Woman Found Chained: అడవిలో గొలుసులతో బంధీగా మహిళ.. రక్షించిన గొర్రెల కాపరి
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సింధుదుర్గా దత్త అడవుల్లో 50ఏళ్ల మహిళను కొందరు దుండగులు గొలుసులతో చెట్టుకు కట్టేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సింధుదుర్గా దత్త అడవుల్లో 50ఏళ్ల మహిళను కొందరు దుండగులు గొలుసులతో చెట్టుకు కట్టేశారు. ఓ గొర్రెల కాపరి మహిళను చూడటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింద్ దుర్గ్‌లోని సోనూర్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఒక గొర్రెల కాపరి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అరుస్తూ.. గొలుసులతో బంధించబడిన మహిళ కనబడింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై స్థానికులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులకు విషయం చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. మహిళ వద్ద నుంచి పాస్‌పోర్ట్‌తో పాటు తమిళనాడు చిరునామాతో కూడిన ఆధార్ కార్డ్ సహా ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం సింధుదుర్గ్‌లోని ఓరోస్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పేరు లలితా కయీ అని వెల్లడించారు.
మహిళ మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆమె వద్ద మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లు సైతం ఉన్నాయని తెలిపారు. అయితే మహిళ వివరాలు ఇచ్చే పరిస్థితిలో లేదని, రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో బలహీనంగా ఉందని అధికారులు తెలిపారు. గత పదేళ్లుగా ఆమె భారత్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎంతకాలం గొలుసులతో బంధించబడిందో అనే వివరాలు వెల్లడించలేదు. ఆమె భారతదేశ పౌరురాలా లేదా మరేదైనా దేశానికి చెంది మహిళనా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా ఆమె బంధువులు తదితరులను కనిపెట్టేందుకు పోలీసు బృందాలు తమిళనాడు, గోవా తదితర ప్రాంతాలకు బయలుదేరినట్లు సమాచారం.