మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

Update: 2023-09-29 12:57 GMT

న్యూఢిల్లీ : ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ‘నారీ శక్తి వందన్’ చట్టంగా రూపుదాల్చింది. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం.. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌‌ను కల్పించాల్సి ఉంటుంది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ గురువారం రోజే మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సంతకం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేయడంతో ఈ బిల్లు చట్టంగా మారింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం పొందింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. వాస్తవానికి జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే అమలు చేస్తామని మహిళా రిజర్వేషన్‌ బిల్లులోని నిబంధనలు చెబుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జనాభా గణన నిర్వహించి, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.


Similar News