ఒలంపిక్స్ వేదిక మారనుందా?

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్ 2020 మరో ఆరు నెలల్లో ప్రారంభ కానున్నాయి. జులై 23 నుంచి టోక్యోలోనే క్రీడలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్ ప్రారంభమయ్యాక టోక్యోలు ఒలంపిక్స్ ఏర్పాటుపై వ్యతిరేకత వస్తున్నది. జపాన్ వాసులు తమ దేశంలో ఒలంపిక్స్ నిర్వహించడంపై అయిష్టత చూపుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక ఆన్‌లైన్ పోల్‌లో 70 శాతం మంది ప్రజలు ఒలంపిక్స్ నిర్వహించ […]

Update: 2021-01-26 06:20 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్ 2020 మరో ఆరు నెలల్లో ప్రారంభ కానున్నాయి. జులై 23 నుంచి టోక్యోలోనే క్రీడలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్ ప్రారంభమయ్యాక టోక్యోలు ఒలంపిక్స్ ఏర్పాటుపై వ్యతిరేకత వస్తున్నది. జపాన్ వాసులు తమ దేశంలో ఒలంపిక్స్ నిర్వహించడంపై అయిష్టత చూపుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక ఆన్‌లైన్ పోల్‌లో 70 శాతం మంది ప్రజలు ఒలంపిక్స్ నిర్వహించ వద్దని కోరారు. అంతే కాకుండా ఒలంపిక్స్‌కు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీలు కూడా మరింత భారం మోయలేమని చెబుతున్నాయి. స్థానికుల మద్దతు లేనిదే ఈ భారీ క్రీడా పండుగను నిర్వహించడం కష్టం. దీంతో అసలు టోక్యోలో ఒలంపిక్స్ జరుగుతాయా లేదా అనే సందిగ్దత నెలకొన్నది.

మేం నిర్వహిస్తాం..

టోక్యోలో ఒలంపిక్స్ నిర్వహణలో సందిగ్దత నెలకొనడంతో ఫ్లోరిడా నగరం ముందుకు వచ్చింది. జపాన్ కనుక ఒలంపిక్స్ నిర్వహించేందుకు సిద్దంగా లేని పక్షంలో తాము నిర్వహిస్తామని చెబుతున్నది. ఫ్లోరిడా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జిమ్మి పట్రోనిస్ సోమవారం అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ (ఐవోసీ)కి లేఖ రాశారు. ఫ్లోరిడా రాష్ట్రం ఒలంపిక్స్ నిర్వహించడానికి సిద్దంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘కరోనా కారణంగా ఒలంపిక్స్ నిర్వహించడానికి జపాన్ వెనకడుగు వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. అందుకే ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకోవాలని భావిస్తున్నాము. రాష్ట్రంలో అన్ని రకాల క్రీడా ఈవెంట్లు ప్రారంభమయ్యాయి. ఒలంపిక్స్ కోసం అవసరమైన స్టేడియంలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టే మేం ఈ ప్రతిపాదన చేస్తున్నాం’అని జిమ్మి పట్రోనిస్ ఆ లేఖలోపేర్కొన్నారు. ఐవోసి అవకాశం ఇస్తే.. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఒలంపిక్స్ ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

మేమే నిర్వహిస్తాం..

టోక్యో ఒలంపిక్స్‌పై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని జపాన్ ప్రధాని యోషిహిడే సుగ స్పష్టం చేశారు. మేం ఒలంపిక్స్ నిర్వహించడానికి సందేహిస్తున్నామని మీడియాలో వచ్చే వార్తలన్నీ సత్య దూరాలని ఆయన చెప్పారు. టోక్యోలో సురక్షిత వాతావరణంలో ఒలంపిక్స్ నిర్వహించి విజయవంతం చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ఫ్లోరిడా చెప్పినంత సులభంగా ఒలంపిక్స్ వేదిక మారే అవకాశం లేదని విశ్లేషకులు చెబెతున్నారు. ఏదో ఒక చిన్న టోర్నీని మార్చినంత సులభంగా ఒలంపిక్స్ వేదికను మార్చలేరని.. ఏళ్ల తరబడి ఒలంపిక్స్ కోసం ఆతిథ్య దేశాలు, నగరాలు సిద్దమవుతాయని.. ఇప్పటికిప్పుడు మార్చడానికి ఇదే చిన్న ఈవెంట్ కాదని అంటున్నారు. జపాన్ ప్రభుత్వం, టోక్యో మెట్రొపాలిటన్, ఐవోసి కోట్లాది రూపాయల డబ్బును ఒలంపిక్స్ కోసం వెచ్చించాయి. మరోవైపు జపాన్‌లో కనుక ఒలంపిక్స్ నిర్వహించలేకపోతే.. ఇక ఈ సారికి పూర్తిగా రద్దవుతాయి తప్ప వేదిక మార్చే ప్రస్తక్తి ఉండదని ఐవోసీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News