విలోచవరం ప్రేమ పావురాలు మృతి.. ఒకే చితిపై దహనం

దిశ, మంథని: ఐదు దశాబ్దాల అనుభందం వారిది.. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శ మూర్తులు ఆ దంపతులు. ప్రేమ పావురాలు అని ముద్దుగా పిలుచుకునే ఆ జంట ఒకే సారి తనువు చాలించడం స్థానికంగా విషాదం నింపింది. కొట్లాటలకు, గొడవలకు తావు లేకుండా జీవించిన ఆ వృద్ధ జంట మరణంలోనూ కలిసి వెళ్లడం పలువురిని కంటతడి పెట్టించింది. మూడుముళ్ల బంధంతో 50 ఏళ్ల క్రితం ఒక్కటైన ఆ దంపతులు మరణంలో సైతం ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. భర్త […]

Update: 2021-10-05 08:45 GMT

దిశ, మంథని: ఐదు దశాబ్దాల అనుభందం వారిది.. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శ మూర్తులు ఆ దంపతులు. ప్రేమ పావురాలు అని ముద్దుగా పిలుచుకునే ఆ జంట ఒకే సారి తనువు చాలించడం స్థానికంగా విషాదం నింపింది. కొట్లాటలకు, గొడవలకు తావు లేకుండా జీవించిన ఆ వృద్ధ జంట మరణంలోనూ కలిసి వెళ్లడం పలువురిని కంటతడి పెట్టించింది. మూడుముళ్ల బంధంతో 50 ఏళ్ల క్రితం ఒక్కటైన ఆ దంపతులు మరణంలో సైతం ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. భర్త మరణించాడనే బాధ తట్టుకోలేక భార్య కూడా తనువు చాలించింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన మంథని లింగయ్య (65) మంగళవారం తెల్లవారు జామున అనారోగ్యంతో మరణించాడు. తన భర్త మృతిచెందాడని రోదించిన లింగయ్య భార్య రాజమ్మ (60) అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. భర్త దూరం అయ్యాడన్న మనోవేదనకు గురైన రాజమ్మ ఏడడుగులు వేసిన ఆయనతోనే నా జీవితం అన్నట్టుగా కన్నుమూసింది.

50 ఏళ్ల వైవాహిక బంధంలో వీరిద్దరూ.. ఏనాడూ గొడవ పడలేదని, వారిని ఆదర్శంగా తీసుకుని జీవనం సాగిస్తుంటామని గ్రామస్థులు తెలిపారు. అన్యోన్యతకు మారు పేరుగా నిలిచిన లింగయ్య, రాజమ్మల జీవన విధానం చూసి ప్రతి ఒక్కరు కూడా జంట అంటే ఇలా ఉండాలి అంటుండేవారు. కష్టంలో అయినా సుఖంలో అయినా పాలుపంచుకుంటూ బ్రతుకులు వెల్లదీసిన ఈ ఆదర్శ దంపతులు కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగించే వారు. మంగళవారం తెల్లవారు జామున గుండెలో నొప్పి వస్తుందని చెప్పిన భర్త లింగయ్య మరణించిన కొద్దిసేపటికే భార్య రాజమ్మ కూడా దుర్మరణం చెందారు. ఐదు దశాబ్దాలుగా కలిసి జీవనం సాగించిన తన భర్త తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కలత చెందిన రాజమ్మ కూడా మరణంలోనూ నీ వెంటే వస్తున్నానంటూ మృత్యువు ఒడిలోకి చేరిపోయారు. ఐదు దశాబ్దాల పాటు దాంపత్య జీవనాన్ని సాగించిన ఆ భార్యాభర్తలిద్దరూ ఒకే సారి మరణించడంతో కుటుంబ సభ్యులు ఇరువురి మృతదేహాలను ఒకే చితిపై దహనం చేశారు.

Tags:    

Similar News