గట్టిగానే శ్రమించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమందికి పదవులు వచ్చాయి. కానీ దాడి వీరభద్రరావును గానీ ఆయన తనయుడును గానీ ఎలాంటి పదవులు వరించలేదు. ఈ విషయాన్ని దాడి వీరభద్రరావు సీఎం జగన్‌తోపాటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
అయితే దాడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం జగన్ స్వయంగా అన్నట్లు తెలుస్తోంది. ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి కీలకమైన పదవి అప్పగించాలని విజయసాయిరెడ్డికి సీఎం జగన్ ఆదేశించారట. అయితే దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు దాడి రత్నాకర్ కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తనకు వయసు అయిపోతున్న తరుణంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని.. అటు తనయుడు దాడి రత్నాకర్‌కు విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వాలని అడిగినట్టు సమాచారం.
ఇప్పటి వరకు యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు సుకుమార వర్మ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు చైర్మన్ పగ్గాలు చేపట్టారు. ఈసారి పగ్గాలు మార్చే అవకాశం ఉండటంతో తనకు ఇవ్వాలని రత్నాకర్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం కూడా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. రత్నాకర్‌కి ఆ పదవిని ఇచ్చి తండ్రి దాడి వీరభద్రరావు సేవలను పార్టీ కోసం వాడుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తేల్చుకోవాల్సింది దాడి వీరభద్రరావు ఫ్యామిలీయే అని అంటున్నారు.
దాడి వీరభద్రరావుది నాలుగు దశాబ్దాలుగా రాజకీయం. అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించారు. మరి కుమారుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా దాడి వీరభద్రరావు వెనక్కి తగ్గుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ పదవిపై వెనక్కి తగ్గితే డీసీసీబీ చైర్మన్‌గా దాడి రత్నాకర్ నియామకం ఖాయమే అంటున్నారు. అలాకాని పక్షంలో డీసీసీబీ చైర్మన్ పదవి వేరొకరికి వెళ్లిపోవడం తప్పని పరిస్థితి. మెుత్తానికి ఈ తండ్రీ కొడుకుల రేసులో ఎవరిని పదవి వరిస్తుందో చూడాలి.