మోడీ ఇంకా మౌనంగానే ఉంటారా: జేడీఎస్ నేత వివాదంపై ప్రియాంకా గాంధీ
జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్) అధినేత దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్) అధినేత దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ స్పందించారు. ఈ విషయంలోనూ ప్రధాని మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ సెక్స్ స్కాండల్‌లో నిందితుడైన ప్రజ్వల్ పది రోజుల క్రితం ప్రధానమంత్రి భుజంపై చేయి వేసి ఫోటో దిగాడు. అంతేగాక ఆయనపై మోడీ ప్రశంసలు కురిపించారు. కానీ విషయం వెలుగులోకి రాగానే నిందితుడు పరారీలో ఉన్నారు’ అని పేర్కొన్నారు. ‘అయన చేసిన నేరాలు వింటేనే గుండె తరుక్కు పోతుంది. వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేశారు. అయినప్పటికీ ప్రధాని మోడీ మౌనంగానే ఉంటారా’ అని నిలదీశారు. కాగా, ప్రజ్వల్ రేవన్న లనేక మందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పలు వీడియోలు వైరలయ్యాయి. అనంతరం ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సిద్ధరామయ్య ప్రభుత్వానికి రాష్ట్ర మహిళా కమిషన్ సిఫారసు చేయడంతో సిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.