గ్రేటర్‌లో నోటాకు పోటాపోటీ..
దిశ, శేరిలింగంపల్లి: ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత.. ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పాలించడం అని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇప్పుడు ఆ అర్థం మారుతుందా..? ప్రజలకు ఇష్టం లేని నాయకులు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారా..? అంటే గ్రేటర్ ఎన్నికలను చూస్తే అదీ నిజమేనేమో అనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హైదరాబాద్ బల్దియా ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశాయి. కానీ ఓటర్లను మాత్రం పోలింగ్ స్టేషన్ల వరకు రప్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. […]
దిశ, శేరిలింగంపల్లి: ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత.. ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు పాలించడం అని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇప్పుడు ఆ అర్థం మారుతుందా..? ప్రజలకు ఇష్టం లేని నాయకులు ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారా..? అంటే గ్రేటర్ ఎన్నికలను చూస్తే అదీ నిజమేనేమో అనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన హైదరాబాద్ బల్దియా ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశాయి. కానీ ఓటర్లను మాత్రం పోలింగ్ స్టేషన్ల వరకు రప్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. చాలామంది ఓటర్లు ఈ ఎన్నికలను చాలా లైట్ గా తీసుకున్నట్లే కనిపించింది. అందుకు కారణాలు ఏవైనా ప్రజలు మాత్రం పెద్దగా ఆసక్తి కనబర్చలేదు అనడంలో సందేహం అక్కరలేదు.
నోటాకు పోటాపోటీ..
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్ పేట్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ డివిజన్లు ఉన్నాయి. ఈ అన్ని డివిజన్లలోనూ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలతో పాటు స్వతంత్రులు సైతం పోటీ చేశారు. కొన్ని డివిజన్లలో గెలిచిన అభ్యర్థి సాధించిన మెజార్టీకి దగ్గరలో నోటాకు పడ్డ ఓట్లు, చెల్లని ఓట్లే ఉన్నాయి అంటే ప్రజల తీరుపై ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గచ్చిబౌలి డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి గంగాధర్ రెడ్డి సమీప అభ్యర్థి, టీఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పోటీ చేశారు. అయితే 1135 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కానీ ఇక్కడ 562 ఓట్లు చెల్లకుండా పోగా, 207 ఓట్లు నోటాకు పోలయ్యాయి. చెల్లకుండా పోయిన ఓట్లలో కూడా చాలా వరకు కావాలని రెండు గుర్తులపై స్వస్తిక్ సింబల్‌ను వేసిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీన్నిబట్టి ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులపై ప్రజలు అంతగా నమ్మకం కనబర్చలేదనే చెప్పాలి. ఇలా ఈ ఒక్క చోటే కాదు. కొండాపూర్ డివిజన్ లో అత్యధికంగా 675 ఓట్లు నోటాకు పడగా, 341 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి పడిన ఓట్లకంటే నోటాకు పడిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇక మియాపూర్ డివిజన్ లో నోటాకు 313 ఓట్లు పోలవగా 186 ఓట్లు చెల్లకుండా పోయాయి. హఫీజ్ పేట్ డివిజన్ లో నోటాకు 283 పోలవగా, 434 చెల్లలేదు. చందానగర్ డివిజన్ లో 278 ఓట్లు నోటాకు పోలవగా 334 ఓట్లు చెల్లకుండా పోయాయి. మాదాపూర్ డివిజన్ లో నోటాకు 158 పోలవగా, 298 ఓట్లు చెల్లలేదు. శేరిలింగంపల్లి డివిజన్ లో 283 నోటాకు రాగా, ఏకంగా 721 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. పదుల సంఖ్యలు కాదు ప్రతీ డివిజన్ లోనూ వందలాది మంది ఓటర్లు నోటాకు ఓటు వేసి, లేదా చెల్లకుండా రెండు గుర్తులపై వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. నోటా సిస్టం వచ్చిన తర్వాత ఇంత పెద్దమొత్తంలో నోటాకు పోలవడం ఇదే మొదటిసారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాకుండా కార్పొరేటర్ ఎన్నికలకే ఇన్ని నోటా ఓట్లు పోలవడం నిజంగా ఆశ్చర్యపడాల్సిన అంశమే.
మారాల్సింది ఎవరు..!?
నోటా ఓట్లు, చెల్లకుండా పోయిన ఓట్లు చాలా చోట్ల అభ్యర్థుల గెలుపు ఓటముల మీద ప్రభావం చూపాయి. స్వతంత్రులుగా పోటీచేసిన చాలామంది కంటే కూడా నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఆయా పార్టీల నుండి తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్న పార్టీలు మరోసారి సరైన వారినే అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నామా అనేది అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది స్పష్టం అవుతోంది. ప్రజల శ్రేయస్సుకోసం పనిచేసే వారే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికల గోదాలోకి దిగితే ఈనోటాకు పని తప్పుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.