గుస్సాడీకి గుర్తింపు రావాలి

‘‘గుస్సాడీ నృత్యం.. దేవుడు నాకిచ్చిన వరం.. ఆ దేవుడి కోసమే దీన్ని నేర్చుకున్న.. ప్రాచీన, పురాతన సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో 45 ఏళ్లుగా గుస్సాడీ చేస్తున్న.. వేలాది మందికి విద్యను నేర్పించా.. ఆ దేవుడి దయ వల్లనే ఈ రోజు జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది” అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ రారాజు కనకరాజు అన్నారు. రాజుగోండుల ప్రాచీన నృత్యానికి గుర్తింపు తెచ్చిన గుస్సాడీ మాస్టర్ కనరాజుకు ఆర్ట్స్ విభాగంలో కేంద్రం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. […]

Update: 2021-01-31 20:17 GMT

‘‘గుస్సాడీ నృత్యం.. దేవుడు నాకిచ్చిన వరం.. ఆ దేవుడి కోసమే దీన్ని నేర్చుకున్న.. ప్రాచీన, పురాతన సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో 45 ఏళ్లుగా గుస్సాడీ చేస్తున్న.. వేలాది మందికి విద్యను నేర్పించా.. ఆ దేవుడి దయ వల్లనే ఈ రోజు జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది” అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ రారాజు కనకరాజు అన్నారు. రాజుగోండుల ప్రాచీన నృత్యానికి గుర్తింపు తెచ్చిన గుస్సాడీ మాస్టర్ కనరాజుకు ఆర్ట్స్ విభాగంలో కేంద్రం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన ‘దిశ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గుస్సాడీ నృత్యం తనకు దేవుడిచ్చిన వరమన్నారు కనకరాజు. ప్రాచీన కళలు, సంప్రదాయాలను కాపాడాలనేదే తన తపన అని పేర్కొన్నారు. ‘‘నాకు ఈ విద్యను ఎవరూ నేర్పలేదు. 14 ఏళ్ల వయస్సు నుంచి చేస్తున్న. మాడావి తుకారాం సహకారం మరువలేనిది. హెమన్డార్ఫ్ మా ఊరిలో సేవలు చేశారు. ఆయనతో కలిసి పని చేసిన. 65 ఏళ్లుగా ఎందరికో ఈ విద్యను నేర్పిన. దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యం చేస్తాం. అంతకు నాలుగు నెలల నుంచి శిక్షణ ఇస్తాం. మా దేవుడి కోసం ఇది చేస్తున్నం. ప్రాచీన సంప్రదాయ కళలను కాపాడాలనే లక్ష్యంతో జాతరలు, గూడేలలో దీన్ని నేర్పిస్తున్న. ఈ కలను మర్చిపోకుండా చేయాలని ప్రయత్నిస్తున్న. నాతో పాటు కొందరు కలిసి నడుస్తున్నరు. కొందరు దీనిని అపహాస్యం చేసిండ్లు. అలాంటి కళకు ఈ రోజు దేశవ్యాప్తంగా గుర్తింపు రావటం ఆనందంగా ఉంది. మాడావి తుకారం గుస్సాడీ నృత్యం కోసం సహకరించారు. ఇందిరాగాంధీ హయాంలో అప్పటి రాష్ట్రపతి సమక్షంలో ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో టీంతో గుస్సాడీ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నం. గుస్సాడీ కళను మరింత విస్తరించాలి. ఇందుకు సర్కారు సహకరించాలి. ఆదివాసీ, గొండు గూడెల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రాచీన పురాతన కళలను కాపాడేందుకు సర్కారు ప్రోత్సాహం అందించాలి. ప్రాణం పోయే వరకు విద్యను నేర్పిస్తా. గోండుల గుస్సాడీ దండారీ నృత్యం బతికించాలనే నా ఆశ, శ్వాస’’అని వివరించారు.

కనకరాజు అంటే

గుస్సాడీ రారాజు, ఆదివాసీల మదిలో మహారాజు, గుస్సాడీ కనకరాజు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో జన్మించారు. రాము, రాజుబాయ్​ ఆయన తల్లిదండ్రులు. పారుబాయి, భీంబాయి అని ఇద్దరు భార్యలు. ముగ్గురు మగ పిల్లలు, ఆడపిల్లలు ఎనిమిది మంది సంతానం ఉన్నారు. గుస్సాడీనే ఇంటిపేరుగా మార్చుకున్న మహావ్యక్తి కనకరాజు. 65 ఏళ్లుగా గుస్సాడీ దండారీ నృత్యం చేస్తున్న ఆయన వేలాది మందికి విద్యను నేర్పించారు. డప్పు వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తుంటే అంతా మైమరిచిపోతారు. ఆయన సేవలు, కళను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 80 ఏళ్ల వయసులో నేటికీ గుస్సాడీ నృత్యంలో ఆదివాసీ గోండులకు శిక్షణ ఇస్తున్నారు. 1981లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇచ్చారు. 150 మందికి ఇందుకోసం శిక్షణ ఇవ్వగా 35 మంది ఢిల్లీ ప్రదర్శనకు తీసుకెళ్లారు. మాజీ రాష్ట్రపతి అబుల్ కలాం సమయంలోనే ఎర్రకోటలో ప్రదర్శన ఇచ్చారు. ఆదివాసీలకు ఆరాధ్యుడు, వారి సంక్షేమానికి పాటు పడిన హైమన్డార్ఫ్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన సహాయంలో 30 ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. డార్ఫ్ హయాంలో 47 వేల ఎకరాల పోడు భూమిని పంపిణీ చేయగా అందులో కనకరాజు భాగస్వామ్యం అయ్యారు. 1956లో గిరిజన సహకార సంస్థ ప్రారంభించేందుకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయం కూడా చేస్తున్నారు.

Tags:    

Similar News