పుల్వామా ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ దళాలపై జరిగిన ఉగ్రదాడి కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ దాడికి మైస్టర్ మైండ్‌గా కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్, అతని సోదరుడు రావుఫ్ అస్ఘర్ వ్యవహరించినట్టు పేర్కొంది. మొత్తం 13,500 పేజీల ఛార్జ్‌షీట్‌ను జమ్ముకోర్టులో మంగళవారం ఎన్‌ఐఏ దాఖలు చేసింది. పాకిస్తాన్ నుంచి పుల్వామా దాడికి ఎలా కుట్ర జరిగింది. అందుకు ప్రణాళిక, అమలుతీరును సవివరంగా పేర్కొంది. మొత్తం 19మందిపై అభియోగాలు […]

Update: 2020-08-25 09:56 GMT

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ దళాలపై జరిగిన ఉగ్రదాడి కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ దాడికి మైస్టర్ మైండ్‌గా కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్, అతని సోదరుడు రావుఫ్ అస్ఘర్ వ్యవహరించినట్టు పేర్కొంది. మొత్తం 13,500 పేజీల ఛార్జ్‌షీట్‌ను జమ్ముకోర్టులో మంగళవారం ఎన్‌ఐఏ దాఖలు చేసింది. పాకిస్తాన్ నుంచి పుల్వామా దాడికి ఎలా కుట్ర జరిగింది. అందుకు ప్రణాళిక, అమలుతీరును సవివరంగా పేర్కొంది. మొత్తం 19మందిపై అభియోగాలు మోపారు. ఇందులో జైషే మహ్మద్ కుట్రదారులు, వివిధ ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన ఉగ్రవాదులు, కుట్రకు అవసరమైన పరికరాలను సమకూర్చిన మరో ఆరుగురి పేర్లను చేర్చారు. ‘పుల్వామా దాడి కేసుకు సంబంధించి సుదీర్ఘమైన ఛార్జ్‌షీట్‌ను రూపొందించాం. జమ్ము కోర్టులో మంగళవారం దాఖలు చేశాం’ అని ఎన్‌ఐఏ డీఐజీ సోనియా నారంగ్ తెలిపారు.

పుల్వామా దాడి తర్వాత భద్రతా దళాల చేతిలో పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ కమాండర్ ఉమర్ ఫారూఖి హతమయ్యాడు. అతడి దగ్గర స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో ఆర్‌డీఎక్స్, పేలుడు పదార్థాల ఫొటోలు, కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ తదితర సమాచారం ఛార్జ్‌షీట్‌లో భాగంగా పేర్కొన్నారు. పుల్వామా దాడిని కీర్తిస్తూ అజార్ వీడియో, ఆడియో రికార్డులను కూడా పొందుపర్చారు. దాడి అనంతరం జైషే మహ్మద్ టెలిగ్రామ్ గ్రూప్‌లో ‘100 మంది భారతీయ హిందూ సైనికులు హత్యకు గురయ్యారు. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది’ అని పంపిన సందేశాలను కూడా పేర్కొన్నారు. ఛార్జ్‌‌షీట్‌లో అజార్‌తోపాటు సీఆర్‌పీఎఫ్ కాన్వయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడిన మానవ బాంబు అదిల్ అమ్మద్ ధర్, ఉమర్ ఫారూఖి, షాకిర్ బషీర్ మగ్రే, మహ్మద్ ఇక్బార్ రాథర్, బిలాల్ అహ్మద్ కుచే, వైజ్ ఉల్ ఇస్లామ్‌కు చెందిన మహ్మద్ అబ్బాస్ రాథర్, తారిఖ్ అహ్మద్ షా, ఇన్షా జాన్ తదితరుల పేర్లు ఉన్నాయి. 2019, ఫిబ్రవరి 14న పుల్వామా మీదుగా వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందిన విషయం విధితమే.

ఉమర్ ఫారూఖి: జైషే మహ్మద్ కమాండర్. పుల్వామా దాడిలో ఉపయోగించిన బాంబు‌ను అమర్చాడు. దాడిని దగ్గరుండి పర్యవేక్షించాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో హతమయ్యాడు. అతడితోపాటు మరో బాంబుల రూపకర్త కమ్రాన్‌ కూడా మరణించాడు.

షాకిర్ బషీర్ మగ్రే: పుల్వామా దాడి జరిగిన ప్రాంతంలో ఫర్నీచర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. భద్రతా దళాల కాన్వాయ్‌ కదలికలపై రెక్కీ నిర్వహించాడు. ఆ సమాచారం మొత్తం ఉగ్రవాదులు ఉమర్ ఫారూఖి, అదిల్ అమ్మద్ ధర్‌తో పంచుకున్నాడు. దాడికి ఉగ్రవాదులు వినియోగించిన కారును ఇతనే డ్రైవ్ చేశాడు. ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌)కు అవసరమైన గ్లౌవ్స్, బ్యాటరీ, అమ్మోనియం పౌడర్‌ను ఈ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా సేకరించడంలో కీలక పాత్ర పోషించాడు.

మహ్మద్ ఇక్బాల్ రాథర్: బుద్గాంకు చెందినవాడు రాథర్. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కశ్మీర్ తీసుకురావడానికి అవసరమైన రవాణా సౌకర్యాలను కల్పించాడని ఎన్‌ఐఏ తెలిపింది. జూలైలో రాథర్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు.

బిలాల్ అమ్మద్ కుచే: జైషే కోసం స్మార్ట్‌ఫోన్లను సేకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇందులో ఒక ఫోన్‌లో సీర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై‌కి ఆదిల్ అహ్మద్ ధర్ దూసుకెళ్తున్నప్పుడు వీడియో తీయడానికి ఉపయోగించారు.

Tags:    

Similar News