పైసలుంటేనే ‘ఎంట్రీ’.. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రైవేట్ దందా

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సర్కార్​ ముందుకు వెళ్తుంటే.. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో అది సాధ్యపడటం లేదు. రోగి ప్రవేశం దగ్గర్నుంచి డిశ్చార్జ్​ అయ్యే వరకు పైసలు చెల్లించనిదే పని పూర్తి కాదు. చివరకు చనిపోయిన బాడీని అప్పజెప్పినందుకూ సెక్యూరిటీలకు డబ్బులు ఇవ్వాల్సిందే. గాంధీ, ఉస్మానియాలో ఈ పరిస్థితి కాస్త అదుపులో ఉన్నా.. నిలోఫర్​లో మాత్రం అతి దారుణంగా ఉన్నది. ఆసుపత్రిలోకి ప్రవేశించాలన్నా.. పేషెంట్​ని చూడాలన్నా.. ప్రతీ దానికి డబ్బులు […]

Update: 2021-09-22 20:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సర్కార్​ ముందుకు వెళ్తుంటే.. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో అది సాధ్యపడటం లేదు. రోగి ప్రవేశం దగ్గర్నుంచి డిశ్చార్జ్​ అయ్యే వరకు పైసలు చెల్లించనిదే పని పూర్తి కాదు. చివరకు చనిపోయిన బాడీని అప్పజెప్పినందుకూ సెక్యూరిటీలకు డబ్బులు ఇవ్వాల్సిందే. గాంధీ, ఉస్మానియాలో ఈ పరిస్థితి కాస్త అదుపులో ఉన్నా.. నిలోఫర్​లో మాత్రం అతి దారుణంగా ఉన్నది. ఆసుపత్రిలోకి ప్రవేశించాలన్నా.. పేషెంట్​ని చూడాలన్నా.. ప్రతీ దానికి డబ్బులు చెల్లించాల్సిందే. ఆఖరికి డెలివరీ తర్వాత బిడ్డను చూపించాలన్నా.. ఆయాలు పైసలు వసూలు చేస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనికి అమ్మాయి పుడితే ఒక రేట్​, అబ్బాయి పుడితే మరో రేట్లను కూడా ఫిక్స్​ చేస్తున్నారు. సగటున రూ. 1500 తప్పనిసరిగా ఇస్తేనే తప్ప శిశువులను చూపించరంటూ ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు పేషెంట్లను ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్​ కు తరలిస్తే రూ.500, ఆపరేషన్లు అయిన గర్భిణీలకు ప్యాడ్​ లు మార్చాలంటే రూ. 150, డ్రెస్సింగ్​ కు రూ. 200లను ఆయమ్మలకు ఇవ్వాల్సిందే. ఇక ఎమర్జెన్సీ వార్డులలో బాత్​ రూంకి వెళ్లాలన్నా, పబ్లిక్​టాయిలెట్​ లకు చెల్లించినట్టు డబ్బులు ఇవ్వాల్సిన దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.

ఇక అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్​ కు బెడ్​ కావాలన్నా రూ. 500 ఇవ్వనిదే లభించదు. ఇదంతా డాక్టర్ల మధ్యలోనే జరుగుతున్నా స్పందించని పరిస్థితి నెలకొన్నది. శానిటేషన్​, సెక్యూరిటీ వ్యవస్థను ప్రైవేట్​ సంస్థకు అప్పజెప్పడం వలనే ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు నిలోఫర్ ​ఆసుపత్రిలోని ఓ కీలక అధికారి చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్​ పరిధిలోని 24 సర్కార్ దవాఖాన్లలోనూ ఇదే పరిస్థితి దాపరించింది. ప్రైవేట్ సిబ్బంది సిండికేట్​గా ఏర్పడి ఈ దందాను కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ ఏజేన్సీలు సూపర్​ వైజర్ల పర్యవేక్షణలోనే ఈ తతంగం అంతా నడుస్తున్నా,.. వైద్యశాఖ ఉన్నతాధికారులు నోరు మెదపరు. దీంతో చేసేందేమీ లేక వైద్యులు కూడా చోద్యం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ​

డాక్టర్లకు బెదిరింపులు

ప్రభుత్వాసుపత్రులను కాంట్రాక్ట్​ తీసుకున్న ఓ ప్రైవేట్​ ఏజెన్సీలకు చెందిన సిబ్బంది పేషెంట్లతో పాటు చివరకు డాక్టర్లను బెదిరిస్తున్నట్టు సమాచారం. ఇటీవల గాంధీ ఆసుపత్రి అత్యవసర వార్డులో పేషెంట్ల దగ్గర్నుంచి డబ్బులు తీసుకుంటున్న సెక్యూరిటీని డ్యూటీలో ఉన్న డాక్టర్​ ప్రశ్నిస్తే.. ఆయనపై దాడికి దిగేందుకు కూడా వెనకాడలేదని సమాచారం. అంతేగాక ఆసుపత్రుల్లో పనులు సరిగ్గా చేయడం లేదని ప్రశ్నిస్తే.. తన సిబ్బందితో ప్రైవేట్​ ఏజెన్సీ ధర్నాలు చేయిస్తోంది. గతంలో ఆ సంస్థకు చెందిన సిబ్బంది పనితీరుపై హెల్త్ ఆఫీసర్లు, డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఇప్పటికీ వారినే కొనసాగించడానికి కారణాలు తెలియడం లేదు. కొత్తగా అందుబాటులోకి రాబోతున్న ఆస్పత్రుల్లో కూడా కాంట్రాక్ట్​ దక్కించేందుకు ఆ సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖలోని ఓ అధికారి ‘ దిశ’కు చెప్పారు.

విజిటర్లకు పరేషానే

ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు వచ్చే విజిటర్లూ ఎంతో కొంత చెల్లించనిదే సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి పంపరు. కుటుంబ సభ్యులు ఆహారం తీసుకుపోవాలన్నా కూడా ఇదే తంతు కొనసాగుతున్నది. అంతేగాక వార్డులలో పేషెంట్‌ దగ్గర ఒక్కరికి మించి ఉండకూడదనే నిబంధనను ఆసరా చేసుకొని బెదిరిస్తూ మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.

Tags:    

Similar News