ఇల్లాలి అక్రమ సంబంధం.. కూలిన ‘కాపురం’

దిశ, వెబ్‌డెస్క్: ఇల్లాలి అక్రమ సంబంధం కుటుంబాన్ని కూల్చివేసింది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న జీవితంలో తప్పటడుగులు వేసిన మహిళ తన చేతులతోనే నిండు నూరేళ్ల కాపురాన్ని సర్వనాశనం చేసుకుంది. ఇద్దరితో అక్రమ సంబంధం నెరుపుతూ భర్తతో ఏమీ తెలియనట్లుగా నటిస్తూ జీవితాన్ని నడిసముద్రంలో నాటు పడవలా మార్చుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అభం శుభం తెలియని చిన్నారితో పాటు తనలో సగభాగమైన భర్తను పోగొట్టుకొని దిక్కుతోచని స్థితికి చేరింది. ఇటు అయినవారు, అటు భర్త బంధువుల నుంచి […]

Update: 2020-07-12 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇల్లాలి అక్రమ సంబంధం కుటుంబాన్ని కూల్చివేసింది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న జీవితంలో తప్పటడుగులు వేసిన మహిళ తన చేతులతోనే నిండు నూరేళ్ల కాపురాన్ని సర్వనాశనం చేసుకుంది. ఇద్దరితో అక్రమ సంబంధం నెరుపుతూ భర్తతో ఏమీ తెలియనట్లుగా నటిస్తూ జీవితాన్ని నడిసముద్రంలో నాటు పడవలా మార్చుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న అభం శుభం తెలియని చిన్నారితో పాటు తనలో సగభాగమైన భర్తను పోగొట్టుకొని దిక్కుతోచని స్థితికి చేరింది. ఇటు అయినవారు, అటు భర్త బంధువుల నుంచి ఛీత్కారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో అడ్డదారులు తొక్కుతూ ప్రతినిమిషం తలదూరిస్తే తర్వాత జరిగిన పరిణామాలు ఎంతటి విషాదకర, భయానక ప్రపంచాన్ని చూపుతాయో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భువనగిరి ఘటనే ఉదాహరణ.

మిస్డ్‌కాల్‌తో పరిచయం.. ప్రేమ వివాహం

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సూరనేని కళ్యాణ్‌రావు, ఏపీలోని అనంతపురంజిల్లా గుత్తికి చెందిన అనూషకు మిస్డ్‌కాల్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే వీరిద్దరు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌తో ఒకరి మనసులు ఒకరు అర్థం చేసుకొని 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆరేళ్ల పాప ఆద్య. యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న కళ్యాణ్‌రావు కూతురు చదువు కోసం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం ఇస్మాయిల్‌ఖాన్‌గూడలోని విహారి హోమ్స్‌లో ప్లాట్ తీసుకొని ఉంటున్నారు. అయితే కల్యాణ్‌రావు ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ కూతురే లోకంగా బతుకుతున్నాడు. ప్రతిరోజు ఉదయమే డ్యూటీకి వెళ్లి రాత్రికి పొద్దుపోయాక ఇంటికి చేరుకునేవాడు.

అక్రమసంబంధానికి దారి తీసిన సెల్‌ఫోన్ ఈఎంఐ

కొన్నినెలల క్రితం కొత్త మొబైల్‌ కోసం షోరూమ్‌కు వెళ్లిన అనూష‌కు ఈఎంఐ విషయంలో చర్చించే సమయంలో కరుణాకర్‌తో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడి తర్వాత అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే భర్త ఇంట్లో లేనప్పుడు కరుణాకర్‌ను ఇంటికి పిలిపించుకునేది. అయితే కరుణాకర్‌ అనూష ఇంటికి వచ్చేటప్పుడు తన మిత్రుడు రాజశేఖర్‌ను కూడా తీసుకొని వెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే అనూష, కరుణాకర్‌కు విభేదాలు రావడంతో అతన్ని దూరం పెట్టింది. అప్పటికే కరుణాకర్‌కు తెలియకుండా రాజశేఖర్‌తో సన్నిహితంగా ఉంటున్న అనూష… కొద్దిరోజుల నుంచి అతనికి ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకుంటోంది.

ఈ విషయం మొత్తం తెలుసుకొని అనూష ఇంటికి వెళ్లిన కరుణాకర్… అక్కడ రాజశేఖర్‌ బైక్, చెప్పులు ఉండటం చూసి కోపంతో ఊగిపోయాడు. ఇదే సమయంలో కరుణాకర్ రాకను గమనించిన అనూష రాజశేఖర్‌ను బెడ్‌రూమ్‌లో దాచి పెట్టింది. కరుణాకర్ కేకలు వేస్తూ.. రాజశేఖర్‌ను బయటకు పంపాలని గట్టిగా అరుస్తూ తలపులను తన్నాడు. ఆ సమయంలో రాజశేఖర్‌ను బెడ్‌రూమ్‌ నుంచి బాత్‌రూమ్‌లో దాచిన అనూష.. కూతురుతో డోర్ తీయించింది. అప్పుడు చిన్నారి ఆద్య గొంతుపై సర్జికల్ బ్లేడు పెట్టిన కరుణాకర్.. రాజశేఖర్‌ను బయటకు తీసుకురాకుంటే చంపుతానని బెదిరించాడు. ఇంట్లో ఎవరూ లేరు, వెళ్లిపోవాలని అనూష చెప్పడంతో కోపానికి గురైన కరుణాకర్‌ చిన్నారిని గొంతు కోసి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కరుణాకర్, రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈనెల 2న హత్యకు గురైన చిన్నారి ఆద్య అంత్యక్రియలను భువనగిరిలో నిర్వహించి అప్పటినుంచి కల్యాణ్‌రావు, అనూష అక్కడే ఉంటున్నారు. శనివారం ఉదయం అనూష తన పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో భువనగిరి నుంచి సికింద్రాబాద్ తీసుకువచ్చి అనంతపురం జిల్లా గుత్తి బస్సును ఎక్కించాడు. తర్వాత భువనగిరికి చేరుకున్న కల్యాణ్.. కొద్దిసేపు స్టేషన్లో కూర్చొని తర్వాత నడుచుకుంటూ వెళ్తూ సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న రైలు కింద పడి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కూతురే లోకంగా బతికిన తండ్రి, భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆమెను ఇంటికి పంపించి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కూతురు చనిపోయినప్పటి నుంచి కనీసం రోజుకు ఒక్కసారి కూడా అన్నం తినకుండా ఉన్న కల్యాణ్‌ బాధను భరించలేక కూతురు ఆద్య దగ్గరకి వెళ్లిపోయాడని అతని సోదరుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు.

Tags:    

Similar News