పోకిరీల వీరంగం.. బాలికల హాస్టల్‌కు రక్షణ కరువు

దిశ, గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా, మాటలు నీటి ముఠాలుగానే మిగిలిపోతున్నాయి. పోకిరీల బెడతతో ఎంతోమంది విద్యార్థినీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. అలాంటే సంఘటనే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్‌లోని గురుకుల బాలికల హాస్టల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెనుకబడిన తరగతుల బాలికల పాఠశాలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే గతకొన్ని నెలలుగా పాఠశాల వెనుక భాగంలోని […]

Update: 2021-12-19 10:10 GMT

దిశ, గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా, మాటలు నీటి ముఠాలుగానే మిగిలిపోతున్నాయి. పోకిరీల బెడతతో ఎంతోమంది విద్యార్థినీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. అలాంటే సంఘటనే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్‌లోని గురుకుల బాలికల హాస్టల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెనుకబడిన తరగతుల బాలికల పాఠశాలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే గతకొన్ని నెలలుగా పాఠశాల వెనుక భాగంలోని గోడ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థినీలు స్నానాలు చేసే సమయంలో చూస్తున్నారని తల్లిదండ్రులతో పాటు పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు విమలకు కూడా విద్యార్థినులు తెలియజేశారు. ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. రక్షణ లేదంటూ తమ పిల్లలని ఇంటికి తీసుకెళ్ళారు. అయితే దీనిపై తమకు ఇంతకు ముందు ఎటువంటి సమాచారం లేదని పాఠశాల యాజమాన్యం చెప్పడం గమనార్హం.

పొంతనలేని ప్రిన్సిపాల్ మాటలు

పాఠశాలలో సుమారుగా 400లకు పైగా విద్యార్థినులు ఉన్నారు. అయితే, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఇదివరకే మీడియాకు సైతం తెలియజేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అయినా, ఎవరూ పట్టించుకోలేదని ఏకంగా విద్యార్థినిల తల్లిదండ్రులే రోడ్లమీదకు వచ్చి నిరసన కార్యక్రమం చేశారు. దీంతో తమ హాస్టల్ వద్ద పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులకు ప్రిన్సిపల్ విమల ఇచ్చిన లేఖను మీడియాకు చూపించారు.

హాస్టల్‌లో అనుమానిత వస్తువులు…?

సుమారుగా 400 మందికి పైగా విద్యార్థినులు ఉంటోన్న హాస్టల్‌లో కొన్నిచోట్ల నిషేధిత వస్తువులు సైతం దర్శనమిచ్చాయి. దీనిపై పాఠశాల యాజమాన్యానికి సూచించగా తమకేం తెలియదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అంతేగాకుండా హాస్టల్‌లో జరిగిన విషయాలపై ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది సిబ్బంది సైతం విద్యార్థినులను హాస్టల్‌లో దూషిస్తున్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి.

ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాము : సీఐ రమేష్ బాబు

గతంలో హాస్టల్ వద్ద పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, అప్పటినుండి ప్రతిరోజు మా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని వన్ టౌన్ సీఐ రమేష్ బాబు ఫోన్‌లో తెలిపారు. ఇంతకుముందు ఈ సంఘటనపై తమకు ఎప్పుడు సమాచారం లేదని, ఆదివారం పాఠశాల నుండి సమాచారం అందిన వెంటనే పోలీసు సిబ్బందిని హాస్టల్‌కి పంపించినట్లు తెలిపారు.

Tags:    

Similar News