కార్పొరేట్ దోపిడీకి వేళాయే.. విద్యార్థులు, పేరెంట్స్‌కు యాజమాన్యాల డెడ్‌డైన్..!

దిశ, కరీంనగర్ సిటీ, ధర్మపురి : విద్యాసంస్థలు ప్రారంభమై పది రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. నిబంధనలకు నీళ్లు వదిలిన కళాశాలల యాజమాన్యాలు తాము అనుబంధంగా నడిపిస్తున్న హాస్టళ్లు తెరిచి బలవంతపు వసూళ్ల పర్వానికి తెరలేపారు. విద్యార్థులు వసతి గృహాల్లో ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేశారు. కాలేజీ, హాస్టల్ ఫీజు మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. మీ వద్ద డబ్బులు లేకుంటే విద్యారుణాలు కూడా మేమే ఇప్పిస్తాం. ఒకేసారి మొత్తం ఫీజు […]

Update: 2021-09-11 08:40 GMT

దిశ, కరీంనగర్ సిటీ, ధర్మపురి : విద్యాసంస్థలు ప్రారంభమై పది రోజులు కూడా కాలేదు. అప్పుడే ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ మొదలైంది. నిబంధనలకు నీళ్లు వదిలిన కళాశాలల యాజమాన్యాలు తాము అనుబంధంగా నడిపిస్తున్న హాస్టళ్లు తెరిచి బలవంతపు వసూళ్ల పర్వానికి తెరలేపారు. విద్యార్థులు వసతి గృహాల్లో ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేశారు. కాలేజీ, హాస్టల్ ఫీజు మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. మీ వద్ద డబ్బులు లేకుంటే విద్యారుణాలు కూడా మేమే ఇప్పిస్తాం. ఒకేసారి మొత్తం ఫీజు చెల్లించాలి. లేదంటే ఆన్లైన్ సౌకర్యం నిలిపివేస్తాం.

మీ పిల్లల అడ్మిషన్లు రద్దు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు థర్డ్ వేవ్ ప్రభావంపై విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆన్లైన్ క్లాసుల వైపే వారు మొగ్గు చూపుతుండగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తున్న బెదిరింపు ధోరని పట్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మహమ్మారితో కకావికలమైన విద్యావ్యవస్థ.. రెండు విద్యా సంవత్సరాల నుంచి ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ మూలంగా గతేడాది, సెకండ్ వేవ్ వలన ఈసారి ప్రత్యక్ష తరగతుల నిర్వహణ నిలిపివేసి, ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగిస్తున్నారు. కొద్దిరోజులుగా కరోనా తగ్గుముఖం పట్టగా ఈ నెల 1వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ విధానం కూడా ప్రారంభించవచ్చని ప్రభుత్వం సూచించింది. అయితే, వసతిగృహాలు మాత్రం నడపవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు పద్ధతుల్లో బోధన చేపట్టాలంటూ సూచించింది.

ఇందుకనుగుణంగా విద్యా సంస్థల నిర్వహణ చేపట్టాల్సి ఉండగా నగరంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్ష తరగతులకు విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటం, ఫీజుల వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో వసతి గృహాల్లో ఉండాలంటూ విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా ఫోన్లు చేస్తూ హాస్టల్లో చేర్పించాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అసలే థర్డ్ వేవ్ ముంపు పొంచి ఉందని వైద్యవర్గాలు ప్రకటిస్తుండగా, ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులు వెనక ముందాడుతున్న తరుణంలో పిల్లలను హాస్టళ్లలో చేర్పించాలంటూ ఇబ్బందులకు గురి చేయడం, కేవలం డబ్బులు దండుకోవడం కోసమేనని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణపైనే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా విద్యాశాఖ తర్జనభర్జన పడుతుండగా కార్పొరేట్ యాజమాన్యాలు మాత్రం తమ విద్యాసంస్థలకు అనుబంధంగా హాస్టళ్ళు తెరిచి దర్జాగా నిర్వహిస్తూ, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధించటం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

హాస్టళ్లు ఎలా ఓపెన్ చేస్తారు.. పర్మిషన్ ఎవరిచ్చారు..?

ప్రభుత్వం కరోనా భయంతో రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు తెరవటానికి అనుమతి ఇవ్వకపోయినా కార్పొరేట్ కాలేజ్ నుండి పేరెంట్స్‌కు ఫోన్లు చేస్తున్నారు. 11వ తేదీ నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మీరు మొత్తం ఫీజు చెల్లించి మీ పిల్లలను కాలేజ్‌కు పంపండి, లేకపోతే అడ్మిషన్ ఉండదని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు తెరవడం లేదు. మరి ప్రయివేట్, కార్పొరేట్ కళాశాలలు మాత్రం ఎలా ఓపెన్ చేస్తారు. కరోనా భయంతో ఇంటర్ విద్యార్థులను హాస్టల్‌కు పంపడానికి తల్లితండ్రులం భయపడుతున్నాం. కానీ, కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఈ విధంగా బెదిరిస్తున్నారు. ఫీజులు కట్టిన తర్వాత గతేడాది మాదిరిగా ఎలాగు కరోనా బూచిని చూపి కాలేజీలు, హాస్టళ్లు మూసివేసి పిల్లలను ఇంటికి పంపిస్తారు. పేరెంట్స్ భయం కూడా అదే. మరి ప్రభుత్వం ఈ ప్రైవేట్ కాలేజీల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి ఫుల్ ఇయర్ ఫీజు ఇప్పుడే చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ దొరికిన కాడికి దండుకుందామనేది వారి ఆలోచన. మరి పిల్లలు కాలేజీకి వెళ్లిన తరవాత ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు. ప్రభుత్వం బాధ్యతనా.. కార్పొరేట్ కాలేజీ యజమాన్యాల బాధ్యతనా.. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.

-కాసర్ల వెంకటరమణ, పేరెంట్

Tags:    

Similar News