UPI crash: దేశవ్యాప్తంగా నిలిచిన యూపీఐ సేవలు.. ఇబ్బందులు ఎదుర్కొన్న యూజర్లు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు శనివారం దేశ వ్యాప్తంగా మూడు గంటల పాటు నిలిచిపోయాయి.

దిశ, నేషనల్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు శనివారం దేశ వ్యాప్తంగా మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు యూపీఐ సేవలు పని చేయలేదు. దీంతో పేటీఎం (Paytm), ఫోన్ పే (Phone pe), గూగుల్ పే (Google pe) వంటి సేవలను ఉపయోగించే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి వ్యక్తిగత, వ్యాపార లావా దేవీలు నిర్వహించలేకపోయారు. యూపీఐ సర్వర్ డౌన్ కారణంగా గూగుల్ పేలో 96, పేటీఎంలో 23 సమస్యలు గుర్తించారు. కీలకమైన సేవలు పూర్తి చేయలేక పోయామని యూజర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే యూపీఐ సేవలను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సమస్యను గుర్తించి క్లియర్ చేసినప్పటికీ 3 గంటల వరకు ట్రాన్జాక్షన్స్ చేయడంలో సమస్యలు ఎదురయ్యాయి. కాగా, గత 20 రోజుల్లోనే యూపీఐ లావాదేవీల్లో సమస్య తలెత్తడం ఇది మూడో సారి. అంతకుముందు మార్చి 26న కూడా యూపీఐలో సమస్యలు ఎదురయ్యాయి. దాదాపు రెండున్నర గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. అలాగే ఏప్రిల్ 2న కూడా యూపీఐ పని చేయలేదు. అయితే అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలను ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.