తప్పు కవర్ చేయబోయి.. అడ్డంగా దొరికిపోయిన అధికారి
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేయడమంటే ఇదేనేమో. పంచాయతీల్లో జరుగుతున్న అవకతవకలపై కొరడా ఝులిపించాల్సిన ఆ అధికారే ఏకంగా హరితహారం మొక్కలకు నీళ్లు పోసేందుకు ఉపయోగించాల్సిన ట్యాంకర్‌ను తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. పైగా తాను చేసింది కరెక్టే అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వ్యవహారం గురించి మీడియాలో వెలుగులోకి రాగానే తాను డబ్బులు చెల్లించే ట్యాంకర్‌ను వాడుకున్నానని ఏకంగా […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేయడమంటే ఇదేనేమో. పంచాయతీల్లో జరుగుతున్న అవకతవకలపై కొరడా ఝులిపించాల్సిన ఆ అధికారే ఏకంగా హరితహారం మొక్కలకు నీళ్లు పోసేందుకు ఉపయోగించాల్సిన ట్యాంకర్‌ను తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. పైగా తాను చేసింది కరెక్టే అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వ్యవహారం గురించి మీడియాలో వెలుగులోకి రాగానే తాను డబ్బులు చెల్లించే ట్యాంకర్‌ను వాడుకున్నానని ఏకంగా కరీంనగర్ డీపీఆర్వో గ్రూపులో పోస్ట్ చేయించారు. రశీదుతో పాటు ఓ రిజాయిండర్ (ఖండన) కూడా పంపించారు. ఈ నెల 16న వివిధ పత్రికలలో వచ్చిన వార్తకు రిజాయిండర్ రాయాలని కోరారు. అయితే వాస్తవంగా ఈ ఘటన 16న చోటు చేసుకోగా 17న అన్ని పత్రికలలో వచ్చింది. కానీ పంచాయతీ అధికారి మాత్రం ఈ నెల 16న వివిధ పత్రికల్లో వార్త ప్రచురితం అయిందని, తాను రూ.500 అద్దె చెల్లించే ట్రాక్టర్‌ను తన ఇంటి అవసరాలకు వాడుకున్నట్టుగా రిజాయిండర్(పత్రికలకు పంపిన ఖండన)లో పేర్కొన్నారు. అయితే సదరు డీఎల్పీఓ రిజాయిండర్‌లో వివరించిన తీరు అందరిని విస్మయ పరుస్తోంది.
కార్యదర్శి సంతకమేది..?
వాస్తవంగా గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ వాడుకున్నందుకు రూ.500 అద్దె చెల్లించినట్టు రశీదును కూడా మీడియాకు డీఎల్పీఓ విడుదల చేశారు. అందులో బిల్ కలెక్టర్ / కారోబార్ అన్న చోట మాత్రమే సంతకం ఉంది. పంచాయతీ కార్యదర్శి సంతకం చేయాల్సిన చోట మాత్రం ఖాళీగానే ఉంది. పంచాయతీ ఆర్థిక లావాదేవీల విషయంలో పంచాయతీ కార్యదర్శి మాత్రమే రశీదుపై సంతకం చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ రిసిప్ట్‌పై కార్యదర్శి సంతకం లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హరిత ట్రాక్టర్ వాడొచ్చా..?
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యేకంగా ట్యాంకర్లను సమకూర్చింది. ఈ ట్యాంకర్లు పంచాయతీ పరిధి దాటి పోకూడదని నిబంధనలు చెబుతున్నాయి. కేవలం మొక్కలకు నీటిని అందించేందుకు మాత్రమే వినియోగించాల్సిన ఈ ట్యాంకర్ దుర్శేడ్ గ్రామం నుండి కరీంనగర్ సిటీలోని మారుతీనగర్‌కు ఎలా చేరుకుందన్నదే అంతు చిక్కకుండా తయారైంది. ఒక వేళ డీఎల్పీఓ డబ్బు చెల్లించే ట్యాంకర్ వాడుకున్నా.. కరీంనగర్‌లో అందుబాటులో ట్యాంకర్లు ఉంటాయి కదా..? గ్రామీణ ప్రాంతం నుండి తెప్పించుకోవడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నదే శేష ప్రశ్న.
తాను రూ.500 అద్దె చెల్లించే ట్యాంకర్‌ను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నప్పటికీ అవే డబ్బులతో కరీంనగర్ బల్దియాకు చెందిన ట్యాంకర్లను బుక్ చేసుకోవచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పంచాయతీల్లో చిన్న తప్పు చేస్తేనే సర్పంచులకు షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ల ఉత్తర్వులు జారీ చేస్తున్న విభాగంలో పనిచేస్తున్న డివిజనల్ స్థాయి అధికారి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే డబ్బు కట్టినట్టు రిసిప్టులు పెట్టి, మీడియాలో వచ్చిన వార్తలు తప్పని రిజాయిండర్ ఇచ్చారా అన్న చర్చ జిల్లాలో సాగుతోంది.