భారత్‌లో అమెజాన్ రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం టెక్ దిగ్గజ కంపెనీల సీఈవోలు కీలక ప్రకటనలు చేశారు.

Update: 2023-06-24 16:27 GMT

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం టెక్ దిగ్గజ కంపెనీల సీఈవోలు కీలక ప్రకటనలు చేశారు. భారత్ కు భారీ పెట్టుబడి ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ అత్యధికంగా రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడి ప్లాన్ ను వెల్లడించారు. భారత్ లో ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టామని.. రానున్న రోజుల్లో మరో రూ.1.23 లక్షల కోట్లు కూడా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ కలుపుకొని 2030 నాటికి భారత్‌లోని తమ అన్ని బిజినెస్‌లలో మొత్తం రూ.2.23 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు. భారత్‌లో కోటి చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి అమెజాన్ ప్రయత్నం చేస్తుందన్నారు. ఇండియాలోని స్టార్టప్‌ల ఎగుమతులకు ప్రోత్సాహం.. డిజిటలైజేషన్ కు మద్దతు ఇస్తామని ఆండీ జస్సీ చెప్పారు. "వచ్చే రెండేండ్లలో భారత్ నుంచి విదేశాలకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తాం. కొత్తగా 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. ఇప్పటివరకు భారత్‌లో 13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం" అని ఆయన తెలిపారు.

గుజరాత్‌లో గూగుల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌

గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్ సిటీలో గూగుల్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇండియా డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ రూ.81వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని వెల్లడించారు. ఇది భారత డిజిటల్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. సమీప భవిష్యత్తులో మరిన్ని భారతీయ భాషల్లో గూగుల్ వర్చువల్ అసిస్టెంట్ బార్డ్‌ను పరిచయం చేయాలని గూగుల్ యోచిస్తున్నట్లు పిచాయ్ చెప్పారు. భారత్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌కు మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. అంతకుముందు, గుజరాత్‌లో రూ. 22వేల కోట్లతో సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్టింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని అమెరికా చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్‌ టెక్నాలజీ ప్రకటించింది. భారత్‌లో టెస్లా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్ ఏర్పాటుపై ఎలాన్‌ మస్క్‌ కూడా సానుకూలంగా స్పందించారు. ఇక ప్రధాని మోడీ అమెరికా పర్యటన శనివారం ఉదయం ముగిసింది. ఆయన అక్కడి నుంచి ఈజిప్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో మోడీకి ఈజిప్టు ప్రధాని ముస్తఫా మద్బౌలీ స్వాగతం పలికారు. విమానాశ్రయంలో మోడీని ప్రవాస భారతీయులు, బోహ్రా ముస్లిములు కలిశారు.


Tags:    

Similar News