మందు బాబులకు అడ్డాగా డబుల్ ఇండ్లు..

దిశ ప్రతినిధి, మెదక్ : నిరుపేదల సొంతింటి గూడు కల ఇప్పట్లో నెరవేరేలా కన్పించడం లేదు. సీఎం స్వంత జిల్లాలో పనులు శరవేగంగా జరుగుతాయి. వెనువెంటనే ఇండ్లను పంపిణీ చేస్తారని ఎదురుచూస్తున్న ఆశావాహులకు నిరాశ తప్పడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో చాలా చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇంకా నిర్మాణ దశ దాటడం లేదు. నిర్మాణాలు పూర్తయిన వాటి పంపిణీలోనూ అంతులేని జాప్యం జరుగుతోంది. పలు ప్రాంతాల్లో […]

Update: 2021-07-27 16:55 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : నిరుపేదల సొంతింటి గూడు కల ఇప్పట్లో నెరవేరేలా కన్పించడం లేదు. సీఎం స్వంత జిల్లాలో పనులు శరవేగంగా జరుగుతాయి. వెనువెంటనే ఇండ్లను పంపిణీ చేస్తారని ఎదురుచూస్తున్న ఆశావాహులకు నిరాశ తప్పడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో చాలా చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇంకా నిర్మాణ దశ దాటడం లేదు. నిర్మాణాలు పూర్తయిన వాటి పంపిణీలోనూ అంతులేని జాప్యం జరుగుతోంది. పలు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన ఇండ్లు మందుబాబులకు అడ్డాగా మారాయి. మరికొన్ని చోట్ల ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తమకు డబుల్ ఇండ్లు కేటాయిస్తుందని ఆశ పెట్టుకున్న పేద కుటుంబాలు ఇంకా కిరాయి ఇళ్లలోనే మగ్గుతున్న పరిస్థితి నెలకొంది.

సిద్దిపేటకు పదిహేను వేల ఇండ్లు మంజూరు …

సీఎం స్వంత జిల్లా అయినా సిద్దిపేట జిల్లాకు అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం మొత్తం 15,690 ఇండ్లు మంజూరు చేయగా అందులో 13,930 ఇండ్లకు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ ఇచ్చారు. ఇంకా 1,760 ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. సాంక్షన్ అయిన వాటిలో 12,385 ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా, 8,865 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి. మిగితా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన వాటిలో 3,331 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు.

నియోజకవర్గాల వారీగా …

సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట , గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలోని పలు మండలాలు, జనగామ నియోజకవర్గంలలోని పలు మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్ల వివరాలు నియోజకవర్గాల వారీగా చూస్తే సిద్దిపేట నియోజకవర్గానికి 3,950 ఇండ్లు మంజూరు కాగా ఇందులో 3,727 ఇండ్ల నిర్మాణం ప్రారంభమై 3,423 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి. వీటిలో 2,443 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సొంతూరు చింతమడక గ్రామానికి సీఎం హెదాలో అదనంగా 1,136 ఇండ్లు మంజూరు చేయగా, అన్ని ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనా 354 ఇండ్లు మాత్రం నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి.

ఇక సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ లో 4,009 ఇండ్లు మంజూరు కాగా 3,825 ప్రారంభమై 2,695 నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ఇందులో 596 మాత్రం లబ్దిదారులకు అందించారు. దుబ్బాక నియోజకవర్గానికి ప్రభుత్వం 3,509 ఇండ్లు మంజూరు కాగా 2,774 ప్రారంభమై 1,975 నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ఇందులో 292 ఇండ్లను లబ్దిదారులకు అందించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి 660 మంజూరు కాగా, 612 నిర్మాణాలు మొదలై ఇప్పటి వరకు 160 పూర్తి చేసుకున్నాయి. జనగామ నియోజకవర్గానికి 385 మంజూరు కాగా , 188 నిర్మాణాలు మొదలై 157 పూర్తి చేసుకున్నాయి. మానకొండూర్ నియోజకవర్గానికి సంబంధించి బెజ్జంకి మండలానికి 377 మంజూరు కాగా, 120 నిర్మాణాలు మొదలై 98 పూర్తి చేసుకున్నాయి.

ఒక్క ఇంటిని కూడా పంచలే …..

సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, జనగామ, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఇన్నాళ్ళుగా ఒక్కటంటే ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు అందించిన పాపాన పోలేదు. డబుల్ బెడ్రుమ్ ఇండ్లకు వందల్లో దరఖాస్తులు వస్తుంటే .. నిర్మాణాలు మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ప్రజాప్రతినిధులు అనంతరం వాటి ఊసెత్తకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై వాగ్దానాలు ఇచ్చి , వాటిని ఇవ్వడంలో విఫలమవుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు , ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ తమ అసంతృప్తి ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.

మందుబాబులకు అడ్డాలుగా మారిన ఇండ్లు ….

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లు పేదలకు అందని ద్రాక్షగానే మారాయి. ఏండ్లు గడుస్తున్న ఇండ్లను ప్రజలకు పంపిణీ చేయకపోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మందుబాబులు డబుల్ ఇండ్లను అడ్డాగా చేసుకొని యథేచ్చగా మద్యం సేవిస్తున్నారు. ఈ సంఘటనపై గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ప్రారంభానికి ముందే శిథిలావస్థకు ..

డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఏండ్లు గడుస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ప్రారంభానికి ముందే శిధిలావస్థకు చేరుతున్నాయి. దుబ్బాక పట్టణంలో దాదాపు ఐదు సంవత్సరాల క్రితం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంత వరకు లబ్ధిదారులకు అందజేయకపోవడంతో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా మళ్లీ శిధిలావస్థకు చేరుకున్నాయి అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకిలోనూ ఇదే పరిస్థితి పంపిణీ చేయకపోవడంతో ఇండ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని, కిటికీల అద్దాలు పగలడం, డోర్లు విరుగుతూ ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణ పనులు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాలని కోరుతున్నారు.

ఆద్దె భారమవుతుందని ఆవేదన .. గతంలో ఈ ఇండ్ల పంపిణీ కోసమై గ్రామంలోని కొంత మంది ప్రజల వద్ద కొందరు నాయకులు వేలల్లో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామంలోని ఎంతోమంది నిరుపేదలు ఉండడానికి ఇండ్లు లేక చిన్న గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారనీ గ్రామ ప్రజలు వాపోతున్నారు. మరికొందరు డబుల్ ఇండ్లు వస్తుందని ఆశతో ఇంకా కిరాయి ఇండ్లలో జీవనం సాగిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఇంటి అద్దె భారమవుతుందని పలువురు ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి స్పందించి అర్హులైన వారిని గుర్తించి త్వరితగతిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News